64 సంవత్సరాల మన స్వతంత్ర భారతం -2

ఆగస్టు 15 నాడు 'లైవ్ ఇండియా' టివి చానెల్ లో ప్రసారమైన అంశాల ఆధారంగా 

ఆశావహ భారతదేశంలో దాగని నిరాశ  
అరవై నాలుగు సంవత్సరాల భారతావనిలో గాంధీజీ కలలు కన్న రామరాజ్యం అనే ఆశ ఒక స్వప్నంలా కనబడటానికి కారణాలు అనేకం.

స్వతంత్ర భారతావని ఎలా ఉండాలో గాంధీజీ యంగ్ ఇండియా, హరిజన్ పత్రికలలో స్పష్టంగా పేర్కొన్నారు. దేశంలో ప్రజలందరూ సమగ్రంగా అభివృద్ధి ఫలాలను అనుభవించాలని కోరుకొన్నారు. వివేకానంద దేశంలో కుక్కపిల్ల కూడా ఆహారం లేకుండా మరణించరాదనీ కోరుకున్నారు.  

దేశంలో దారిద్ర్యం ఒకవైపు, సంపన్నుల వృద్ధి మరోవైపు నాణేనికి రెండు పార్శ్వాలుగా వృద్ధి చెందాయి. ఒక వైపు అంబానీలు నిమిషానికి 25 రూపాయలు సంపాదిస్తూ ఉంటే మరో వైపు లక్షది మంది గంటకు ఐదు పైసలు కూడా సంపాదించలేని పరిస్థితి. 

భారతదేశంలో ఉండటానికి ఇల్లు, కడుపు నిండా తిండి, వైద్యం చేయించుకోగల స్థోమత, గౌరవనీయంగా కనపడడానికి అవసరమైన బట్ట లేనివారంతా పేదవారే. కాని మాంటెక్ సింగ్ అహ్లువాలియా నాయకత్వంలోని ప్రణాళికా సంఘం దృష్టిలో భారతదేశంలోని పేదల లక్షణాలు అంతకంటే ఘోరంగా ఉండాలి. భారత దేశంలో ఇప్పటికీ అనేకమంది ఆకలి బారినపడి చనిపోతున్నారు. మలేరియా వంటి నయం చేయగల జబ్బులతో కూడా చనిపోతున్న వారు అనేకమంది ఉన్నారు.  ఉండటానికి చోటు లేక, ప్లాట్ ఫాంల మీద, రైల్వే స్టేషన్లలో, రోడ్ల పక్కన తాత్కాలికంగా నీడ ఏర్పాటు చేసుకున్న వారు ప్రతి పట్నంలోనూ కనిపిస్తారు. పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, పని దొరకనివారు కోట్లాదిమంది ఉన్నారు. ప్రణాళికా సంఘం లెక్క ప్రకారం భారతదేశంలోని 122  కోట్ల మంది జనాభాలో కేవలం 37 శాతం మందే పేదలు! 

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని పరిగణించడానికి ప్రాతిపదిక ఏమిటని కోర్టు ప్రశ్నించగా, ప్రణాళికా సంఘం తన ప్రాతిపదికను వెల్లడించింది. దాని ప్రకారం (ద్రవ్యోల్బణంతో  సర్దుబాటు చేస్తే) పట్టణంలో నివసిస్తున్న వ్యక్తి నెలకు 578 రూపాయలు (13 డాలర్లు) కంటే ఎక్కువ ఖర్చు పెట్టగలిగినట్లయితే అతను దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లే. అంటే రోజుకు రూ. 20 కంటే తక్కువ. గ్రామంలో ఐతే రోజుకు రూ.15 కంటే ఎక్కువ ఖర్చు చేయగలిగితే అతను పేదవాడు కాదు. అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ప్రభుత్వ సహాయానికి అనర్హుడు.  

45  శాతం కటిక పేదలుగానూ 80 శాతం మంది సాధారణ పేదలుగానూ అంతర్జాతీయ ప్రమాణాల ప్రాతిపదికన లెక్క తేలినట్లు ప్లానింగ్ కమిషన్ తెలిపింది. అంటే భారతదేశంలో నూటికి 80 మంది 2 డాలర్ల సంపాదనతో బతుకులు వెళ్ళ దీస్తున్నారు. భారతదేశంలో జరిగిన వివిధ అధ్యయనాలు కనీస జీవనానికి రూ.40000 (నలభై వేలు) నుండి రూ.60000 (అరవై వేలు) వరకూ అవసరమని నిర్దారించాయని ప్రణాళికా సంఘం పత్రం ద్వారా తెలుస్తోంది. నిజానికి పెరుగుతున్న ధరలు, వాతావరణ కాలుష్యం వలన ఎదురౌతున్న జబ్బుల నుండి రక్షణ, చదువుల ఖరీదు ఇవన్నీ కలిపితే వారి అంచనాలు కూడా సరిపోవు. ఈ పరిస్థితుల్లో భారత దేశంలో దరిద్రుల నిర్మూలన జరుగుతుంది తప్ప దారిద్ర్య నిర్మూలన మాత్రం జరగదు.  

మనం సమరస భారతాన్ని ఒకరికి మరొకరు సహకారమిచ్చుకొంటూ నిర్మించుకోవాలి, రామరాజ్య నిర్మాణంలో విద్వేష పూరిత అసమానతలు ఆధారంగా కాదని ప్రతి వ్యక్తి తన కళను సాకారం చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలనే నిజాన్ని తెలియపరచాలి. అసలైన అవకాశ కల్పనను నిర్లక్ష్యం చేసి, వోట్ల కోసం పేదలను ఉపయోగించుకోవడం నాగరిక సమాజానికి సిగ్గుచేటు. దారిద్ర్యం తొలగిస్తామనే పేరుతో అనేక రకాల పథకాలతో వర్గాల మధ్య చిచ్చు పెట్టే శక్తులు తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకొంటున్నాయి. కాని ఈ పథకాల వల్ల పేదలకు, నిరుపేదలకు ఏమాత్రం ఉపయోగం లేదని ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లు నిరూపించాయి.  

స్వేచ్చానువాదం - జి.ఎల్.యెన్.