భారత ఉపఖండంపై పొంచిఉన్న పశ్చిమాసియా ఇస్లామిక్ తీవ్రవాదం

 
ఇటీవలి కాలంలో భారత ఉపఖండంలో చోటుచేసుకున్న మూడు సంఘటనలు ఉపఖండంపై తీవ్రమైన ప్రమాదఘంటికలను మోగిస్తున్నాయి. 
 
ఒసామాబిన్ లాడెన్ తరువాత అల్ ఖైదా ఆధిపత్య పగ్గాలు చేపట్టిన అల్-జవహరి ఆగష్టు 13, 2014న ఒక వీడియో ప్రకటనను విడుదల చేస్తూ "భారత్, బర్మా, కశ్మీర్, ఇస్లామాబాద్, బాంగ్లాదేశ్ లలోని సోదర ముస్లిములు ఆయా ప్రభుత్వాలతో తీవ్ర అన్యాయానికి, హింసకు గురౌతున్నారని, అందుకుగాను వారిని త్వరలోనే జిహాది (పవిత్ర యుద్ధము) ద్వారా స్వతంత్రులను చేసి ఇస్లాం-షరియా సామ్రాజ్యాన్ని నెలకొల్పుతామని" చెప్పాడు. అందుకుగాను ప్రత్యేకించి భారత్ లో అల్ ఖైదా విధ్వంసక కార్యకలాపాలను విస్తరించడానికి 'జమాత్ ఖ్వాదత్ అల్-జిహాద్' అనే సంస్థను నెలకొల్పి బాధ్యతలను అప్పగించినట్లు తెలియచేశాడు. 
 
అలాగే పాకిస్తాన్ లోని 'తెహ్రీక్-ఎ-తాలిబాన్' అనే తీవ్రవాద సంస్థ అక్టోబర్ 4న పశ్చిమాసియాలోని ISIS తీవ్రవాద సంస్థకు అనుబంధంగా ప్రకటించుకున్నది. తమ ప్రాంతాల్లోని ఆయా కార్యకర్తలందరూ ఖలీఫత్ రాజ్యాన్ని స్థాపించడానికి ISIS కు సహాయం చేస్తూ, ప్రచారం చేయవలసిందిగా తన కార్యకర్తలను ఆదేశించింది. ఇరాక్, సిరియాలలో ISIS తరపున పనిచేస్తున్న తీవ్రవాదులందరిని తమ సోదరులుగా భావిస్తున్నామని, పశ్చిమాసియాలో వారి విజయాలకు గర్విస్తున్నామని ప్రకటించుకొంది. 
 
ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలన్ని ఖలిపత్ రాజ్య స్థాపనకు ISIS పై అనేక ఆశలు పెట్టుకున్నాయని, మేము వారి కష్టసుఖాలలో అండగా ఉండి, వారికి అన్నివిధాల సహాయ సహకారాలందిస్తామని ప్రకటించుకొంది. 
 
అంతేకాకుండా భారత్ లోని ఇస్లామిక్ సంస్థ అయిన ఇండియన్ ముజాహిదీన్ కూడా పశ్చిమాసియాలోని ISIS తీవ్రవాద సంస్థకు అనుబంధంగా ప్రకటించుకున్నది. దాని నాయకుడు అబూ-బకర్-అల్-బాగ్డాది భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చాడు. అంతేకాకుండా ఇస్లామిక్ రాజ్యాంగ వ్యతిరేక కూటమిగా జతకట్టిన అమెరికా, భారత్, సౌదీఅరేబియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడాలపై పవిత్రయుద్ధం (జిహాదీ) ప్రారంభించాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుతం సిరియా, ఇరాక్ లలో ISIS ద్వారా జరుగుతున్న యుద్ధం ప్రపపంచవ్యాప్తంగా ఇస్లామిక్ షరియా సామ్రాజ్య స్థాపనకు మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని చేజార్చుకోరాదని పిలుపునిచ్చాడు. 
 
గత మూడు మాసాలలో పైన తెలిపిన సంఘటనలు యాదృచ్ఛికంగానే జరిగినప్పటికి భారత్ లో కూడా జమ్ముకాశ్మీర్, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ISIS సానుభూతిపరులు ఉన్నారని, శుక్రవారం ప్రార్థనల తరువాత ISIS జెండాలను ఎగురవేస్తున్నట్లుగా అడపాదడపా పత్రికలలో కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఇబీవల హైదరాబాద్ లో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా పశ్చిమబెంగాల్ లో అరెస్టు చేయబడిన హైదరాబాదీ యువకులు ISISకు సానుబూతిపరులుగా మారి బంగ్లాదేశ్ ద్వారా ఇరాక్ చేరడానికి చేస్తున్న ప్రయత్నాలు నిఘా విభాగం వారు పట్టుకొని యువకులను తెలంగాణా పోలీసులకు అప్పగించగా, పోలీసులు ఆ యువకుల తల్లితండ్రులను పిలిపించి, వారి సమక్షంలో ఆ యువకులకు కౌన్సిలింగ్ జరిపి వదలివేసినట్లు వార్తాపత్రికలు పేర్కొన్నాయి. 
 
పైన తెలిపిన సంఘటనలు యాదృచ్ఛికమైనప్పటికి పైన తెలిపిన తీవ్రవాద సంస్థలతో భారతదేశానికి ప్రత్యేకించి పశ్చిమ భారతదేశంలోని రాష్ట్రాలపై తీవ్రమైన ప్రమాదఘంటికలను సూచిస్తున్నాయని కేంద్ర నిఘావిభాగాల వారి సమన్వయంతో సహకరించి మైనారిటీ సంతృప్తీకరణ, ఉదారవాదాన్ని పక్కనపెట్టి పరిస్థితి తీవ్రతను గ్రహించి వెంటనే తగు నిఘా, భద్రతా చర్యలు చేపట్టవలసి ఉంది. 
 
- పతికి