అనంత పద్మనాభ స్వామి సంపదను హిందూ సమాజ ప్రయోజనాల కొరకే ఉపయోగించాలి


అనంత పద్మనాభ స్వామి

కేరళ లోని "అనంత పద్మనాభ స్వామి" దేవాలయం చారిత్రాత్మకమైనది. ఈ దేవాలయంలో అనంత సంపద ఉన్నదని ప్రతీతి. ఆ సంపదను, దేవాలయాన్ని దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నాము. దేవాలయ ట్రస్టీ గా తిరువనంతపురం రాజా ఉన్నారు. 1750 సంవత్సరంలో పాలించిన రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సమర్పించి ఒక సేవకుడిగా రాజ్య పాలనా చేశాడు. తరతరాలుగా ఆ దేవాలయాన్ని సంరక్షించుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య సుప్రీం కోర్టు ఆదేశం మేరకు ఏడుగురు సభ్యులు "పద్మనాభ స్వామి దేవాలయం భూగర్భంలో రహస్య గదులలో ఉంచబడిన సంపదను లెక్కింప చేసింది. ఆ సంపద లెక్కలన్నీ పత్రికలలో మనం చూశాము. పత్రికలకు ఇక ఒకటే పని. దానిపై రకరకాల వ్యాసాలు, వార్తలు, సలహాలు వ్రాయటం మొదలు పెట్టాయి. ఆ సంపదను ఏమి చేయాలనే  చర్చ లేవగొట్టాయి. ఈ చర్చలన్నీ హిందూ సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ దేవాలయం హిందూ సమాజానికి చెందినది. హిందూ సమాజ ప్రయోజనాలకు అనుగుణంగా ఆ సంపదను ఉపయోగించే విధంగా నిర్ణయం తీసుకోవాలి. ప్రజలలో గందర గోళం కలిగించే విధంగా చర్చలు లేవగొడుతున్నారు. దీనిని ప్రజలు గమనించాలి.

మహారాజ్ ను గౌరవనీయమైన స్థానంలో ఉంచి కొంతమంది ప్రముఖులతో ఒక సమితిని ఏర్పాటు చేయాలి. ఆ సమితిలో పెజావర్ పీఠాధిపతి లాంటి సాధుసంతులు ఉండాలి. వాళ్ళ నిర్ణయం మేరకు ఆ ధనాన్ని ఉపయోగించాలి. భారతీయ సంస్కృతి, భారతీయ విలువలు, విశేష పరిశోధనకు తిరువనంతపురం లో "ఇంటర్నేషనల్ పద్మనాభ హిందూ విశ్వ విద్యాలయం" ఏర్పాటు చేయాలి. సనాతన ధర్మ సంరక్షణకు అది వేదిక కావాలి. తద్వారా ప్రపంచంలో మానవతా విలువలు, సభ్య సంస్కృతిని వికసింప చేసేందుకు ప్రయత్నిచాలని కేరళ లోని భారతీయ విచార కేంద్రం (భారతీయ విలువల పరిరక్షణకై పని చేసే సంస్థ) దేశ ప్రజలకు పిలుపు నిచ్చింది.