"సమాచారం మూలం ఇదం జగత్" నారదుని సందేశం

పూలమాలలతో అలంకరించబడిన భారత భారతమాత, నారదుని ఫోటోలు 
"'వార్తయందు జగము వర్థిల్లుచున్నది; వార్త లేనినాడు జనులు అంధకారంలో పడిపోతారు కాబట్టి రాజులు వార్తలను ప్రజలకు అందించాలని నారదుడు ధర్మరాజుకు బోధించాడు. ప్రజలకు సత్య సమాచారాన్ని అందించాలని చెప్పినవాడు నారదుడు" అని శ్రీ సి.వి. నరసింహా రెడ్డి నారద జయంతి సభలో మాట్లాడుతూ చెప్పారు.  ఏప్రిల్ 29 న సమాచార భారతి ఆధ్వర్యంలో ఉ.10.30 గం.లకు జాగృతి భవనంలో "ప్రపంచ పాత్రికేయ దినోత్సవం" గా నారద జయంతి కార్యక్రమం నిర్వహించబడింది.  

ఈ కార్యక్రమంలో సమాచార భారతి అధ్యక్షులైన శ్రీ టి. హరిహర శర్మ మాట్లాడుతూ -"సమాచార భారతి గడిచిన కొన్ని సంవత్సరాల నుండి నారద జయంతిని పాత్రికేయ దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా కొందరు ప్రముఖ పాత్రికేయులను సన్మానించడం కూడా చేస్తున్నది" అని అన్నారు.

నారద జయంతి విశిష్టత - ముఖ్య అతిథి శ్రీ సి.వి.నరసింహా రెడ్డి ప్రసంగం

ప్రసంగిస్తున్న శ్రీ సి.వి. నరసింహారెడ్డి
ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ సి.వి.నరసింహా రెడ్డి మాట్లాడుతూ 'ఈ దేశంలో అనేకమంది మహాత్ములు జన్మించారు. వారి ప్రగతికి ముఖ్యమైన కారణాలు మూడు. 1) వారి ఆశయాలు, 2) వారు ఉపయోగించిన మాధ్యమాలు, 3) ప్రజా సంబంధాలు ఏర్పాటు చేసుకోవటంలో వారు చూపించిన నైపుణ్యం. అటువంటి మహాత్ములలో నారదుడు అగ్రగణ్యుడు. పురాణ పురుషుడైన నారద మహర్షి సమాచార రంగంలో అనుసరించిన సాంకేతిక పద్ధతులను అధ్యయనం చేయటం ఈనాటి ప్రజా సంబంధాల వృత్తిలో ఉన్న వ్యక్తులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ దేశంలో జన్మించిన బుద్ధుడిని 'ఆసియా ఖండపు వెలుగు' అంటారు. 20వ శతాబ్దపు ప్రముఖుడుగా (Man of the 20th Century) గాంధీకి బిరుదు ఇవ్వబడింది.  ప్రజలతో వాళ్ళకున్న సంబంధాలే వారి గుర్తింపునకు ఒక ప్రబల కారణం.   

ప్రజా సంబంధాల, మాధ్యమాలు, విధానాలు వంటి విషయాలు పుస్తకాలలో ఎక్కువగా లేవు. అటువంటి విషయాలను నా పత్రిక ద్వారా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో ఈ దేశంలో జన్మించిన అనేకమంది మహాత్ముల జీవితాలను వ్రాశాను. వారిలో నారదుడు మన సంస్కృతికి, చరిత్రకు ప్రతిబింబం. భారతదేశంలో వికసించిన సంస్కృతి, సాహిత్యం, ఆచార వ్యవహారాలు యావత్ ప్రపంచాన్ని ముగ్ధులను చేసింది. అనేకమంది మన సంస్కృతి గురించి చక్కటి వ్యాఖ్యానాలు చేసారు. వారిలో 100 సంవత్సరాలకు పూర్వం అమెరికా రచయితా అయిన మార్క్ ట్వైన్ చెప్పిన మాటలను గమనిద్దాం -"భారత దేశం మానవజాతి ప్రగతికి ఉయాలలాంటిది; మానవుల మాటలకు సంభాషణలకు భారతదేశం జన్మభూమి; మానవజాతి చరిత్రకు పెద్దమ్మ వంటిది; ఇతిహాసాలకు, పురాణాలకు భారతదేశం అమ్మమ్మ వంటిది; సాంప్రదాయాలు భారతదేశం యొక్క మూల స్రోతస్సు. ప్రపంచ చరిత్రకు సంబంధించిన సమాచారం అంటా ఒక్క భారతదేశంలోనే ఉన్నది".

