ఎంతమూల్యం చెల్లించైనా రామలల్లాకు విజయం చేకూర్చాలి

కలియుగాబ్ది 5115 , శ్రీ జయ నామ సంవత్సరం, మార్గశిర మాసం


అయోధ్య బాబ్రీమసీదు యాక్షన్ కమిటీలో ముఖ్యుడైన హషీమ్ అన్సారి డిశంబర్ 2వ తేదీన అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ ఒక ప్రకటన చేశారు. అందులో ఆయన ఇలా అన్నారు "ఇక నేను రామలల్లాను స్వతంత్రుడిగా చూడాలని కోరుకుంటున్నాను. బాబ్రీ మసీదు విషయంలో ఇక నేను ఎటువంటి పైరవీలు చేయను. డిశంబరు 6ను బ్లాక్ డే గా జరిపే ఎటువంటి కార్యక్రమాలలోను నేను పాల్గొనను". 

హషీమ్ అన్సారీ ఇంకా మాట్లాడుతూ "బాబ్రీమసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ అయిన అజంఖాన్ ములాయంసింగ్ తో చేతులు కలిపాడు. యాక్షన్ కమిటీ సభ్యులందరు అజంఖాన్ పైనే బాధ్యత పెట్టారు. అందరం కలసి ఉద్యమం చేసినా రాజకీయలబ్ది మాత్రం అజంఖాన్ పొందాడు. ఇక నేను బాబ్రీమసీదు యాక్షన్ కమిటీలో ఉండను. ఎటువంటి పైరవీలు చేయను. అజంఖాన్ నే చేయనివ్వండి. అజంఖాన్ చిత్రకూట్ రామాలయానికి వెళ్తాడు, అయోధ్యలోని రామమందిరానికి వెళ్ళడు. రామజన్మభూమి-బాబ్రీమసీదు రాజకీయంలో పడింది కాబట్టి నేను బాబ్రీమసీదు కోసం పైరవీలు చేయను. హిందూముస్లింల మధ్య అవగాహన కలిగించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్న సమయంలో హిందూమహాసభ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. పరిషత్ అధ్యక్షుడు బాబా జ్ఞానదాస్ సామరస్యం కోసం చాలాప్రయత్నం చేశారు. రామజన్మభూమి వివాదం 1950 నుండి నడుస్తున్నది. అప్పటినుండి ఉద్యమాలలో నాయకత్వం వహించిన వాళ్ళందరూ రాజకీయాలలో ప్రయోజనం కోసం ప్రాకులాడారు, ప్రయోజనం పొందారు. ఒకప్రక్క రామ్ లల్లా చిన్నగుడారంలో ఉంటే నాయకులు భవంతులలో ఉంటున్నారు. ఇది ఇంకా ఎక్కువరోజులు కొనసాగకూడదు. ఎంతమూల్యం చెల్లించైనా రామలల్లా విజయం సాధించడం మనం చూడాలి" అని అన్నారు. 

హైకోర్టు తీర్పు తరువాతనైనా ముస్లిం పెద్దలు సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ముందుకు వస్తే బాగుండేది. అన్సారీ లాంటివాళ్ళు ఆ సమయంలోనే స్పందించి ఉంటే చాలాప్రయోజనకరంగా ఉండేది. గతంలో అక్కడ మందిరం ఉన్నదనే అంశం పురావస్తు పరిశోధన శాఖ నివేదిక ఇచ్చిన తరువాతనైనా అప్పటి ప్రభుత్వం సత్వరచర్యలు చేపట్టి ఉంటే బాగుండేది. అప్పటి ప్రభుత్వానికి ముస్లిం పెద్దలు ఇచ్చినమాట ప్రకారం ఆ వివాదానికి ముగింపుచెప్పి రామమందిర నిర్మాణం కోసం ముందుకువచ్చి ఉంటే దేశంలో జాతీయసమైక్యతకు ఒక చక్కటి దారి నిర్మాణమై ఉండేది. ఇప్పటికైనా ముస్లిం పెద్దలు ఈ దిశలో ఆలోచించి కోర్టు బయట సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలి. ప్రభుత్వమూ, సుప్రీంకోర్టు ఈ చొరవ తీసుకొని 1528 నుండి రగులుతున్న ఒక సున్నితమైన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి.