మీ శిశువుకు పాలు లేవా! బొప్పాయి తినండి

ఆరోగ్యానికి ఆహారం - 4

బొప్పాయి కాయను కూరగా చేసి తినిపిస్తే తల్లుల్లో స్తన్యము వృద్ధి చెందుతుంది. పిల్లల పోషణకు ఇతర జంతువుల పాలకన్నా తల్లి పాలే మిన్న. పాలు ఎక్కువ పోషక అంశాలతో కూడి అందరికి హితమైన సంపూర్ణ ఆహారం. నిమ్మపండు చర్మ రోగములను తగ్గించును. ఆహారంలో రాత్రిపూట పెరుగు సేవించుట నిషిద్ధం. గర్భిణీ స్త్రీలు బొప్పాయి కాయను తినరాదు.

బొప్పాయి

బొప్పాయి : బొప్పాయి పైత్య దోషాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని కలిగిస్తుంది. స్తన్యవృద్ధిని చేస్తుంది. బొప్పాయి కాయను కూరగా చేసి తినిపిస్తే తల్లుల్లో స్తన్యము వృద్ధి చెందుతుంది. హృదయానికి మంచిది. ఋతుస్రావాన్ని కలిగిస్తుంది, కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ ఫలాన్ని కూడా తినరాదు.

నిమ్మపండు

నిమ్మపండు : ఆకలి పుట్టించును, కడుపు నొప్పి తగ్గించును, అరుచిని పోగొట్టును, గర్భిణులకు కలుగు వాంతులను తగ్గించును, ఉత్సాహమును కలిగించును. ఇందు ఉన్న విటమిన్ సి వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగును. నిమ్మపండు జలుబును తగ్గించును, చర్మ రోగములను తగ్గించును, జ్వరములలో కలుగు అరుచి, వికారములను తగ్గించును. 

నేరేడు

నేరేడు : గ్రాహిగుణము కలిగి ఉండును. మలబంధము చేయును. వగరు రుచి కలిగి ఉండును. జీర్ణకారి. మధుమేహం తగ్గించును. రక్త దోషములను పోగొడుతుంది. 

సీతాఫలం

సీతాఫలం : చలువ చేస్తుంది. బలం కలిగిస్తుంది. రక్తస్రావం అరికడుతుంది. మూత్ర రోగాలను తగ్గించును. ఎక్కువగా వాడినచో అతిమూత్రవ్యాధి కలుగును. విరేచనకారి. ఋతుస్రావాన్ని కలిగిస్తుంది, కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ ఫలాన్ని తినరాదు. 

జామపండు

జామపండు : జామ కఫవృద్ధి , వాతవృద్ధి చేస్తుంది. బలం కలిగించును. శుక్రవ్రుద్ధిని కలిగించును. ముదురు జామపండ్లు అజీర్ణం కలిగించును. 

ఈ విధంగా ఆయా ఋతువులలో లభించే ఫలాలను సేవించుట వలన ఆయా ఋతువులలో వచ్చు రోగములను అరికట్టవచ్చును. 

పాలు

పాలు : పాలు వివిధ జంతువుల నుండి స్తన్యముగా లభించును. పిల్లల పోషణకు ఇతర జంతువుల పాలకన్నా తల్లి పాలే మిన్న. తల్లి పాలు అన్ని పోషక విలువలు కలిగి అమృతంతో సమానమైనది. ఆవు పాలు, మేక పాలు మనుష్యులకు మంచిది. గేదె పాలు అత్యంత మందముగా ఉండును. పాలు ఎక్కువ పోషక అంశాలతో కూడి అందరికి హితమైన సంపూర్ణ ఆహారం.

పెరుగు

పెరుగు : ఆవు పెరుగు శ్రేష్ఠం. బలకరం. ఆకలిని, జీర్ణశక్తిని పెంచును. పుష్టిని కలిగించును. గేదె పెరుగు కఫాన్ని కలిగించి, జలుబు, దగ్గులకు కారణమవుతుంది. తేలికగా జీర్ణం కాదు. రక్త దోషాన్ని కలిగిస్తుంది. ఆహారంలో రాత్రిపూట పెరుగు సేవించుట నిషిద్ధం. పెరుగు అనేక వ్యాధులందు నిషిద్ధమయినది. పెరుగును మజ్జిగగా చేసి వాడవలయును.

- డా.పి.బి.ఏ. వేంకటాచార్య 

ఆయుర్వేద శీర్షిక వచ్చే సంచికతో ముగుస్తుంది. ఈ శీర్షికపై మీ స్పందనను తెలియచేయండి. మీ స్పందన మాకు ప్రోత్సాహకరం కాగలదు.
- సంపాదకుడు