సేంద్రియ వ్యవసాయంతో బాస్మతి

 
హైదరాబాద్ నివాసి సుబ్రహ్మణ్య సురేష్ నల్లగొండ జిల్లా మూసి ఒడ్డున ఉన్న ఆరూర్ అనే గ్రామంలో 10 ఎకరాలలో ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాల ద్వారా తయారు చేసిన ఎరువులతో సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి మంచి దిగుబడులను సాధించారు. వారు వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ గారి సలహా మేరకు భూమి, నీరు ప్రయోగ శాలలో పరీక్షలు జరిపించి వరిసాగు చేశారు. ఒక ఎకరాలో 'సుమతి" అనే రకం బాస్మతి బియ్యాన్ని ఎకరాకు 27 బస్తాల దిగుబడి సాధించారు. అదేవిధంగా ఇంకా తొమ్మిది ఎకరాల్లో 'సుగంధ సాంబ' అనే సన్నరకం బియ్యాన్ని ఎకరాకు 25 బస్తాలు దిగుబడి సాధించారు.  
 
ఇందుకుగాను వారు ఎకరాకు కేవలం  3 వేల రూపాయలు మాత్రమే పెట్టుబడిగా పెట్టారు. ఎక్కడా రసాయన ఎరువులు వాడలేదు. పంట వేసిన తరువాత నాలుగు సార్లు ఆవు మూత్రం, ఆవు పేడ, నీరు, సున్నం మిశ్రమాన్ని సేంద్రియ క్రిమిసంహారక ద్రావకంగా వాడారు. 
 
 
ఈ రకంగా రసాయన ఎరువు లేకుండా పండించిన ధాన్యాన్ని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో ప్రసాదాల తయారీకి పంపడం జరిగిందని శ్రీ సుబ్రహ్మణ్య సురేష్ తెలియచేసారు. ఇది వారి దాతృత్వాన్ని తెలియచేస్తుంది. కాగా ఈ రకం విత్తనాలు కావలసిన వారు హైదరాబాద్ లోని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కార్యాలయానికి 040-24015817 అనే నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 
 
- ఈనాడు ఆధారంగా
- పతికి