నమో గుజరాత్ !

నరేంద్ర మోడీ
"నమో" అంటే నమస్కారం అనుకునేరు! నమో అంటే నరేంద్ర మోడీ. గత దశాబ్దంగా దేశంలో చాలామంది రాజకీయ నాయకులు, పాత్రికేయులు, మీడియా ప్రముఖులు నరేంద్ర మోడీని తిట్టడం, దూషించడం, శాపనార్థాలు పెట్టడం, అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నించడం చేస్తూనే ఉన్నారు.  

కాని సమర్థుడూ, నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న మోడీ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రపంచ ప్రముఖులచే కీర్తించబడుతున్నాడు. ఎప్పుడూ హిందుత్వాన్ని దూషిస్తూ వ్యాసాలు వ్రాసే "జగ్ సురయ్యా" 26/10/2011 నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ప్రత్యేకంగా మోడీ గురించి ఈ విధంగా ఒక వ్యాసం వ్రాశాడు. ఎప్పటికో ఒకప్పటికి వాస్తవాలు గ్రహించక తప్పదు అన్నట్లుగా జగ్ సురయ్యా తన వ్యాసంలో ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించాడు.

"జపాన్ దేశానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ సుజుకి చైర్మన్ మోడీని కలుసుకుని 18 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో వెయ్యి ఎకరాల స్థలంలో ఏడాదికి 2 లక్షల కార్లు తయారుచేసే సామర్థ్యం కల ఒక కర్మాగారం గుజరాత్ లో నెలకొల్పే ఒక ప్రతిపాదన చేశాడు. దేశంలోనే కాక విదేశీయులకు కూడా పరిశ్రమలు స్థాపించడానికి గుజరాత్ మాత్రమే అనువుగా ఉన్నది. కేసులలో ఇరికించడానికి గత పది సంవత్సరాలుగా ఎవరెన్ని కుట్రలు చేసినా ఏ కేసూ నిరూపించబడక పోగా, ఇదే  పది సంవత్సరాల సమయంలో గుజరాత్ రాష్ట్రం ఒక పద్ధతిగా అభివృద్ధి చెందుతూ వస్తున్నది. నరేంద్ర మోడీ ఒక సమర్థుడైన పరిపాలనా దక్షుడుగా ఎదుగుతున్నాడు. ఇవ్వాళ మోడీని ప్రధానిగా చూడాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు".
జగ్ సురయ్యా వంటి కాలమిస్టు వ్రాయడం, టైమ్స్ పత్రిక ప్రచురించడం నిజంగా ఆశ్చర్యమే! కాని ఇది వాస్తవం. మరి 'నమో' అనడంలో అతిశయోక్తి ఏమీ లేనట్లే కదా!
26.10.2011, సంపాదక పుట
-ధర్మపాలుడు