ఇతరుల కోసం చేసే పనిని చక్కగా చేయగలుగుతాం

పూజ్య శారదామాత

పూజ్య గురుదేవులైన రామకృష్ణ పరమహంస మాతృదేవి శారదామాతకు సేవ-సాధన గురించి బోధించారు. "పూజకు ఉపయోగించిన వస్ర్తాలను ఏం చేయాలి?" అని శారదామాత గురుదేవులను అడిగినప్పుడు "మీ అమ్మకు ఇవ్వవచ్చు, కానీ ఆమెను సాక్షాత్తూ జగన్మాతగా భావించి మరీ ఇవ్వాలి" అని చెప్పారు. మాతృదేవి జీవితంలో ఈసేవ-సాధన యొక్క సరళీకృత రూపం మనకు కనబడుతుంది. పూజ్య మాతృదేవి ఈ క్రింది విధంగా చెపుతారు... 

"ఇతరుల కోసం చేసినప్పుడు మాత్రమే నువ్వు చాలా చక్కగా పనిచేయగలుగుతావు. ఇతరుల కోసం శ్రమించేటప్పుడు లభించే ఆనందం, పూర్ణత్వం, ప్రశాంతత బహుశా మరి దేనివల్లా దొరకదు. దీనిని సరిగ్గా అవగతం చేసుకొని, అనుష్టించడానికి ఒక స్ర్తీ జీవితంలో కలిగే సందర్భాలు కోకొల్లలు. తల్లితండ్రులకు, అత్తమామాలకు, భర్తకు - ఇలా ఆమె జీవితమంతా సేవామయమే. ఇది ఒక పుణ్యకార్యం. ఇతరుల ఆశీర్వచనాలను, శుభాశీస్సులను ప్రాప్తింపచేసే పుణ్య కైంకర్యమే సేవ. కానీ తల్లిదండ్రులకు, భర్తకు చేసే సేవలను భగవంతునికి చేస్తున్నట్లుగా భావించి ఆచరించినప్పుడు అది ఆధ్యాత్మిక సాధనగా పరిణమిస్తుంది. జీవితమే ఒక సాధనగా రూపుదిద్దుకొంటుంది". దీనినే మాతృదేవి ఆచరించి చూపారు. ఆమె దక్షిణేశ్వరంలో ఉన్న రోజుల్లో ఇలాంటి సేవామయమైన, భక్తిమయమైన జీవితాన్ని మనం చూస్తాం.