ఆరోగ్యానికి ఆహారం - 2

నువ్వులు చర్మమునకు మంచిది. స్తన్యమును వృద్ధి చేస్తుంది. దోసకాయ చర్మానికి, చర్మ సౌందర్యానికి మంచిది. ఉలవలు దగ్గు, ఆయాసం, జలుబులను తగ్గిస్తుంది. కాకరకాయ జ్వరం, రక్త దోషములను తొలగిస్తుంది. మధుమేహంను తగ్గిస్తుంది. కారట్ ముఖ్యంగా నేత్రములకు మంచిది. మునగ ఆకుల పట్టు వేస్తే చర్మవాపులు తగ్గుతాయి. టమోటా రక్తవృద్ధిని కలిగిస్తుంది. 


శెనగలు : చలువ చేయును. రక్త దోషాన్ని పోగొడుతుంది. తేలికగా జీర్ణము కాదు.
ఉలవలు : వగరుగా ఉండును. వేడి చేస్తుంది. తేలికగా జీర్ణమగును. దగ్గు, ఆయాసం, జలుబును తగ్గిస్తుంది. మూత్ర పిండములలో ఉన్న రాళ్ళను కరిగిస్తుంది. నులిపురుగులను నశింపచేస్తుంది.
నువ్వులు : కటు, తిక్త, మధుర, కషాయ రసములు కలిగి ఉంటుంది. వేడి చేస్తుంది. గురుగుణం కలిగి ఉంటుంది. చర్మమునకు మంచిది. స్తన్యమును వృద్ధి చేస్తుంది. వాత రోగములను పోగొడుతుంది. 

శాకములు (కూరగాయలు) 


కంద : వగరుగా ఉంటుంది. ఆకలిని పుట్టిస్తుంది. మూలశంక వ్యాధిని పోగొడుతుంది. ప్లీహ రోగములలో పథ్యము. కుష్టు, చర్మ రోగములు కలవారు దీనిని తినరాదు.
పెండలము : చలువ చేయును, మలబద్ధం చేస్తుంది. తియ్యగా ఉంటుంది. తేలికగా జీర్ణం కాదు. బలకరము.
చిలగడదుంప : బలాన్ని ఇస్తుంది. తియ్యగా ఉంటుంది. హృద్రోగములలో మంచిది, కడుపుబ్బరమును కలిగిస్తుంది.
బంగాళాదుంప : తియ్యగా ఉంటుంది. బలకరము, కడుపుబ్బరమును కలిగిస్తుంది. జీర్ణం ఆలస్యమవుతుంది.
ముల్లంగి : కారంగా ఉంటుంది. వేడి చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కామెర్లు, కాలేయ వ్యాధులందు బాగా పని చేస్తుంది. మూత్ర పిండములలో రాళ్ళను కరిగించును.
 

కారట్ : తియ్యగా ఉంటుంది. ఆకలిని, జీర్ణ శక్తిని పెంచుతుంది. రక్తవృద్ధిని కలిగిస్తుంది. మూలవ్యాధిని తగ్గిస్తుంది, ముఖ్యంగా నేత్రములకు మంచింది.

అరటికాయ : తియ్యగాను, వగరుగాను ఉంటుంది. పైత్యమును తగ్గిస్తుంది. నులి పురుగులను నశింపచేస్తుంది.
గుమ్మడికాయ : చలువ చేస్తుంది, బలాన్ని కలిగిస్తుంది, రక్తస్రావాన్ని అరికడుతుంది. మూత్రాన్ని జారీ చేస్తుంది.

 

సొరకాయ : హృదయానికి మంచిది, మూత్రంను జారీ చేస్తుంది.
దోసకాయ : చలువ చేయును, మూత్రాన్ని జారీ చేయును, చర్మానికి, చర్మ సౌందర్యానికి మంచిది.
పొట్లకాయ : అత్యంత పథ్యం. బలాన్ని ఇస్తుంది. రుచిని కలిగిస్తుంది. హృదయమునకు మంచిది, నులిపురుగులను నశింప చేస్తుంది. పైత్యమును, వాతాన్ని తగ్గిస్తుంది. శుక్రవ్రుద్ధిని కలిగిస్తుంది.
కాకరకాయ : చేదుగా ఉంటుంది. జ్వరం, రక్త దోషములను తొలగిస్తుంది. మధుమేహంను తగ్గిస్తుంది. జ్వరం, నులి పురుగులను నశింప చేస్తుంది.

బీరకాయ : చలువ చేయును. తియ్యగా ఉంటుంది. పైత్యమును తగ్గించును, జీర్ణం చేస్తుంది. జ్వరం, ఆయాసములలో పథ్యంగా పని చేస్తుంది. నులి పురుగులను పోగొడుతుంది.

దొండకాయ : చలువ చేయును, మందము చేస్తుంది, మలబద్ధాన్ని కలిగిస్తుంది. తేలికగా జీర్ణం కాదు, పైత్యాన్ని తగ్గిస్తుంది.


వంకాయ : లేత వంకాయాలనే వాడాలి. ఇవి అత్యంత పథ్యము, కఫం, వాతములను తగ్గిస్తుంది. తేలికగా జీర్ణమగును, మలమూత్రములను జారీ చేయును. బలకారి, చర్మ వ్యాధులందు వాడరాదు. ముదిరిన వంకాయ వాడరాదు, దురదలను పుట్టిస్తుంది. 

మునగకాయ : మధుర, కషాయ రసంలు కలిగి ఉంటుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. కుష్టు, క్షయ, ఆయాసం వ్యాధులలో మంచిది. మునగ ఆకుల పట్టు వేస్తె చర్మ వాపులు తగ్గుతాయి.

బెండకాయ : వేడి చేస్తుంది. మలబద్ధమును చేస్తుంది. రుచిని కలిగించును.
టమోటా : రక్త వృద్ధి చేస్తుంది. పులుపు గుణాన్ని కలిగిస్తుంది. పైత్యం చేస్తుంది. ఆకు కూరలతో కలిపి తింటే మూత్ర పిండములలో రాళ్ళు పడతాయి.

వచ్చే సంచికలో ఆకు కూరల గురించి...