50 ఏళ్ళనాటి చైనా డ్రాగన్ దాడి

కలియుగాబ్ది 5114 , శ్రీ నందన నామ సంవత్సరం, శ్వీయుజ మాసం

కమ్యూనిస్టు చైనా భారత్ పై దురాక్రమణకు పాల్పడి 2012 అక్టోబర్ 20తో యాభై ఏళ్ళు పూర్తయ్యాయి. ఓ వైపు ఆనాటి భారత ప్రధాని నెహ్రూతో పంచశీల ఒప్పందంపై సంతకాలు చేసిన సిరా తడి ఆరకముందే అప్పటి చైనా అధ్యక్షుడు చౌ-ఎన్-లై భారత్ ను వెన్నుపోటు పొడిచాడు. చైనా 1962లో భారత్ పై దురాక్రమణకు దిగి 38వేల చ.కి.మీ. భూమిని ఆక్రమించుకొంది. చైనా చేసిన దురాక్రమణ గాయం నేటికీ ఇంకా మానకపోగా గుండెను పిండేస్తూనే ఉంది.  

తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. తమ భూముల సరిహద్దులపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. కబ్జాదారుల చెర పడకుండా కట్టుదిట్టమైన కంచె వేస్తారు. అవసరమైన చోట కాపలాదారులను ఏర్పాటు చేస్తారు. ఇది ప్రతి యజమాని చేసే సర్వసాధారణమైన విధి. ఈ విధి దేశ పాలకులకు కూడా వర్తిస్తుంది. అయితే దురదృష్టవశాత్తూ మన తొలి ప్రధాని మన సరిహద్దుల విషయంలో ఎన్నడూ ధృడంగా వ్యవహరించలేదు. బుసలు కొట్టే డ్రాగన్ దురాక్రమణ పన్నాగాలపై ఆయన ఎప్పుడూ దృష్టి సారించలేదు. బ్రిటిష్ పాలకులు కూడా టిబెట్ రక్షణ కోసం అక్కడ లాసా సమీపంలో తమ సైన్యాన్ని కాపలా ఉంచారు. అట్లాగే  రక్షణ కోసం గిల్గిత్, బల్టీస్తాన్ లలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసారు. టిబెట్ పరిసర ప్రాంతాల నుంచి సైనిక పోస్టులను, సైన్యాన్ని ఉపసంహరించవద్దని బ్రిటిష్ వారు వెళ్తూ వెళ్తూ నెహ్రూకు సలహా కూడా ఇచ్చారని కొందరు చరిత్రకారులు తమ రచనల్లో పేర్కొన్నారు. అది బ్రిటిష్ వారి దూరదృష్టి. నాటి మన ప్రధానికి ఆ దూరదృష్టి లేదు. కాని నాటి ఉపప్రధాని సర్దార్ పటేల్ 1949లోనే చైనా దుష్ట పన్నాగాలపై అప్రమత్తమయ్యే ప్రయత్నం చేశారు. టిబెట్ ఆక్రమణ అనంతరం చైనా అస్సాంలోని అరుణాచల్ ప్రదేశ్ పై సైతం దురాక్రమణ చేసే ప్రమాదం ఉందని పటేల్ నెహ్రూను హెచ్చరించారు. అయితే ఎటువంటి హెచ్చరికలను నెహ్రూ పట్టించుకోకపోగా, రక్షణకై అసలు ఇంత బడ్జెట్ అవసరం లేదనే వరకూ వెళ్ళారు. అంతేగాక ఫార్వర్డ్ పాలసీ పేరుతో మెక్ మోహన రేఖకు లోపల ఉన్న భారత సైనిక పోస్టులను తరలించి ఏమాత్రం రక్షణ అవసరం లేని చోట్ల వేయించారు. దీనిపై సైనికాధికారుల హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. ఇదే అదనుగా భావించిన చైనా తన పీపుల్స్ ఆర్మీని వెంటనే టిబెట్ పైకి ఉసిగొల్పింది. చైనా దురాక్రమణను అడ్డుకొన్న వందలాది మంది బౌద్ధ భిక్షువుల్ని ఊచకోత కోసింది. పటాల ప్యాలెస్ లో దలైలామాను బంధించేందుకు సైతం వెనుకాడలేదు. ఆ ముట్టడి నుంచి తప్పించుకుంటూ దలైలామా భారత్ కు శరణార్థిగా వచ్చారు. ఆయన వెంట మరో లక్షమంది వచ్చారు. వీరందరికీ నెహ్రూ ఆశ్రయం కల్పించారు. తటస్థ విధానం అంటూ నెహ్రూ ఊహాలోకాలలో విహరిస్తూ ఉండగా పంచశీల పేరుతో భారత్-చైనాల మధ్య కుదిరిన ఒప్పందానికి తూట్లు పొడిచి చైనా భారత్ పైకి దురాక్రమణకు తెగబడింది. దీనిని వైఫల్యంగా భావించిన మన విపక్షాలు నెహ్రూను నిలదీశాయి. మరో విచిత్రమేమిటంటే దేశంపై చైనా దురాక్రమణ చేస్తుంటే మన ప్రధాని నెహ్రూ, రక్షణమంత్రి కృష్ణమీనన్ లు విదేశీ పర్యటనకు వెళ్ళారు. ఎలాంటి వ్యూహాలు, రక్షణ ఏర్పాట్లు లేకుండానే చైనా సైన్యాన్ని తరిమివేయాలని నెహ్రూ మన సైన్యాన్ని ఆదేశించారు. 

