పైన పటారం - లోన లొటారం

"మొనగాళ్ళకు మొనగాడిని నేనే, అన్నింట్లో నేనే ఉత్తముడిని" అని ఇంతకాలం ఊదరగొడుతున్న  బ్రిటన్ బండారం బయటపడింది. గత కొన్ని వారాలుగా బ్రిటన్ అల్లర్లతో అట్టుడికింది.  ఉత్తర లండన్ శివారు ప్రాంతం "టోటన్ హాం" లో మొదలైన అల్లర్లు చిలికి చిలికి గాలివానగా మారి బర్మింగ్ హాం, మాన్చేస్టర్ , లివర్పూల్, నటింగ్ హాం, బ్రిస్టల్ వంటి పెద్ద పట్టణాలకు వ్యాపించాయి. మార్క్ గ్గన్ (29) అనే నల్ల జాతీయుడిని పోలీసులు అతి దగ్గర నుండి కాల్చి చంపడం ఈ అల్లర్లకు అసలు కారణం. ఎంతో కాలంగా (మార్గరెట్ థాచర్ కాలం నుండి) అణగద్రోక్కబడి, చిన్న చూపుకు గురైన వర్గాల వారు పై సంఘటనతో రెచ్చిపోయి వీధులకెక్కారు. లండన్ ఎప్పుడూ ఎరుగనంత దారుణంగా దౌర్జన్యాలకు లోనైంది.  భవనాలకు నిప్పు పెట్టడం, షాపుల లూటీలు, దారిన పొయ్యే వారిపై దాడులు జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత స్కాట్లాండ్ పోలీసులు సైతం అదుపు చేయలేనంతటి స్థాయిలో గొడవలు జరిగాయి. ఐదు రోజుల పాటు లండన్లో అరాచకత్వం రాజ్యమేలింది. ఈ మాట మనమనడం లేదు. లండన్లోని బారిస్టర్లే  అంటున్నారు. చివరికి అమెరికా పోలీసు అధికారి ఐన బిల్ బ్రాటన్ సేవలు వినియోగించుకోవాలని బ్రిటన్  ప్రధాని ప్రతిపాదించ వలసి వచ్చింది.  అల్లర్లలో అయిదుగురు మరణించినట్లు, 2,200 మందికి పైగా అరెస్టయినట్లు  వార్త. పోలండు నుంచి వచ్చి లండన్ లో నివాసం ఉంటున్న మోనికా కోన్ జైక్ అనే మహిళ తనను తాను రక్షించుకోవడానికి ఎత్తైన భవనం పై నుండి రోడ్డు మీదికి దూకింది. తరువాత పత్రికల వారితో మాట్లాడుతూ -"లండన్ అంటే ఏమో అనుకున్నాను, అంతా అపోహేనని తేలిపోయింది. ఇక్కడి సమాజం కుళ్ళి పోయింది" అని అన్నది. 

కొసమెరుపు : బ్రిటన్లో సిక్కువారు నిర్వహిస్తున్న టివి చానెల్ 'సంగత్' వారి వీడియోల సహాయంతో పోలీసులు దుండగులను పట్టుకున్నారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సిక్కులను, వారి టీవిని మెచ్చుకున్నారు.  
- ధర్మపాలుడు