మానవుల మధ్య విభజన రేఖలు సరికాదు

గురునానక్ దేవ్
"మానవుల మధ్య విభజన రేఖలు సరికాదు" అని బోధించిన గురునానక్ దేవ్ 1469 కార్తీక పౌర్ణమి రోజున తల్వాండీ అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆ గ్రామం ప్రస్తుతం పాకిస్తాన్లోని లాహోర్ కు  50 కి.మీ.దూరంలో ఉన్నది.  గురునానక్ అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డాడు. నాటి సమాజం అనుభవిస్తున్న కష్టాలకు కారణమైన వారిని అయన ఈసడించుకున్నాడు.

"నెత్తుటి మరక అంటుకున్న గుడ్డ ముక్క పనికిరాకుండా పోయినప్పుడు సాటి మనిషి రక్తాన్ని పీల్చి పిప్పి చేసేవారి మనస్సు కలుషితం కాకుండా ఉందని చెప్పగలమా?" అని సూటిగా ప్రశ్నించారు. సత్యం, సత్ప్రవర్తన, దయ, సద్బుద్ధి, భగవంతుడి గొప్పదనాన్ని గుర్తించడం వంటి లక్షణాలు అలవరచుకోవాలని గురునానక్ బోధించాడు. సత్యాన్ని, భగవంతుడిని తెలుసుకోవాలంటే మనిషిలో 7 గుణాలు తప్పకుండా ఉండాలని చెప్పారు. వారు చెప్పిన ఏడు గుణాలు 1) భగవంతుడు లేదా సత్యం బోధించేది ఒక్కటే, అది మానవులంతా ఒక్కటేనని, 2) భగవంతుడే సత్యం, సత్యాన్ని పాటిస్తూ జీవించడమంటే, భగవంతుడిని ఆరాధించడమే, 3) భగవంతుడిని తెలుసుకోవాలంటే ముందు జీవితం పట్ల నిర్మాణాత్మక దృష్టి ఉండాలి, 4) భయం, శత్రువులు లేనివాడు భగవంతుడు. కనుక మానవులు కూడా సత్యసాధనకు భయం లేకుండా, శత్రురహితంగా ఉండాలి, 5) భగవంతుడు అనంత సుందరుడు. మంచి మాటలు, చేతలు, ఆలోచనలకు అయన ప్రతిరూపం. భగవంతుడిని ఆరాధించడమంటే, జీవన ప్రాచుర్యాన్ని, శీల సంపత్తిని ఆరాధించడమే, 6) సత్యం స్వతంత్రమైనది. సత్యనిష్ఠ మనిషిని స్వేచ్ఛాయుతుడిని చేస్తుంది. సత్యం, స్వేఛ్చ అనేవి ఒకదానికొకటి  విడదీయరానివి, 7) గురువు ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం సిద్ధిస్తుంది. గురువు జ్ఞానానికి, వెలుగుకు ప్రతిరూపం.