పశువులను బతకనివ్వరా?

కబేళాలకు అనుమతులపై హైకోర్టు ఆగ్రహం - మార్గదర్శకాలు జారీ

పశు వధశాల
రాష్ట్రంలో ఎడాపెడా జంతు వధశాలలకు అనుమతులు ఇస్తూ పశు సంపద తరిగిపోవడానికి ప్రభుత్వమే కారణమౌతుందని  హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. పశు సంపద తరిగిపోకుండా చూసేందుకు వీలుగా మార్గదర్శకాలను కూడా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి జారీ చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా కబేళాల ఏర్పాటుకు ఆ జిల్లాలోని మానవ సంపదకన్నా పశు సంపద పది నుంచి ఇరవై శాతం కన్నా ఎక్కువ ఉంటేనే అనుమతి జారీ చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో ఇకముందు ఎటువంటి కబేళాలకు అనుమతి ఇవ్వరాదని ఆయన ఆదేశించారు. మెదక్ జిల్లాలో అధికారులే దాని నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ఖురేషీ ఇంటర్నేషనల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ, కబేళా ఏర్పాటుకు పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇవ్వడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. మెతుకు సీమగా పేరొందిన మెదక్ జిల్లాలో కబేళా ఏర్పాటుతో పశు సంపద తుడిచి పెట్టుకుపోతోందని, ఇబ్బడి ముబ్బడిగా జంతు వధశాలలను ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పశు సంపదను గ్రామ సంపదగా గతంలో పరిగణించేవారని, ఇప్పుడు ఆ రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. కబేళాల దాహార్తికి గ్రామాల్లో పశుసంపద అంతరించిపోతోందని అన్నారు. పారిశ్రామికీకరణ పేరుతొ మెదక్ జిల్లా స్వరూపమే నేడు మారిపోయిందని, ప్రజలు నివసిన్చారాని విధంగా కాలుష్యం పెరిగి పోయిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.   

పశు సంపద లేని గ్రామాలను ఊహించలేమని, ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే జంతు సంపద కనుమరుగవ్వడం ఖాయమని వ్యాఖ్యానించారు. పశు సంపదను కబేళాలకు తరలించడం ద్వారా వచ్చే ఆదాయానికి ప్రభుత్వం ఆర్రులు చాస్తోందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామంలో పశు సంపదను పెంపొందించేందుకు ప్రయత్నించే సమయం ఆసన్నమయిందని, ఇందుకు ప్రభుత్వం పూనుకోవాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. కబేళాకు అనుమతి ఇవ్వాలంటే దాని యాజమాన్యం పశు సంపదను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

- ఈనాడు
- రాము