చర్మ సౌందర్యానికి నువ్వుల నూనె

ఆరోగ్యానికి ఆహారం - 5 

వెన్న అన్ని వయసుల వారికి హితమైనను బాలురకు, వృద్ధులకు అత్యంత హితకరమైనది. నెయ్యి బుద్ధిని వికసింపచేయును. ఆవు నెయ్యి శ్రేష్ఠము. వంటకు ఉపయోగించు నూనెలలో నువ్వుల నూనె మంచిది. ఈ నూనెలో మిగిలిన అన్ని నూనెలకన్న క్రొవ్వు శాతం తక్కువగా ఉండును. ఆహారము తరువాత మానవునికి అవసరమయినది నిద్ర. ఆరోగ్యమును కాపాడుటలో బ్రహ్మచర్య పాలన కూడా ముఖ్యమైనది. 

నువ్వుల నూనె

నూనె : వంటకు ఉపయోగించు నూనెలలో నువ్వుల నూనె మంచిది. ఈ నూనెలో మిగిలిన అన్ని నూనెలకన్న క్రొవ్వు శాతం తక్కువగా ఉండును. వాత, కఫ వ్యాధులందు పథ్యము. మధుర రసమును, ఉష్ణ గుణమును కలిగి ఉంటుంది. శరీర బరువులు పెరగనివ్వదు. చర్మమునకు, నేత్రములకు మంచిది. గర్భాశయ దోషములను పోగొట్టును. శరీరమునకు మృదుత్వమును కలిగించును. వ్రణములను మాన్పును.  

ఆయుర్వేద శాస్త్రరీత్యా, ఆరోగ్యరీత్యా అన్ని నూనెలకన్న నువ్వుల నూనె మంచిది.

వెన్న : పథ్యముగా పనిచేయును, బలమును కలుగచేయును. వాత వ్యాథులలో, రక్త దోషములలో పనిచేయును. క్షయ, మూలశంక, దగ్గులను పోగొట్టును. అన్ని వయసుల వారికి హితమైనను బాలురకు, వృద్ధులకు అత్యంత హితకరమైనది. వెన్న ఇతర క్రొవ్వు పదార్థముల కన్నా త్వరగా జీర్ణమగును.

నెయ్యి : మధుర రసం కలిగి ఉండును. చలువ చేయును. బలమును కలుగచేయును. నేత్రములకు మంచిది. ఆకలిని కలిగించును. విషములకు విరుగుడుగా పని చేయును. బుద్ధిని వికసింపచేయును. పుండ్లను మాన్పును. రక్త దోషములను, వాత రోగములను, పోగొట్టును. క్షయ, విసర్పము, చర్మ వ్యాధులందు మంచిది. ఆవు నెయ్యి శ్రేష్ఠము.

నిద్ర : ఆహారము తరువాత మానవునికి అవసరమయినది నిద్ర. ఆహారము, నిద్ర, బ్రహ్మ చర్యము ఈ మూడింటిని మానవునికి ఉపస్తంభములుగా, ఆధారములుగా చెప్పిరి. శారీరిక, మానసిక కార్యముల వల్ల కలిగిన అలసట నిద్ర వలన పోవును. కాలమును అతిక్రమింపక ప్రతి రోజూ రాత్రి సుమారు 6 గంటల నిద్ర మానవునికి అవసరము. ఎండాకాలము తప్ప మిగిలిన కాలములలో పగటి నిద్ర పనికిరాదు.

బ్రహ్మచర్యము : ఆరోగ్యమును కాపాడుటలో ఆహారము, నిద్రలతో పాటు బ్రహ్మచర్య పాలన కూడా ముఖ్యమైనది. ఇచట బ్రహ్మచర్యమనగా నియమబద్ద సంసార ధర్మమును నిర్వర్తించుట అని అర్ధం. మానవులందరూ సంసారమును త్యజించమని ఏ ధర్మ శాస్త్రము చెప్పలేదు. నియమముల ననుసరించి దాంపత్య సుఖమును అనుభవించుట బ్రహ్మచర్య మనబడును. దీనికి సంబంధించిన విధి నియమములు, భార్యా భర్తలు ఆచరించవలసిన ఆహార, ఔషధ వివరములు ఆయుర్వేదమునందు విస్తృతముగా చెప్పబడినవి.

ఆయుర్వేద శీర్షిక ఇంతటితో ముగిసింది. వచ్చే సంచిక నుండి సరికొత్త ఆరోగ్య శీర్షికతో మీ ముందుకొస్తాం. 
- సంపాదకుడు