సమాచారం మూలం ఇదం జగత్

నారదుని గురించి ఇంకా చెపుతూ శ్రీ నరసింహా రెడ్డి "నారదుడు 1) ఆధ్యాత్మిక చింతనకు ఆద్యుడు, 2) కలహాభోజనుడు. నారదుడి రూపం బహు ఆకర్షణీయంగా ఉంటుంది. నెత్తిన కొప్పు, నుదుట విష్ణునామం కనబడుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బహుళ ప్రచారం చేయటానికి బ్రహ్మ దేవుడు నారదుడ్ని ప్రత్యేకంగా సృష్టించాడా అనిపిస్తుంది. ప్రజలకు జ్ఞానాన్ని, సమాచారాన్ని అందించటమే పనిగా పెట్టుకొన్న వాడు నారదుడు.  దానికోసం నారదుడు రచించిన పుస్తకాలలో 1) నారద భక్తి సూత్రాలు (ఒక మంచి భక్తుడుగా కావాలంటే 1. ఆరాధనా భావం, 2. నిరంతరము స్మరణ చేయుట, 3. జీవితంలో ఆధ్యాత్మిక చింతన ఒక భాగం కావటం), 2) "నారదస్మృతి" - దానిలో ధర్మం, న్యాయం, రాజ ధర్మాలు గురించి వివరించారు, 3) నారద పురాణం. 'ధనం మూలం ఇదం జగత్' అని చాలామంది అంటారు. కాని "సమాచారం మూలం ఇదం జగత్" అనేది నారదుని సందేశం. అందుకే ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు అందరూ నారదుడ్ని అభిమానించేవారు, సలహాలు స్వీకరించేవారు. నారదుడు త్రిలోక సంచారి. అంటే ఈ రోజున మనం చూస్తున్న శాటిలైట్ వ్యవస్థ వంటివాడు. ఆ భావనకు ఆది పురుషుడు నారదుడు. జటిల సమస్యల పరిష్కారానికి నారదుడు కలహాలు సృష్టించేవాడు. పాత్రికేయుడుగా, ప్రజా సంబంధాల నిపుణుడుగా నారదుడు బాగా రాణించాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చివరగా నారదుని వ్యక్తిత్వంలో మనకు కనబడేవి 1. సమాచార నిధి, 2. మంచి విశ్లేషకుడు, 3. మంచి సలహాదారుడు, 4. మంచి ప్రచారకుడు - అంటే సమాచారాన్ని సత్వరం అందరికీ అందుబాటులోకి తెచ్చేవాడు, 5. మంచి వార్తాగ్రాహకుడు, విషయాలను పసిగట్టడంలో నేర్పరి. ఇప్పుడున్న పత్రికా రంగ వ్యవస్థ నారదుడ్ని ప్రేరణగా తీసుకొని దేశంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందిస్తూ, దేశాభివృద్ధికి, లోక కల్యాణం కొరకు కృషి చేయాలి" అని పిలుపునిస్తూ శ్రీ నరసింహా రెడ్డి ముగించారు.  

భారత రాజ్యాంగం - 25వ అధికరణం  - ప్రొ. కె.శ్రీనివాసరావు ప్రసంగం

ప్రసంగిస్తున్న ప్రొ. కె.శ్రీనివాసరావు
కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా విశ్వ విద్యాలయంలో న్యాయశాఖ మాజీ డీన్, రాజ్యాంగ నిపుణుడు ఆచార్య కె.శ్రీనివాసరావు రాజ్యాంగంలోని 25వ అధికరణంలో పేర్కొన్న మతస్వేచ్ఛ గురించి ప్రసంగిస్తూ -"మతస్వేచ్ఛ అనేది కొన్ని పరిమితులకు లోబడినది. దానికి రాజ్యాంగం కొన్ని హద్దులు కల్పించింది. రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛ ప్రకారం ప్రతి పౌరుడు తనకు ఇష్టమైన మతాన్ని అనుసరించడానికి, ప్రచారం చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇతరులకు తమ మతం గురించి బహిరంగ ప్రదేశాలలో తెలుపవచ్చును. అంతేకాని మతస్వేచ్ఛ అంటే మతమార్పిడులకు అవకాశం కల్పించడం కాదని రాజ్యాంగం స్పష్టం చేసింది" అని అన్నారు.  

ఈ రోజుల్లో మతస్వేచ్ఛ ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నదని ఆయన విచారం వ్యక్తం చేసారు. శాంతి భద్రతలు, నైతికత దృష్ట్యా ప్రభుత్వం మతస్వేచ్ఛకు అవసరమైన పరిధులు ఏర్పాటు చేయవచ్చని ఆచార్య శ్రీనివాసరావు వివరించారు. రాజకీయం, ఆర్ధిక, సామాజిక ప్రయోజనాల దృష్ట్యా కూడా మతస్వేచ్ఛకు ప్రభుత్వం కొన్ని పరిమితులు ఏర్పరచవచ్చని ఆయన అన్నారు.

