డిశంబర్ 6న ఏం జరిగింది? దాని చారిత్రక నేపథ్యం ఏమిటి?

ప్రస్తుతం అయోధ్య రామజన్మభూమిలో నిర్మితమై ఉన్న చిన్న రామమందిరం
 
డిశంబర్ 6 వస్తున్నదంటే దేశమంతా ఒక ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. డిశంబర్ 6 వచ్చి వెళ్ళేవరకు దేశంలో కొంతమంది నల్లజెండాలతో ప్రదర్శన, నిరశన ర్యాలీలు జరుపుతూ ఉంటారు. మరోప్రక్క ఛానళ్ళు పాతదృశ్యాలను పదేపదే ప్రదర్శన చేస్తూ హోరెత్తిస్తాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఏమిటి డిశంబరు 6 విశేషం? 
 
డిశంబరు 6, 1992 నాడు అయోధ్యలో రామజన్మభూమి స్థలంలో నిర్మించిన బాబరీ కట్టడం కూల్చివేయబడింది. ఆ రోజున దేశమంతటి నుండి వెళ్ళిన కరసేవకులు రామజన్మభూమి స్థలంలో ఉన్న బాబరీకట్టడాన్ని కూల్చివేసి అదే స్థలంలో రాముడికి ఒక చిన్నమందిరం కట్టారు. దేశమంతటి నుండి కరసేవకులు అక్కడికి చేరి ఆ కట్టడాన్ని కూల్చివేయడానికి కారకులెవరు? దేశప్రజలలో, అందులోనూ హిందువులలో అంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? బహుశ అక్కడికి చేరిన కరసేవకులకు అన్నిమార్గాలు మూసుకుపోయాయి అనిపించి ఉండవచ్చు. ఇలా ఎందుకనిపించింది? అయోధ్యలో రామజన్మభూమి స్థలము ఎందుకు అట్లా శతాబ్దాల తరబడి వివాదాస్పదంగా ఉండిపోయింది? ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఈ దేశనాయకులు, మేధావులు, పెద్దలు ఏం చేశారు? వివాదం మరింత తీవ్రమయ్యేందుకు ఆజ్యం పోసారా? వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారా? ఈ ప్రశ్నలకు సరియైన సమాధానం దొరికితేనే వాస్తవ పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితులకు ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి? ప్రస్తుత స్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. 
 
చారిత్రక నేపథ్యం : 1528వ సంవత్సరం మొగలురాజు బాబరు యొక్క సేనాని అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో ఉన్న రామమందిరాన్ని కూలగొట్టి అక్కడ మసీదులాంటి ఒక కట్టడాన్ని కట్టాడు. రామమందిరం కూలగొట్టబడుతున్నదని తెలుసుకున్న ప్రజలు వేలాదిమంది అక్కడకు చేరుకున్నారు. అక్కడ నరసంహారం చేయబడింది. ఏ రోజున రామమందిరం కూలగొట్టబడిదో ఆ రోజునుండి 76 సార్లు ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు పోరాటం సాగింది. ఈ విషయమై స్వతంత్రం వచ్చేనాటికి వేలమంది తమ ప్రాణాలను అర్పించారు. స్వతంత్రపోరాటం జరుగుతున్న రోజులలో అయోధ్యలోని హిందువులు-ముస్లింలు కలిసి సామరస్యపూర్వక పరిష్కారానికి కొంతప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు బ్రిటిష్ పాలకులు సాగనివ్వలేదు. ఆ సమయంలో ఏర్పడిన ఉద్రిక్తపరిస్థితులను అణిచేసే ప్రయత్నం జరిగింది. ముస్లిం పాలకుల కాలం గురించి చెప్పనవసరం లేదు. బ్రిటిష్ పాలకుల కాలంలో కూడా ఆ సమస్యకు న్యాయమైన పరిష్కారం దొరకలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అయోధ్య ప్రజలు భావిచారు. 
 
రామలల్లా
 
స్వాతంత్యానంతరం ఒకరోజు ఆ బాబరీ కట్టడంలో రామలల్లా విగ్రహం వెలిసింది. ఆ వార్త అయోధ్య మొత్తాన్ని కదిలించింది. ప్రజలు తండోపతండాలుగా అక్కడికి చేరుకొని రామలల్లా దర్శనం చేసుకోసాగారు. దీనితో ముస్లింలు ఆందోళనకు దిగటంతో ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ నెలకొన్నాయి. దానితో విగ్రహం ఉన్న గదిగేటుకు తాళం పెట్టబడింది. ఎవరి ఆదేశంతో ఇది జరిగిందో ఎవరికి తెలియదు. ఆ గేటువద్ద నుండే ప్రజలు రామలల్లాను దర్శనం చేసుకోసాగారు. రాజీవ్ గాంధీ పాలిస్తున్న కాలంలో కోర్టులో పిటిషన్ వేసిన కారణంగా విచారణ జరిగి గేటు తాళం తీసారు. భక్తుల రాకపోకలు సాగుతూనే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1989 వరకు రామజన్మభూమి విషయం అక్కడి స్థానికులకు మాత్రమే పరిమితమైంది. 1989 లో ఆ విషయం దేశప్రజల దృష్టికి తీసుకొనివెళ్ళే ప్రయత్నం జరిగింది. దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. రామజన్మభూమి న్యాస్ ఒకటి ఏర్పడింది. దేశవ్యాప్తంగా రామశిలాపూజలు, రథయాత్రలు, కరసేవకుల తయారీ జరిగింది. ఉద్యమం దేశమంతా విస్తరించింది. ప్రపంచమంతా వ్యాపించింది. 1990, 1992లలో అయోధ్యలో కరసేవ జరిగింది. దేశవ్యాప్తంగా 10 లక్షలమందికి పైగా రామభక్తులు అన్నిరకాల ఆటంకాల మధ్య అయోధ్యకు చేరుకున్నారు. ఈ సమయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవలసి ఉంది. 
 
అయోధ్య రామజన్మభూమి వివాదంపై కోర్టులలో నలుగుతున్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు అటు కేంద్రప్రభుత్వం కాని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాని ఎటువంటి చర్యలు చేపట్టలేదు. 1992వ సంవత్సరంలో అయోధ్యలో కరసేవ జరిగిన సమయంలో కేంద్రంలో పి.వి.నరసింహారావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలక్ మాననీయ శ్రీ బాలాసాహెబ్ జీ, కొద్దిమంది ప్రముఖులు కేంద్ర హోంమంత్రిని కలిసి రామజన్మభూమి గురించి డిశంబరు 6వ తేదీలోగా కోర్టుద్వారా ఏదైనా చెప్పిస్తే కరసేవకులు ప్రశాంతంగా వాళ్ళవాళ్ళ ప్రదేశాలకు తిరిగి వెళ్ళిపోతారు, లేదా ఉద్రిక్త పరిస్థితులు తప్పవు అని హెచ్చరించారు. 
 
ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. డిశంబరు 6వ తేదీనాడు కరసేవకులు బాబరీకట్టడాన్ని కూల్చివేసి చిన్న రామమందిరాన్ని నిర్మాణం చేసారు. అప్పటివరకు ఏమీ స్పందించని కేంద్రప్రభుత్వం అయోధ్య రామజన్మభూమి స్థలానికి పోలీసు బలగాలను పంపింది. సంఘంపై నిషేధం విధించింది. దేశంలోని బి.జె.పి. పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసి, ఎమర్జెన్సీ విధించింది. ఎంతో హడావిడి చేసింది. కూల్చివేతపై అనేకమందిని నిర్బంధించి కేసులు పెట్టింది. వాతావరణం ఉద్రిక్తంగా ఉన్న ఆ సమయంలో అప్పటి రాష్ట్రపతి చొరవ తీసుకొని ముస్లిం పెద్దలతో మాట్లాడి పురావస్తు పరిశోధన శాఖ ద్వారా పరిశోధన చేయించి, ఒకవేళ బాబరీ కట్టడానికి పూర్వం అక్కడ మందిరం ఉంటే ఆ స్థలాన్ని మందిర నిర్మాణానికి ఇచ్చివేయాలని ఒక నిర్ణయం చేశారు. అయోధ్య ఉద్యమంలో ఇదొక మలుపు. పురావస్తు పరిశోధన శాఖ అక్కడ త్రవ్వకాలు జరిపి చివరకు అక్కడ దేవాలయం ఉన్నదని నివేదిక ఇచ్చింది. నివేదిక అందేనాటికి కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి మారారు. దానితో ముస్లింలను ఒప్పించి రామమందిరానికి మార్గం సుగమం చేసేపని వాయిదాపడింది. 
 
కోర్టు కేసుకూడా అప్పుడప్పుడే ఒక కొలిక్కి వస్తున్నది. 2010 సెప్టెంబరు 30వ తేదీన తీర్పుకూడా వచ్చింది. ఆ తీర్పు ఎవరూ ఊహించనట్టిది. తీర్పునిచ్చిన ముగ్గురు న్యాయమూర్తులు ఒక విషయాన్ని అంగీకరించారు. గతంలో ఆ స్థలంలో మందిరం ఉండేది. అది ధ్వంసం అయింది. 
 
కోర్టు తీర్పు వచ్చిన తరువాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్ళీ అందరూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయోధ్య రామజన్మభూమి వివాదం సుప్రీంకోర్టు అంతిమతీర్పుపై ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు దానిని పెండింగులో పెట్టినట్లుగా ఉంది. 
 
కోర్టు వెలుపల పరిష్కారానికి కొంతమంది ప్రయత్నాలు ప్రారంభించారు. అవి ఏవీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మొత్తంమీద సమస్య స్థిరంగా అక్కడే ఆగిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఇద్దరు ముస్లిం ప్రముఖుల మాటలు గమనిద్దాం : 'ఎంత మూల్యం చెల్లించైనా రామలల్లా విజయం చూడాలని నేను కోరుకుంటున్నా'నని బాబ్రీమసీదు యాక్షన్ కమిటీ సభ్యుడు హషీం అన్సారీ అన్నారు. 'రామజన్మభూమి కేసును ముగిసిన అంశం'గా బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ అజంఖాన్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు, కేంద్రప్రభుత్వం, దేశంలోని ప్రముఖులు చొరవ తీసుకొని రామజన్మభూమి సమస్యను పరిష్కరించి జాతి గర్వించదగ్గ విధంగా అయోధ్య రామజన్మభూమి స్థలంలో భవ్యమైన రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేయాలి. శతాబ్దాల తరబడి ఉన్న ఒక సున్నితమైన సమస్యకు పరిష్కారమార్గం చూపించాలి.
 
- రాము