2జి స్పెక్ట్రమ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు


2జి స్పెక్ట్రమ్ కేటాయింపులలో వేలకోట్ల రూపాయలు దోచుకోబడ్డాయని సుప్రీంకోర్టులో కేసు వేయబడటం, దానిపై విచారణకు సుప్రీం ఆదేశించటమే కాక ప్రత్యేక పరిస్థితుల్లో విచారణను స్వయంగా పర్యవేక్షిస్తూ, సి.బి.ఐ. చేత త్వరితంగా పూర్తి చేయించి ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 10.30 నిమిషాలకు 2జి స్పెక్ట్రమ్ లో కేటాయించిన 122 లైసెన్సులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యలు గమనిద్దాం.   

1) దేశ సహజ వనరులు దేశ ప్రయోజనాల కోసమే కానీ వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు. 2) స్పెక్ట్రమ్ లాంటి సహజ నవరులపై హక్కులు కల్పించేటప్పుడు అందరికి తెలిసే విధంగా ప్రచారం కల్పించి వేలం విధానాన్ని అనుసరించాలి. 3) ఆర్ధిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, పారదర్శకత పాటించాలని ప్రధాని సూచించినా ఆనాటి టెలికం మంత్రి రాజ పట్టించుకోకుండా ఏకపక్షంగా లైసెన్సులు మంజూరు చేయటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా దుయ్యబట్టింది. 4) 2జి స్పెక్ట్రమ్ లో గృహమంత్రి చిదంబరం పాత్రపై విచారణ జరపాలని శ్రీ సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. దానిపై సి.బి.ఐ. ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకోవాలని, దానిపై రెండు వారాలలోగా నిర్ణయం ప్రకటించాలని సూచించింది.  5) ఈ వ్యవహారంలో పూర్తిగా లబ్దిపొందిన వారికి జరిమానా విధించింది. ఆ సొమ్ముని 50% బీదల సహాయం కోసం ప్రధానమంత్రి సహాయనిధిలో జమ చేయాలని ఆదేశించింది. 

ఈ కేసు విచారణలో మొదటినుండి క్రియాశీలక పాత్ర పోషించి అనేక ఆధారాలను సుప్రీంకోర్టుకు అందించడంలో ఒంటరిపోరాటం చేసిన శ్రీ సుబ్రమణ్య స్వామి అభినందనీయుడు. దేశ ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం నిర్మాణం చేసిన ఈ తీర్పు 2012 సంవత్సర చరిత్రలో నిలిచిపోతుంది. 

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో 60% సొమ్ము కాంగ్రెస్ అధినేత్రి, యూపియే చైర్ పర్సన్  సోనియా గాంధీకి ముట్టిందని, చిదంబరం తరువాత నా టార్గెట్ ఆమేనని తీర్పు వెలువడిన అనంతరం సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. 

ఈ తీర్పు ఇచ్చిన ఇద్దరు న్యాయమూర్తులలో శ్రీ అశోక్ కుమార్ గంగూలీ ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం పదవీ విరమణ చేశారు. విరమణకు ముందు జి.ఎస్.సింఘ్వీతో కలిసి ఇచ్చిన ఈ తీర్పు అత్యుత్తమమైనది, చారిత్రాత్మకమైనది.