హిందూ వ్యతిరేక కుట్ర - మతహింస నివారణ బిల్

24 అక్టోబర్ సాయంత్రం 6 గంటలకు గోదావరి ఖనిలో న్యాయవాద పరిషత్ అధ్వర్యంలో మతహింస నివారణ బిల్లుపై చర్చా వేదిక జరిగింది. ఈ చర్చకు సీనియర్ న్యాయవాది శ్రీ పింగిళి విశ్వేశ్వరరావు, సింగరేణి ఎస్.ఏం.ఎస్. ప్లాంట్ అధికారి శ్రీ రాజయ్య, గోదావరి ఖని జిల్లా సంఘచాలక్ శ్రీ భగవాన్ రెడ్డి, సమాచార భారతి రాష్ట్ర కార్యదర్శి శ్రీ మల్లికార్జున్ పాల్గొన్నారు.

చర్చా వేదికలో న్యాయవాది శ్రీమతి భవానీ, ఓ.సి.సి. క్లర్క్ కమ్రోద్దీన్, కమ్యూనిస్టు నాయకుడు శ్రీ స్వామి, టంగుటూరి కొమరయ్య బి.ఏం.ఎస్., బల్సూరి అమరేందర్ రావు, ఎస్.కుమార్ బి.జె.పి. తదితరులు ప్రసంగించారు. హిందుత్వం నుండి ఎస్.సి., ఎస్.టి.లను వేరు చేయటానికి ఈ బిల్ పెద్ద కుట్ర, అంతేకాదు దేశంలో ప్రజల మధ్య వైషమ్యాలను పెంచేందుకు ఈ బిల్ తయారుచేయబడిందని, భారతీయులుగా మనం అందరం ఈ బిల్లును వ్యతిరేకించాలని పలువురు అభిప్రాయపడ్డారు.

ప్రధాన వక్త శ్రీ మల్లికార్జున్ మాట్లాడుతూ "స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి దేశ ప్రజలను చీల్చే ప్రయత్నాలు కాంగ్రెస్ చేసుకుంటూ వస్తున్నది. ఈ దేశం పేరునే మార్చే ప్రయత్నం చేసిన ఘనత కాంగ్రెస్ కు ఉంది. రాజ్యాంగంలో ఈ దేశం పేరు ఇండియా అని వ్రాశారు. దానిపై చాలా గొడవ జరిగితే ఇండియా దటీజ్ భారత్ అని మార్చారు. వేల సంవత్సరాలుగా ఈ దేశం పేరు భారత్ అని ఉంటే ఇండియా గా మార్చాలని ఎందుకు ప్రయత్నిచారో అర్థం చేసుకోవాలి. 1990 నుండి భారత్ లో రాజకీయ పునరేకీకరణ జరగటం ప్రారంభమైంది. దాని కారణంగా కాంగ్రెస్ కష్టాలలో పడింది. ముస్లిములు, దళితులూ, గిరిజనులు కాంగ్రెస్ కు దూరమయ్యారు. వారిని మరల తన వోట్ బ్యాంకులుగా మార్చుకోవటానికి కాంగ్రెస్ మతహింస నివారణ బిల్లు తేవాలని చూస్తున్నది. మొదటి ప్రయత్నంగా సచార్ కమిటీ నివేదిక ఆధారంగా ముస్లింల కోసం అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారు. ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలు ఉగ్రవాదం, అవినీతి. వీటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఏం చెయ్యాలో ఆలోచించకుండా మత ఘర్షణల నివారణకు బిల్లు తయారు చేయటంలో కాంగ్రెస్ కుట్రను అర్థం చేసుకోవాలి. క్రైస్తవ మిషనరీలు ఈ దేశాన్ని క్రైస్తవమయం చేసేందుకు చేసే కుట్రలో భాగమే ఈ మతహింస బిల్లు. దీనిని మనందరం వ్యతిరేకించాలి" అని పిలుపునిచ్చారు.

- గంధం రవీందర్, గోదావరిఖని