కాని నాడు భారత సైనికుల వద్ద ఆధునిక దుస్తులు కానీ బూట్లు కానీ, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే వ్యవస్థ కానీ, శత్రువులను నిలువరించేందుకు బుల్లెట్లు కానీ, కనీసం ఆహారం కూడా లేదు. ఈ స్థితిలో పదివేల మంది సైనికుల్ని నెహ్రూ ప్రభుత్వం చైనా సరిహద్దులకు పంపించింది. మరోప్రక్క 1962 అక్టోబర్ 20న 80 వేల సైన్యంతో చైనా భారత్ పై దురాక్రమణ ప్రారంభించింది. దాదాపు 16వందల అడుగుల ఎత్తున్న మంచుకొండల్లో, గడ్డకట్టే చలిలో, రెండో ప్రపంచయుద్ధం నాటి 303 తుపాకులతో, చాలీ చాలని తూటాలతో భారత సైనికులు తమ చివరి రక్తం బొట్టు వరకు వీరోచితంగా పోరాడారు. ఇటువంటి సామాన్య ప్రతిఘటనకే చైనా అదిరింది. అసలు భారత్ నుండి ఇటువంటి ప్రతిఘటన ఎదురౌతుందని  ఊహించనే లేదు. అటు అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్, ఇటు కాశ్మీర్ లోని ఆక్సాయ్ చిన్ భూభాగాలను ఆక్రమించిన తరువాత ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించింది. తరువాత తవాంగ్ నుంచి తన బలగాలను వెనక్కు పిలిపించింది. ఒకరకంగా ఇది ఒక హెచ్చరికగా చైనా తాత్కాలిక విరమణ ప్రకటించింది. తానే యుద్ధం ప్రారంభించి, తానే విరమణ ప్రకటించింది. ఇది చైనా ఎత్తుగడ నీతి.

38వేల చ.కి.మీ. భారత భూభాగం ఇప్పటికీ చైనా ఆధీనంలోనే ఉంది. ఈ యుద్ధంలో 1383 మంది భారత్ సైనికులు వీరమరణం పొందగా, 722 మంది చైనా సైనికులు కూడా మరణించారు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన నెహ్రూ తరువాతి కొద్దికాలానికే కన్నుమూశారు. నాటి నుంచి నేటి వరకు కూడా అనేకసార్లు చైనా మనల్ని కవ్వించింది, కవ్విస్తూనే ఉన్నది.