మంచిని గ్రహించని మన మేధావులు

 
డిశంబరు 2, 2014 నాటి ఇండియాటుడే తెలుగు పత్రికలో "భారతదేశాన్ని తిరిగి వేదశకానికి తీసుకొనివెళ్ళే ప్రయత్నం" అనే పేరుతో శేఖర్ గుప్తా వ్రాసినవ్యాసం చదివితే ఇటువంటి మేధావులను చూసి నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి. సంస్కృతభాష గురించి, వేదాల గురించి, వేదాలలో ఉన్న విజ్ఞానం గురించి తెలియకపోతే నిజాయితీగా ఒప్పుకోవటం లేక తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. ఈ రెండూ చేయక తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తే ఎట్లా ఉంటుందో ఈ వ్యాసం చదివితే అర్థమవుతుంది.  
 
శేఖర్ గుప్త వంటి మేధావులకు సామాన్య విషయాలు అర్థం కావనే అనుమానం వస్తున్నది. ఎందుకంటే వారువ్రాసిన ఈ మాటలు గమనిద్దాం -"భారతదేశంలో చరిత్ర చాలాకాలంగా రాజకీయం మరియు సిద్ధాంతాల మధ్య సాగే ఫుట్ బాల్ ఆటగా సాగుతున్నందుకే బహుశ ఆర్.ఎస్.ఎస్. మేధావులు ఇప్పుడు చివరకు ఇంతకాలంగా దేశంలో ప్రబలశక్తిగా వెలుగొందుతూ తాము సొంతంగా ఏర్పరచుకొన్న లౌకికవాదానికి సంబంధించిన వంకరభాష్యాన్ని తీసుకొనివచ్చిన వామపక్షాలతో కలిసేందుకు కూడా సిద్ధమయ్యారని అర్థం చేసుకొని ఉంటారు. తాజ్ మహల్ ఒక హిందూదేవాలయం అని వాదిస్తున్నట్లే చరిత్ర వాస్తవాలను కూడా అహేతుకమైనవిగా పదేపదే చెప్పినప్పటికి అది ఇప్పటికీ ఇంత దృడమైన భేదాభిప్రాయాలు, వివాదాలను దాటుకొని నిలబడగలదు. అయితే అది చరిత్రతో ఆగిపోకుండా సైన్సును కూడా మతవిశ్వాసంతో గందరగోళపరిచినందునే మరింత గొప్పసవాలు ఎదురవుతుంది". ఇవీ ఆ వ్యాసంలోని వాక్యాలు. ఇది ఏమైనా అర్థమవుతున్నదా? జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్తగా చదివితే గందరగోళంలో ఎవరు పడుతున్నారో అర్థమవుతుంది. శాస్త్రము, సాంకేతిక విషయాలపై నిరంతర పరిశోదన సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు సైన్సు చెబుతున్న విషయాలు రాబోయే రోజులలో సరియైనవి కావు అని నిరూపించేవారు బయలుదేరారు. అందుకే మన పెద్దలు "ఆధాతో బ్రహ్మజిజ్ఞాస" అని చెప్పారు. భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ మసీదులు అన్నికూడా దేవాలయాలను కూలగొట్టి కట్టినవే. తాజ్ మహల్ దేవాలయమో? కాదో ? తెలుసుకొనేందుకు తాజ్ మహల్ ను అధ్యయనం చేయాలి. వారు వ్రాసిన తీరు చూస్తుంటే కాశీవిశ్వనాథ మందిరాన్ని కూల్చి దానిపైనే కట్టిన మసీదును చూపి అది నిజమైన మసీదే అని వాదించేటట్లున్నది. బ్రిటిష్ వాళ్ళు, మార్క్స్ సిద్ధాంతకర్తలు వ్రాసిందే చరిత్ర అనుకోవటమే అసలు గందరగోళం. వాస్తవాలు వెలుగులోకి వస్తే జాతిలో స్వాభిమానం పెరుగుతుంది, అది పెరగకూడదని బ్రిటిష్ వాళ్ళు అనుకోవటంలో అర్థముంది. కాని, మన మేధావులు ఇలా అనుకొంటే వాళ్ళను ఏమనాలి? 
 
శాస్త్ర సాంకేతిక విషయాలు ఒకవేళ వేదంలో చెప్పబడి ఉంటే వాటిని అధ్యయనం చేయటం, దానిపై ప్రయోగాలు చేయటం అభ్యంతరకరమంటారా? ఇంతకీ ఈ విషయాలను శేఖర్ గుప్త ప్రస్తావించటానికి కారణం బహుశ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం విద్యారంగాన్ని మారుస్తున్నదని, చరిత్రను మారుస్తున్నదని పదేపదే చెబుతూ ప్రజలను గందరగోళంలో పడెయ్యాలనే ఆలోచన ఉన్నట్లున్నది. ఎక్కడ ఏ మంచి ఉన్నా, దానిని అంగీకరించి, దానికి గుర్తింపు ఇచ్చే సుగుణం భారతీయులలో ఉంది. మంచి విషయాలను గ్రహించి దానిపై పరిశోధన చేస్తే ఈ మేధావులకు ఏమైనా అభ్యంతరమా? 
 
ఈ రోజున దేశంలో వేదాలలో ఉన్న శాస్త్రసాంకేతిక విషయాలపై అనేకమంది అద్యయనం చేస్తున్నారు. పరిశోధన చేస్తున్నారు.  ఆ విషయాలను వెలుగులోకి తీసుకొనివచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పా? భారతదేశంలో పాతక్రొత్తల మేలికలయిక కావాలి. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రజల జీవనాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నవో? ఎన్ని సమస్యలు సృష్టిస్తున్నవో కూడా మనం అర్థం చేసుకోవాలి. మానవజాతి మనుగడకు, కళ్యాణానికి ఏది అవసరమో దానిని గ్రహించి ఆ దిశలో ముందుకు వెళ్ళాలి. దీనిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నవారే శేఖర్ గుప్త వంటి మేధావులు.