హిందూ సమాజంలో వైషమ్యాలు నిర్మాణం చెయ్యాలని చూస్తున్న రాక్షసారాధకులు


ఈ మధ్య విజయదశమికి ముందు రోజు ఒక టివి చానెల్ లో రావణాసురుడు చాలా గొప్పవాడని, అతని రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉన్నారని అటువంటి రావణాసురుడిని రాముడు చంపాడనే చర్చ ఒకటి జరిగింది. రావణాసురుని రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండవచ్చు. కాని రావణాసురుడు చేసిన దుర్మార్గాలు, అరాచకాలు అంతకంటే ఎక్కువ. అవన్నీ చెప్పుకొంటూ పొతే అదొక పెద్ద గ్రంథమవుతుంది . అట్లాగే నరకాసురుడి గురించి కూడా చాలా గొప్పగా చెబుతున్నారు. 16వేల మంది కన్యలను చెరబట్టి వారిని చంపి యజ్ఞం చేయాలనుకున్నవాడు చాలా గొప్పవాడని చెప్పటం, అటువంటి వారు మా వర్గానికి చెందిన వారని చెప్పుకోవటం ఈ మధ్య కనబడుతోంది. ఇది చాలా లోతైన ఎత్తుగడ. హిందూ సమాజంలో వైషమ్యాలు నిర్మాణం చేసి చీల్చాలనే కుట్ర దీని వెనుక కనబడుతున్నది. దీనికి రుజువుగా ఆర్య-ద్రావిడ సిద్ధాంతం అనే త్రిశంకు సిద్ధాంతాన్ని ఈ దేశంమీద బ్రిటిష్ వాళ్ళు ఏనాడో రుద్ది వదలిపెట్టారు. ఈ సిద్ధాంతం ఆధారంగా ఆర్యులు బయటినుండి వచ్చినవారని, ద్రావిడులు మాత్రమే స్థానికులని అపోహలు కల్పించారు. ప్రస్తుతం పై సంఘాల వారు రాక్షసులు ద్రావిడ జాతివారనీ, కనుక దళితులు రాక్షస సంతతివారని విచిత్రమైన వాదన చేస్తున్నారు. రామాయణ మహాభారత కాలం నాటి చరిత్రకు అందని రాక్షస కథనాలను, ఇటీవల 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ప్రతిపాదించిన ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలకు ముడివేయటం అభూతకల్పనే.  

ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా మరియు అమెరికాలో జరిగిన అనేక చారిత్రిక అంతర్జాతీయ సదస్సులలో ఆర్య-ద్రావిడ సిద్ధాంతానికి ప్రామాణికత లేదని, అది ఒక అభూతకల్పన అని ప్రముఖంగా ఖండించటం జరిగింది. అట్లాగే శాస్త్రీయ పరిశోధనలలో ఈ దేశ ప్రజలందరు ఒకే జాతివారనీ, ఇక్కడ నుండి అనేక దేశాలకు వెళ్ళారనే అంశం కూడా నిర్ధారించబడింది. అయినప్పటికీ ఈ దేశంలోని కుహనా సెక్యులర్ వాదులు, అభ్యుదయ వాదులమని చెప్పుకొనే వామపక్ష సంఘాల వారు ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ సమాజాన్ని భిన్న రకాలుగా చీల్చటానికి ప్రయత్నం చేస్తున్నారు.  రాక్షసులు ఆసురీ ప్రవృత్తి కలవారు. రాక్షసులకు, దళితులకు మధ్య పొంతన లేని సంబంధాలను ఆపాదిస్తున్నారు. ఉపకారానికి ప్రతీకలైన దళితులకు రాక్షస సంబంధాలను అంటగడుతున్నారు. ఇది నిమ్నవర్గాల వారిని హిందూమతం నుండి దూరం చేయటానికి వామపక్ష అభ్యుదయ వాదులు, క్రైస్తవ సంఘాల వారు చేస్తున్న కుట్ర. తద్వారా హిందూ సమాజంలో గందరగోళం సృష్టించటం వీరి ముఖ్య ఉద్దేశ్యం. కనుక దళిత సోదరులు ఈ విషయమై చైతన్యవంతులై ఆలోచించవలసిన అవసరం ఉంది. 

- పతికి