రాజ్యాంగ రచనకు బాలారిష్టాలు దాటని నేపాల్

కలియుగాబ్ది 5113 , శ్రీ ఖర నామ సంవత్సరం, భాద్రపద మాసం  

ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా ఉన్న నేపాల్ మావోయిస్టుల ఉద్యమం, ఇంకా అనేక పరిణామాల కారణంగా రాజరిక పాలన నుండి ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపించడానికి మార్గ దర్శకంగా ఉండేందుకు రాజ్యాంగ రచన జరగాలి. కాని ఇంతవరకు ఆ పని పూర్తి కాలేదు. 2005 లో సాయుధ సంఘర్షణలకు, బీభత్స కాండకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములైనట్లు ప్రకటించిన మావోయిస్టులు మళ్ళీ ఆయుధాలు పడతామని బెదిరింపులు సాగిస్తున్నారు. గతంలో సాయుధ పోరాటంలో పాల్గొన్న వారందరినీ సైన్యంలోకి తీసుకోవాలనేది మావోయిస్టుల లక్ష్యం. అదే జరిగితే సైన్యం మావోయిస్టు పార్టీకి  సాయుధ విభాగంగా మారే ప్రమాదముందని అక్కడి మిగిలిన రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. దానికి అభ్యంతరాలు చెపుతున్నాయి. ఈ పరిణామమే నేపాల్ రాజకీయ స్థిరత్వాన్ని, రాజ్యాంగ రచనను ముందుకు సాగనీయటం లేదు. 

రాజ్యాంగ రచనకు ఇటువంటి బాలారిష్టాలను అధిగమించలేని స్థితిలో నేడు నేపాల్ ఉంది. మూడేళ్ళ కాల వ్యవధిలో ముగ్గురు ప్రధానులు రాజీనామా చేయవలసి రావడం రాజకీయ వైరుధ్యాలకు అద్దం పడుతున్నది.  ఈ వైరుధ్యాలు తొలగించుకుని రాజ్యాంగ రచన ప్రక్రియను ముందుకు కదిలించటానికి అందరి అంగీకారంతో జాతీయ సమైక్యతా ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయించుకున్నారు. అదికూడా కార్య రూపం దాల్చకపోవటంతో మరోసారి ప్రధానిని ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఏతావాతా చెప్పేదేమంటే ఈ రోజున నేపాల్ ను రాజకీయ అనిశ్చిత పరిస్థితులు పాలిస్తున్నాయి. మావోయిస్టుల వ్యూహం కూడా అదేనా? నేపాల్ రాజ్యపాలన తమ చేతుల్లోకి రావాలనే ఎత్తుగడలతో మావోయిస్టులు సాగుతున్నారా?