అవినీతికి వ్యతిరేకంగా ఎబివిపి దేశవ్యాప్త నిరసన

అవినీతికి వ్యతిరేకంగా ఈ నెల 27 న ఎబివిపి నిర్వహించిన దేశవ్యాప్త నిరసన  కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభించింది. ఎబివిపికి చెందిన 'యూత్ ఎగైనెస్ట్ కరప్షన్' సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొని, అవినీతికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపించారు. దేశంలోని సుమారు 500 ప్రదేశాల్లో జరిగిన ఈ నిరసన ప్రదర్శనల్లో విద్యార్ధులు జిల్లా కలెక్టర్లకు, ఇతర అధికారులకు 'అవినీతిని అరికట్టాలి' అని కోరుతూ విజ్ఞాపన పత్రాలు సమర్పించడం ద్వారా భారత రాష్ట్రపతికి తమ సందేశాన్ని పంపించారు. సిమ్లాలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉమేష్ దత్త మాట్లాడుతూ... 'ఇది ఆరంభం మాత్రమే, అవినీతిని అరికట్టే చర్యలు తీసుకోకుంటే మున్ముందు ప్రభుత్వం యువత ఆగ్రహానికి గురికాక తప్పదు' అని హెచ్చరించారు.  ప్రభుత్వ కార్యాలయం నుండి అవినీతిని పారద్రోలేందుకు ప్రభుత్వంపై తీసుకొస్తున్న ఒత్తిడిలో భాగంగా ఆగస్టు 9 వ తేదీ నుండి "భ్రష్టాచారియోన్ - సత్తా చోడో" ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు అయన తెలిపారు. 
దేశంలో జరుగుతున్న అవినీతికి యుపియే చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తో పాటు ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా బాధ్యత వహించాల్సినదేనని ఎబివిపి డిమాండ్ చేసింది. ఎబివిపి ఆర్గనైజింగ్ సెక్రటరి శ్రీ సునీల్ అంబేద్కర్ మాట్లాడుతూ "అనేక సందర్భాల్లో ప్రధాని తన అబద్ధాల ద్వారా అవినీతి పరులకు రక్షణ కల్పిస్తుంటారు" అని విమర్శించారు. లోక్ సభలో కాంగ్రెస్ కు మెజార్టీ ఉన్నప్పటికీ, అవినీతి ప్రభుత్వం పట్ల దేశ ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదు" అని అయన అన్నారు. ప్రభుత్వం అన్ని వేళలా అవినీతి పరులకు రక్షణగా నిలుస్తూ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారిపై దాడులకు పాల్పడుతోందని ఎబివిపి విమర్శించింది.