లోకాస్సమస్తాః సుఖినో భవంతు


మానవుడు దోచుకోవడానికే ప్రకృతి ఉన్నది అనేది పాశ్చాత్యుల స్థిరమైన అభిప్రాయం. ఆ కారణంగా మానవజాతి చెప్పలేని కష్టాలలో పడింది. అన్నీ సమృద్ధిగా ఉన్నా లేమితో కొట్టుమిట్టాడుతోంది. దీనికి కారణం పరిమితి లేకుండా ప్రకృతిని శోషింప చేయడం. ప్రకృతిలో ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన పధ్ధతి ఒకటి ఉన్నది. సృష్టిలో ఏది ఎంత ఉండాలి? ఎంత తొలగాలనేది సహజంగా నిర్ణయించబడి ఉంటుంది. ప్రతి జీవి ఇంకొక జీవిమీద ఆధారపడి జీవిస్తుంది. ప్రకృతిలో అన్నీ అవసరమే! ఏదీ వ్యర్థం కాదు. 

ఈ విషయాలను ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ ఉండగా హిందూ జాతి వేల సంవత్సరాల కిందటే గ్రహించి సమాజానికి ఒక స్పష్టమైన జీవన విధానాన్ని ప్రసాదించింది. 

మనం జంతుజాలాన్ని, పశు పక్ష్యాదులను, వనాలనూ, నదులనూ అన్నింటినీ గౌరవిస్తూ వాటిని రక్షిస్తూ వాటివల్ల హిందువులమైన మనం ప్రయోజనం పొందుతూ బ్రతుకు - బ్రతకనివ్వు అనే ధోరణిలో సామరస్య జీవనాన్ని సర్వశాంతిని పాలిస్తూ రక్షిస్తూ వస్తున్నాం. 

ప్రస్తుతం తలపెట్టిన జీవ వైవిధ్య అంతర్జాతీయ సదస్సు భారతదేశంలోనే జరగడం ముదావహం. 

ఆ సదస్సులో ఎవరు ఏమి మాట్లాడుతారు, ఏమి చర్చిస్తారు, ఏమి పరిశీలిస్తారు అన్న విషయం ప్రక్కన పెడితే, వారు హిందూ జీవన విధానాన్ని, హిందూ సంస్కృతినీ ఒకసారి పరిశీలిస్తే చాలు. సదస్సు లక్ష్యం నెరవేరినట్లే.

- ధర్మపాలుడు