స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేద్దాం

కలియుగాబ్ది 5114 , శ్రీ నందన నామ సంవత్సరం, కార్తీక మాసం

స్వామి వివేకానంద జన్మించి వచ్చే జనవరి 12కు 150 సంవత్స రాలు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా మాతా అమృతానంద మయి మార్గదర్శనంలో 2013 జనవరి 12 నుండి 2014 జనవరి 12 వరకు దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు నిర్వహించుటకు సన్నాహాలు ప్రారంభమైనాయి.  

ఈ 21వ శతాబ్దంలో స్వామి వివేకానంద ఆలోచనలు భారతదేశ పునర్వైభవానికి, ప్రపంచ కల్యాణానికి ఎట్లా దోహదపడతాయో ప్రజలకు తెలియచేయవలసిన అవసరం ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 65 సంవత్సరాలు పూర్తి అయినాయి. ఈ 65 సంవత్సరాల కాలఖండంలో ఒక జాతిగా మనం శక్తివంతంగా నిలబడటానికి బదులు రాజకీయంగా, ఆర్థికంగా శక్తివంతం కావటానికి మాత్రమే ప్రయత్నించాం. దానితో శతాబ్దాలుగా సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి పూర్తిగా బయటపడలేకపోయాము.  

"ఈ దేశంలో మనమందరం హిందువులమని, అందుకు గర్వ పడాలని" వివేకానంద ఈ జాతికి పిలుపునిచ్చారు. ఈ దేశం సామాజికంగా, సాంస్కృతికంగా శక్తివంతమైనప్పుడే దేశం అభివృద్ధి సాధించగలుగుతుందని స్పష్టపరిచారు. ఒక జాతిగా మన వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే మనదేశంలోని అనర్థాలన్నింటికి మూలం అని చెప్పారు. ఆ జాతీయ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయటానికి మనం కృషి చేయాలని చెప్పారు.  

ఈ అంశాలను ఆధారం చేసుకొని ఈ సంవత్సరం (2013-2014) స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను నిర్వహించబోతున్నారు. వివేకానంద ఆలోచనలను మరోసారి దేశ ప్రజలందరికి అందించి జాతీయ చైతన్యం నిర్మాణం చేయటానికి కార్యక్రమాల రచన జరిగింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు జాతీయస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రిటైర్డు డిజిపి శ్రీ అరవిందరావు గారి అధ్యక్షతన ప్రాంత కమిటీ ఏర్పడింది. డిశంబర్ 25 నుండి ప్రారంభించి సంవత్సరమంతా జరగబోయే కార్యక్రమాలను కూడా ఆ కమిటీ ప్రకటించింది. రాబోవు సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాలలో మనం అంరం పాల్గొని స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను సాకారం చేద్దాం. ఈ దేశాన్ని శక్తివంతమైన దేశంగా నిర్మాణం చేద్దాం.