రాజ్యాంగం రచించినప్పుడు దానిలో లౌకికవాదం (సెక్యులర్) అనే పదం లేనేలేదు. 1976వ సంవత్సరంలో రాజ్యాంగానికి 42వ సవరణ ద్వారా లౌకికవాదం అనే పదం చేర్చారు. భారత రాజ్యాంగం ప్రకారం "లౌకికవాదం అంటే అన్ని మత భావనలకు రక్షణ కల్పించటం, ప్రభుత్వాలు మతపరమైన విషయాలలో జోక్యం చేసుకోకపోవటం మాత్రమే" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వపంథ సమభావన అనే ఆలోచనను సుప్రీంకోర్టు స్పష్టీకరించినట్లుగా  దీనిని బట్టి మనకు అర్థమవుతున్నది. ఈ సందర్భంగా విద్యారంగ మౌలిక ఆలోచనలపై అరుణ రాజా జడ్జిమెంట్ మనం గమనించదగినది. దేశంలో ప్రజలందరికీ ఒకే సివిల్ కోడ్ తీసుకురావాలని రాజ్యాంగంలో 44వ అధికరణం సూచిస్తున్నది. కాని, ఆ దిశలో ఇంతవరకు ఎటువంటి అవసరమైన చర్యలు తీసుకోబడలేదు.

సరళా ముద్గల్ కేసులోని వ్యక్తి మొట్టమొదటి హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకొని ఆ తదుపరి ముస్లింగా మతం మారి రెండవ వివాహం చేసుకొన్నాడు. ఇది చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎందుకంటే మొదట వివాహం హిందూ చట్టం ప్రకారం చేసుకొన్నాడు కాబట్టి రెండవ వివాహం మతం మారినా చెల్లదు అని చెప్పింది. ఇది చెబుతూ ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలని గట్టిగా సూచించింది. మతం అనేది ఒక విశ్వాసం. వ్యక్తిగా, సమూహంగా ఆ విశ్వాసం ఉండవచ్చు. ఆ విశ్వాసం ఉంచుకునేందుకు స్వేచ్ఛ ఉంది. ప్రచారం చేయటంలో రాజ్యాంగం విధి నిషేధాలు స్పష్టం చేసింది. ఇక్కడ ఒక సందర్భంలో లౌడ్ స్పీకర్ల ద్వారా ఏదైతే ప్రచారం జరుగుతున్నదో దానిపై కూడా సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ధ్వని కాలుష్యము నివారించేందుకు లౌడ్ స్పీకర్లు ఏ ఆరాధనా స్థలంలోనైనా బహిరంగంగా ఉంచకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాని ఇది ఎక్కడా అమలు జరగడం లేదు. 

మతప్రచారం చేయటం అంటే మత మార్పిడులు చేయడం కాదు. కాని నేడు దేశంలో మత మార్పిడులు ప్రమాదకరంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు హిందువుల ఆడపిల్లలను రకరకాల ప్రలోభాలకు గురి చేసి వివాహాలు చేసుకొని తమ మతాల్లోకి మతమార్పిడి చేస్తున్నారు. ఇది ఒక ప్రమాదకరమైన ఎత్తుగడ. 

జాతీయ గీతం అంశంపై కేరళ ప్రభుత్వానికి సంబంధించిన కేసులో ప్రతి పౌరుడు జాతీయ గీతాన్ని గౌరవించవలసిందే. గీతం ఆలపిస్తున్నప్పుడు నిలబడి గౌరవించ వలసిందే అని స్పష్టం చేస్తూనే జాతీయ గీతాన్ని ఆలపించమని మాత్రం నిర్బంధం చేయలేమని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల శ్రీనివాసరావు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. 

మత, భాషా పర అల్ప సంఖ్యాకులకు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని, నిర్వహించుకొనే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని ఆయన తెలిపారు. అయితే ఆయా సంస్థలలో కేవలం అల్ప సంఖ్యాకులకు చెందిన విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని రాజ్యాంగం పేర్కొనలేదని అన్నారు. అందుకు విరుద్ధంగా 70 శాతం వరకు అల్ప సంఖ్యాకులకు చెందిన విద్యార్ధులను మాత్రమే చేర్చుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీ.ఓ. జారీ చేయడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేసారు. ఈ విధంగా మతపరమైన పాలు అంశాలపై రాజ్యాంగం ఎం చెప్పిందో సంక్షిప్తంగా శ్రీ శ్రీనివాసరావు వివరించారు. 

పాత్రికేయులకు సత్కారం

ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయులు శ్రీ దత్తారాం ఖత్రి (ఈనాడు) కి శ్రీ భండారు సదాశివరావు స్మారక పురస్కారం, శ్రీ చలసాని నరేంద్రకు (ఫ్రీలాన్సర్) శ్రీ వడ్లమూడి రాంమోహన్ రావు స్మారక పురస్కారం, శ్రీ టి.నాగరాజు గుప్తాకు (జి 24 గం.)
శ్రీ భండారు సదాశివరావు స్మారక పురస్కారం ప్రదానం చేసారు. పురస్కారంతో పాటు శాలువా కప్పి, మెమెంటో ఇచ్చి సత్కరించారు.  

