సియాచిన్ లో నవ్యకాంతుల దీపావళి

సియాచిన్ లో పహరా కాస్తున్న సైనికులతో ప్రధాని నరేంద్రమోది
 
భారతదేశంలోని సియాచిన్ లో ఈ సంవత్సరం దీపావళి పండుగ కొత్త వెలుగులను చిమ్మింది. దేశం యావత్తు దీపకాంతులతో, బాణాసంచా శబ్దాలతో ఆనందహేలలో ఉండగా, సముద్రమట్టానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో, చుట్టూ మంచు తప్ప ఇంకేమీ లేని, ప్రపంచంలోనే అతి కఠినమైన, అతి ఎత్తైన సియాచిన్ యుధ్దక్షేత్రంలో మన వీరసైనికులు కళ్లలో వత్తులు వేసుకొని దేశరక్షణలో నిమగ్నమయి ఉండగా అక్కడికి అనుకోకుండా ఒక విశిష్ట అతిథి వచ్చారు. ఆయనే దేశ ప్రధానమంతి నరేంద్రమోది.

40 నుండి 50 డిగ్రీల మైనస్ ఉష్ణోగ్రత ఉన్న ఆ క్షేత్రంలో పనిచేయడం మిగతా భారతవాసులందరికి ఊహకందని విషయం. సైనికులతో మోదీ సంభాషిస్తూ ఇలా అన్నారు - 'సోదరులారా నేడు 125 కోట్ల భారతీయులు నిశ్చింతగా, సంతోషంగా దీపావళి జరుపకోగలుగుతున్నారంటే అది మీరు కల్పిస్తున్న రక్షణ కారణంగానే. మిమ్ములను చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. మీ అందరితో కలసి పండుగ జరుపుకోవడానికి 125 కోట్ల మంది భారతీయుల ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను, ఇది నా అదృష్టం. మీరంతా మీ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు, ఆ లోటు తీర్చలేనిది, కాని యావద్దేశం మిమ్ములను ఎంతో గౌరవిస్తూ గర్విస్తున్నది. మీ సేవలు అనన్యసామాన్యం'' అని, సైనికులందరికీ మిఠాయిలు పంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మోదీ యొక్క ఈ చర్య సైనికులలో ఎంతో సంతోషాన్ని, ఆప్యాయతను నింపింది. యావద్దేశం తమవెంట ఉన్నదనే ధైర్యాన్ని కలిగించింది. 'భారత్ మాతా కీ జయ్' నినాదంతో మోదీ పర్యటన ముగిసింది.
 
- ధర్మపాలుడు