సంకీర్ణ ప్రభుత్వం కాశ్మీర్ లో మార్పుకు సంకేతమా?

ముఫ్తీ మహమ్మద్ సయీద్ - నరేంద్ర మోది
 
కాశ్మీర్ లో మార్చి 1వ తేదీన ఎట్టకేలకు రాష్ట్రప్రభుత్వం కొలువుదీరింది. పి.డి.పి.-బి.జె.పి.ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ముఫ్తీమహ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన నిర్మల్ సింగ్ పదవీప్రమాణ స్వీకారం చేసారు. కాశ్మీర్ లో సుస్థిరపాలన, అభివృద్ధి లక్ష్యంగా రెండు పార్టీలు అత్యంత కీలకమైన తమ పార్టీల అంశాలను ఒకరకంగా ప్రక్కకు పెట్టాయి. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోది పాల్గొన్నారు. 
 
ప్రమాణస్వీకారం తరువాత ముఫ్తీమహ్మద్ సయీద్ ప్రతికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జమ్మూ-కాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి అనువైన వాతావరణం కల్పించిన ఘనత సరిహద్దుల ఆవల ఉన్న పాకిస్తాన్ ప్రజలు, హురియత్ మిలిటెంట్ వర్గాలకే చెందుతుందని వివరించారు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రికి కూడా చెప్పినట్లుగా చెప్పారు. కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ తో చర్చలు ఒక్కటే మార్గమని, ఇది తన అభిప్రాయమని, ఈ విషయం కూడా ప్రధానితో సమావేశం అయినప్పుడు చెప్పినట్లు కూడా చెప్పారు. 
 
హురియత్ నేత అబ్దుల్ గనీలోన్ తనయుడు సజ్జాద్ గనీలోన్ కు తన మంత్రివర్గంలో మంత్రిపదవి ఇచ్చాడు. వేర్పాటువాద సిద్ధాంతం కలిగిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించటం, పాకిస్తాన్ తో చర్చలే కాశ్మీర్ సమస్యకు పరిష్కారమనటం, మిలిటెంట్ సహకారం కారణంగానే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయనటం ఎటువంటి సంకేతాలనిస్తున్నాయి? బిజెపి వాళ్లు విలేకరుల సమావేశంలో కాశ్మీర్ లో ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు కాబట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. 
 
ఒకప్రక్క అక్కడ ప్రమాణస్వీకారం జరిగితే, రెండవప్రక్క భారత ప్రభుత్వ విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ సార్క్ దేశాల పర్యటన సందర్భంగా (3.3.2015) పాకిస్తాన్ కు వెళ్లనున్నారు. సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు కారణంగా రెండుదేశాల మధ్య చర్చలు ఆగిపోయినాయి. ఉగ్రవాదులను నిలుపుదల చేయనంతవరకు పాకిస్తాన్ తో చర్చల ప్రసక్తే లేదని తెగేసి చెప్పిన కేంద్రప్రభుత్వం విదేశాంగశాఖ కార్యదర్శిని ఈ సమయంలోనే ఎందుకు పంపవలసి వచ్చింది? దీనిని మనం అర్థం చేసుకోవాలంటే అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన సమయంలో భారత్ పై వత్తిడి తెచ్చినట్లుగా ఉంది. పాకిస్తాన్ తో సంబంధాలు కొనసాగించాలని చెప్పినట్లుగా ఉంది. పాకిస్తాన్ ఏర్పడిననాటి నుండి ఒకప్రక్క అమెరికా, రెండవప్రక్క చైనా పాకిస్తాన్ ను ఆదుకొంటూ వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా తన పూర్తి అండదండలు పాకిస్తాన్ కు ఇస్తూ వస్తున్నది. అసలు పాకిస్తాన్ సృష్టే అమెరికా, ఇంగ్లాండుల వ్యూహం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్వతంత్రం వచ్చిననాటి నుంచి భారత్ కు పాకిస్తాన్ తో అనేక రకాల సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. దానికి తోడు కాశ్మీర్ లో కొంత భూభాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. మిగిలిన కాశ్మీర్ ను కూడా ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ చెయ్యని ప్రయత్నం లేదు. పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకోకుండా అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉన్నది. 
 
కేంద్రంలో ప్రభుత్వం మారిన తరువాత సరిహద్దుల అతిక్రమణ చేసి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ కు కేంద్రం సరియైన పాఠం చెప్పిన కారణంగా పరిస్థితులు కొద్దిగా సద్దుమణిగాయి. హింసాత్మక సంఘటనలు కాశ్మీర్ లో కూడా తగ్గుముఖం పట్టాయి. పాకిస్తాన్ లో నిర్మాణమవుతున్న అంతర్యుద్ధ పరిస్థితులను గమనించిన తరువాత కాశ్మీర్ వేర్పాటువాదుల ప్రభావం కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టినట్లుగా ఉంది. కేంద్రంలో వచ్చిన మార్పు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆలోచనలో మార్పు సూచిస్తున్నట్లుగా ఉంది. కాశ్మీర్ లో బిజెపి పాలనలో భాగస్వామ్యం కావటం మొత్తం మీద కాశ్మీర్ చిత్రంలో మార్పు కనబడుతున్నది. ఇది తాత్కాలికమా? మార్పు ఇంకా వేగంగా రానున్నదా? రాష్ట్ర పరిస్థితులలో మార్పు రాబోతున్నదా? అభివృద్ధి దిశగా కాశ్మీర్ ప్రయాణం చేస్తుందా? వేచి చూడాలి. 
 
- పతికి