శ్రీ దత్తారాం ఖత్రి (ఈనాడు) కి శ్రీ భండారు సదాశివరావు స్మారక పురస్కారం
శ్రీ చలసాని నరేంద్రకు (ఫ్రీలాన్సర్) శ్రీ వడ్లమూడి రాంమోహన్ రావు స్మారక పురస్కారం
శ్రీ టి.నాగరాజు గుప్తాకు (జి 24 గం.) శ్రీ భండారు సదాశివరావు స్మారక పురస్కారం
పురస్కార గ్రహీతల స్పందన 
 
శ్రీ చలసాని నరేంద్ర మాట్లాడుతూ "శ్రీ వడ్లమూడి
రాంమోహన్ రావు స్మారక పురస్కారం తీసుకోవడాన్ని నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గడచిన 30 సంవత్సరాల నుండి శ్రీ వడ్లమూడి రాంమోహన్ రావు గారితో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. నేను పత్రికా రంగంలోకి యాదృచ్చికంగా వచ్చాను. దీనిలో ఒక ఆనందం, స్వేచ్ఛ ఉన్నాయి" అని చెప్పారు.

శ్రీ నాగరాజు గుప్తా మాట్లాడుతూ "లౌకికవాదం ముసుగులో హిందూ సమాజంపై దాడి జరుగుతున్నదని, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు జరిగితే పత్రికా రంగంలో హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది, అదే హిందువులపై దాడులు జరిగితే పత్రికలు దానిని ఒక వార్తగా చూడవు. దానికి తాజా ఉదాహరణ ఈ మధ్య చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంలో గంట మ్రోగించాలంటే అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించటం. ఈ విషయం ఒక్క హిందీ పత్రిక మినహాయించి ఏ పత్రికా, ఛానల్ లో రాలేదు.  హిందూ ధర్మం గురించి ఎక్కువగా దుష్ప్రచారం చేసే మీడియా ముస్లిం, క్రైస్తవులలోని దోషాలను ఎందుకు ఎత్తి చూపదు? హిందువుల హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత పత్రికా రంగానికి లేదా? దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని" చెప్పి సభ దృష్టికి తెచ్చారు.  ఇంకా మాట్లాడుతూ -"ఈ రోజుల్లో నారదుడు పోషించిన పాత్రను ప్రేరణగా తీసుకొని దేశ ప్రజలలో జాతీయ భావాలను పెంచే విధంగా మనమందరం కృషి చేయాలని" అన్నారు.
  

"ఇంటిగ్రల్ వాల్యూస్" - పుస్తకావిష్కరణ 

పుస్తకావిష్కరణ
ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితా, చక్కటి విశ్లేషకులు అయిన శ్రీ కందర్ప రామచంద్రరావు సంకలనం చేసిన "ఇంటిగ్రల్ వాల్యూస్" అనే పుస్తకాన్ని శ్రీ సి.వి.నరసింహా రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. శ్రీ పురుషోత్తమరావు పుస్తక పరిచయం చేసారు. పుస్తక ముద్రణకు ముందుకు వచ్చిన శ్రీ బచ్చు సుబ్బారావు పుస్తక విషయం వివరించారు. 

ముగింపు

కార్యక్రమ ప్రారంభంలో సమాచార భారతి అధ్యక్షులు శ్రీ టి.హరిహర శర్మ నారదుడు, భారతమాత చిత్ర పటాలను పూల మాలలతో అలంకరించగా, శ్రీ సి.వి.నరసింహా రెడ్డి, ప్రొ. కె.శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసారు. వందేమాతర గీతాలాపనతో సభ ప్రారంభమైంది. 

కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ మాసపత్రిక ముఖ్య సంపాదకులు శ్రీ జి.వల్లీశ్వర్, జాగృతి సంపాదకులు శ్రీ వడ్డి విజయ సారథి, శ్రీ వేదాంతాచారి, శ్రీ మురళీ (జీ టి.వి.) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పశ్చిమ ఆంధ్ర ప్రాంత సహ కార్యవాహ శ్రీ కాచం రమేష్, ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రాంత సంఘటనా కార్యదర్శి శ్రీ కుమారస్వామి, సమాచార భారతి కమిటీ సభ్యులు, పాత్రికేయులు శ్రీ వేదుల నరసింహం, తదితర అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. 

కార్యక్రమంలో వందన సమర్పణ శ్రీ హనుమత్ ప్రసాద్ చేయగా, జాతీయ గీతాలాపనతో సభ ముగిసింది.