యుపిఎ చేతిలో జోక్ పాల్ గా మారిన లోక్ పాల్

రాజకీయ నాయకుల చేతిలో లోక్ పాల్ జోక్ పాల్ గా మారింది. ఉభయ సభల్లోనూ లోక్ "బాల్" గా ఆడుకొని ఎంజాయ్ చేశారు. పటిష్టమైన లోక్ పాల్ కావాలని యావత్ భారతమంతా అకాంక్షిస్తుంటే యుపిఎ ప్రభుత్వం మాత్రం అవినీతిని అడ్డంగా నరికే లోక్ పాల్ ఆయుధానికి పదును తగ్గించి, బండబారిన మొద్దులా మార్చేసింది. సవరణల సాకుతో కోరలను పీకేసింది. స్వతంత్రంగా విచారణ చేపట్టలేని విధంగా లోక్ పాల్ వ్యవస్థను పరిమితం చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.  లోక్ సభలో ఏడు సవరణలు చేసినా కనీసం మూడింట రెండొంతుల మెజార్టీ కూడా సాధించలేని యుపిఎ, రాజ్య సభకు వచ్చేసరికి తెలివిగా పలాయనం చిత్తగించింది. 

లోక్ సభలో ఎలాగోలా గట్టెక్కిన లోక్ పాల్ కు రాజ్య సభలో కాంగ్రెస్ మంగళం పాడింది.  లోక్ సభలో బిల్లుకు అనుకూలంగా 321 మంది ఓటేయగా, వ్యతిరేకంగా 71 మంది ఓటేశారు. ఓటింగ్ కు ముందే ఎస్పీ, బిఎస్పీ, బిజెడి, అన్నా డిఎమ్కేలు వాకౌట్ చేశాయి. ఇక రాజ్య సభలో అనవసర రాద్ధాంతం సృష్టించి, కలిసొచ్చిన సమయాన్ని తనకు అనుకూలంగా మలచుకొని యుపిఎ లోక్ పాల్ సవరణల జోలికెళ్ళకుండా బిల్లుపై చర్చను సాగదీసి 11 గంటల సమయాన్ని వృథా చేసింది. 245 మంది సభ్యులున్న రాజ్య సభలో యుపిఎ కు 93 మంది సభ్యుల బలం మాత్రమే ఉందని తెలిసి కూడా యుపిఎ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. బిల్లు బలహీనంగా ఉంది అని, దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బిజెపి, బిజెడి, జేడియు, ఎస్పీ, టిడిపి, వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఎందుకంటే 62 పేజీలున్న లోక్ పాల్ ముసాయిదాలో సిబిఐని లోక్ పాల్ నుండి మినహాయించారు. తనంతట తానుగా లోక్ పాల్ ఏ అధికారిపై విచారణ జరపలేదు. మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రభుత్వోద్యోగులపై వచ్చిన ఆరోపణలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని లోక్ పాల్ స్వీకరిస్తుంది. కానీ ఫిర్యాదులను సుమోటోగా తీసుకొని వాటిపై విచారించే అధికారం లోక్ పాల్ కు ఉండదు. కొన్ని రక్షణ చర్యలతో మాత్రమే ప్రధానిని లోక్ పాల్ పరిధిలోకి తీసుకొచ్చారు. 

లంచగొండులు, అవినీతి పరులను జైల్లో పెట్టాలని బిల్లులో ఎక్కడా లేదని, ఇంతటి బలహీనమైన బిల్లు వల్ల ఒరిగేదేమీ లేదని, కేంద్రంలో బలమైన లోక్ పాల్, ప్రతి రాష్ట్రానికి లోకాయుక్త ఏర్పాటు చేసినప్పుడే దేశంలో అవినీతిని కట్టడి చేయగలుగుతామని అన్న హజారే అన్నారు. బిల్లుని బలహీనం చేసి కాంగ్రెస్ దేశ ప్రజలను మోసగిస్తోందని మండి పడ్డారు. అయితే తాము మాత్రం ప్రజా పార్లమెంటు ముందుకు వెళ్తామని, త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో పర్యటించి నమ్మకద్రోహులకు ఓటేయ వద్దని కోరతామని, ఆ తరువాత సాధారణ ఎన్నికల్లోగా దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామని అన్నాహజారే చెప్పారు. 

లోక్ పాల్ బిల్లుని బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ ప్రవేశ పెడతామని యుపిఎ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అయితే పౌర సమాజం, ప్రజల ఆకాంక్షల మేరకు బిల్లులో కీలకాంశాలకు ఇంకా సవరణలు చేయాల్సి ఉంది. 

- హంసిని