ఆరోగ్యానికి ఆహారం - 1


ప్రపంచంలో ఏ దేశంలో కూడా మన దేశంలో ఉన్నటువంటి చక్కని, యోజనాబద్ధమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార పధ్ధతి లేదని చెప్పవచ్చు.  మానవులు రోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఈ నియమం బాలురకు, రోగులకు వర్తించదు. ప్రతిపూటా భోజనం చేసేముందు రెండు అల్లం ముక్కలను ఉప్పు అద్దుకొని తినడం వలన ఆకలి పుట్టును.

నిత్య ఆహార పధ్ధతి : యుక్తాయుక్త విచక్షణ లేక జిహ్వ చాపల్యంతో అతిగా భుజించు వారిని అజీర్ణము పట్టి వేధించి అనేక రోగములకు కారణమవుతుంది. మనం తినే ఆహారం హితంగా, మితంగా ఉండాలని మన ప్రాచీనులు నిర్ణయించారు. సృష్టిలోని అనేక ద్రవ్యాలను ఆహారంగా యోజన చేసి మనకందించారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా మన దేశంలో ఉన్నటువంటి చక్కని, యోజనాబద్ధమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార పధ్ధతి లేదని చెప్పవచ్చు. 

మానవులు రోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఈ నియమం బాలురకు, రోగులకు వర్తించదు. 

వేడిగా, తాజాగా ఉండు ఆహారాన్ని సేవించాలి. ఆయా ఆహార పదార్థములను చక్కగా వండి, శుభ్రమైన ప్రదేశంలో తినాలి. శుభ్రతను పాటించాలి. తొందరగా భుజించరాదు. 

భోజన ప్రారంభంలో తీయని పదార్థములు, తర్వాత పుల్లని పదార్థములు, కారము గల పదార్థములు, చివర మజ్జిగ లేక పాలు కలుపుకొని తినాలి. భోజనం చివరిలో అరటిపండు కాని, ఆయా ఋతువులలో లభించే పండును కాని తినాలి. ప్రతిపూటా భోజనం చేసేముందు రెండు అల్లం ముక్కలను ఉప్పు అద్దుకొని తినడం వలన ఆకలి పుట్టును. 


మనం నిత్యం వాడే ఆహార పదార్థాలు - వాటి గుణాలు : ధాన్యాలు, బియ్యము, గోధుమలు మొదలైనవి నిత్య ఆహార పదార్థాలు. వాటిలో బియ్యము తేలికగా జీర్ణమై చలువ చేస్తుంది. బలకరము. గోధుమలు తేలికగా జీర్ణము కాదు, చలువ చేయును. బలకరము. 

పప్పులన్నియు సహజంగా బలమైనవైనను తేలికగా జీర్ణం కావు. అపానవాయువు (గ్యాస్) ను కలుగచేయును. మల మూత్రములను బంధించును. బాగా జీర్ణశక్తి గలిగినవారు మాత్రమే పప్పులను ఎక్కువగా వాడాలి. పప్పులలో శ్రేష్ఠమైనవి  పెసర్లు.

పెసర్లు : తేలికగా జీర్ణమగును. చలువ చేయును. కండ్లకు మంచిది. అన్నిటికంటే నల్ల పెసర్లు శ్రేష్ఠమైనవి

మినుములు : తేలికగా జీర్ణం కాదు. బలకరము, శుక్రవృద్ధి చేయును. చంటి పిల్లల తల్లులకు స్తన్యమును వృద్ధి చేయును. శరీరములో క్రొవ్వును పెంచును. మూలశంక వ్యాథులలో మంచిది. 

బొబ్బర్లు : తేలికగా జీర్ణం కాదు, స్తన్యమును వృద్ధి చేయును. 

కందులు : తేలికగా జీర్ణమగును. చలువ చేయును. రక్తదోషాన్ని పోగొడుతుంది. బలకరము. 

మిగతా వచ్చే సంచికలో...