అన్నా అవినీతి ఉద్యమాన్ని బలహీన పరచటానికి కుట్రలు పన్నుతున్న కేంద్రం

అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కేంద్రం తలొగ్గవలసి  వచ్చింది.  ఒక ప్రక్క జనలోక్ పాల్ బిల్లు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నది. దానికి రాజ్యాంగబద్ధంగా తీసుకొనిరావాలని కూడా ఆలోచిస్తున్నది. మరో ప్రక్క అన్నా హజారే ఉద్యమాన్ని బలహీన పరచాచానికి కూడా సన్నాహాలు చేస్తున్నది. దానికి దిగ్విజయ్ సింగ్ ను పురమాయించినట్లుగా ఉన్నది. అన్నాహజారే ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులపై వ్యక్తిగత దాడులకు కేంద్రీకరించింది. 

అన్నాహజారే బృందంలోని పౌర సమాజం తరపున బాధ్యతలు నిర్వహిస్తున్నవారు కూడా తమ ఉద్యమానికి సంబంధం లేని విషయాలు మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకొంది. ప్రశాంత్ భూషణ్ కాశ్మీర్లో ప్లెబిసైట్ నిర్వహించాలని ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. అన్నాహజారే కమిటీలోని సభ్యులు, స్వయంగా అన్నాహజారే కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తరువాత ప్రశాంత్ భూషణ్ పై భగత్ సింగ్ క్రాంతి సేన కార్యకర్తలు దాడి చేశారు. కారణం కాశ్మీర్ పై 'ప్లెబిసైట్' నిర్వహించాలని అయన పేర్కొనడమే అని పేర్కొన్నారు. ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. కాని దానికన్నా ముందు "కాశ్మీర్" అంశంపై డిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయబడ్డాయి. అప్పుడు ఏమీ మాట్లాడని భగత్ సింగ్ క్రాంతి సేన ఇప్పుడు స్పందించటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్లెబిసైట్ ప్రకటన కారణంగా కనబడుతున్నప్పటికీ వాస్తవానికి అన్నాహజారే బృందాన్ని బలహీన పరచడమే దాడి యొక్క ముఖ్యోద్దేశ్యంలా కనిపిస్తున్నది. ఇటీవలి కాలంలో కేంద్రంలోని పాలక పక్షానికి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నాహజారే బృందం ఒక కొరకరాని కొయ్యగా మారి సవాలు విసిరింది. ఆ బృందాన్ని నియంత్రించటానికి అనేక మార్గాల ద్వారా ప్రయత్నిచినప్పటికీ అన్నాహజారే బృందాన్ని నిలువరించలేకపోయారు.  ఆ విషయానికి వస్తే ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ కంటే అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమ ప్రచారానికే కేంద్రం ఎక్కువగా భీతిల్లింది.

'శ్రీరాంసేన' డిల్లీ శాఖ అధ్యక్షులు ప్రశాంత్ భూషణ్ పై జరిగిన దాడితో తమ సంస్థకు గాని, కార్యకర్తలకు గాని ఎటువంటి సంబంధం లేదని ప్రకటించగానే ప్రశాంత్ భూషణ్ పై దాడి చేసింది మేమేనని క్రాంతిసేన కార్యకర్తలు ప్రకటించుకోవడం జరిగింది. కాగా దాడి జరిగిన 3 రోజులకే నిందితులకు బెయిల్ కూడా లభించడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నది. అలాగే ప్రశాంత్ భూషణ్ పై దాడి జరిగిన 3 రోజులకే బృందంలో మరో ప్రముఖుడు అరవింద కేజ్రీవాల్ పై దాడి చేయటం జరిగింది. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా వచ్చిన విరాళాలు అరవింద కేజ్రీవాల్ కు చెందిన మరొక ట్రస్ట్ లో జమ చేసినట్లుగా మరొక వివాదం తెరపైకి వచ్చింది. అలాగే కిరణ్ బేడీపై విమాన ప్రయాణ టిక్కెట్ల వ్యవహారంపై ఒక వివాదం పత్రికల్లో వచ్చింది. ఇదంతా గమనిస్తే అవినీతిపై అన్నాహజారే చేస్తున్న ఉద్యమాన్ని బలహీన పరచాలనుకునే వారే ఇటువంటి చర్యలకు ప్రోత్సాహం ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
- పతికి