కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు కావాలి

 
బ్రిటిష్ పార్లమెంటులో మొట్టమొదటిసారి కాశ్మీరీపండిట్స్ విషయం ప్రస్తావించబడింది. 2015 జనవరి 20వ తేదీన బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు బాబ్ బ్లాక్ మెన్ (Bob Blackmen) పార్లమెంటులో మాట్లాడుతూ 'కాశ్మీరీ పండిట్స్ ను లోయనుండి తరిమివేసి 25 సంవత్సరాలయింది, ఆ సంఘటనకు విచారిస్తూ వారికి సంఘీభావం తెలిపా'లంటూ కోరాడు. దానికి ఆ సభలోని పదిహేను మంది నుండి సమర్ధన లభించింది. కాశ్మీర్ లోయలో ముస్లింల దాడులు, సరిహద్దు వెంబడి ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయి. వారికి రక్షణ కల్పించాలని కోరుతూ వారికి బ్రిటిష్ పార్లమెంటులో సంఘీభావం తెలుపబడింది. 
 
కాశ్మీర్ సమస్య చాలా చిక్కులతో కూడుకొని ఉన్నది. కాశ్మీర్ లో ఇస్లామిక్ సామ్రాజ్యవాదం కనబడుతుంది. తీవ్రవాదం-ఉగ్రవాదం, రెండవ ప్రక్క అసంఘటిత హిందూసమాజం రెండూ కనబడతాయి. ప్రపంచంలో ఎక్కడైనా ముస్లిం జనాభా 30% దాటినట్లయితే ఆ ప్రాంతాలను పూర్తి ఇస్లామీకరణ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. దానికి అనేక మార్గాలు. ఆ మార్గాలలో దాడులు కూడా ఒకటి. ఇస్లామీకరణ ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాటానికి దారితీస్తుంది. కాశ్మీర్ చరిత్రకూడా అదే చెబుతుంది. కాశ్మీర్ లోయనుండి కాశ్మీర్ పండిట్స్ ను తరిమివేయటం ఇస్లామీకరణలో భాగం. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి అక్కడ ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారము జమ్మూకాశ్మీరులో 68.3% ముస్లింలు ఉన్నారు. దీనిప్రభావం అన్నిచోట్ల కనబడుతున్నది. 
 
ఈ నేపథ్యంలో ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలను అర్థం చేసుకోవాలి. ఈసారి జరిగిన ఎన్నికలలో జమ్మూలో భారతీయ జనతాపార్టీకి, కాశ్మీర్ లోయలో పి.డి.పి.కి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చింది. కాశ్మీర్ లోయలో కేవలం మతపరంగానే ఓట్లు పోలయ్యాయి. అక్కడ పి.డి.పి. కాక మిగతా పార్టీలకు కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. చివరకు పి.డి.పి., బి.జె.పి. కలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం ఏర్పడుతుంది. 
 
 
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ప్రశాంత పరిస్థితులు రావాలని జమ్మూలోని ప్రజల ఆకాంక్ష. ఈసారి వచ్చిన ఫలితాలు ఒక మంచి మార్పుకు దారితీయాలని వారి కోరిక. కేంద్రప్రభుత్వం చొరవ తీసుకుని తరిమివేయబడిన కాశ్మీరీ పండిట్స్ ను గౌరవప్రదంగా వారివారి స్వస్థలాలకు పంపించబడాలి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పూర్తిగా అణచివేయాలి. అలాగే దేశ విభజన జరిగిన సమయంలో పాకిస్తాన్ నుండి తరిమివేయబడి భారత్ కు వచ్చిన హిందూ శరణార్థులకు నేటికి కూడా అక్కడి పౌరసత్వం లభించటం లేదు. రాష్ట్ర రాజకీయాలలో వారి భాగస్వామ్యం లేదు. ఇప్పటికీ శరణార్థులుగానే జీవిస్తున్నారు. వారి సమస్యలు కూడా పరిష్కారం కావాలి. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భవితవ్యం ఏమిటి? భారత పార్లమెంటు చేసిన ఏకగ్రీవ తీర్మానం అమలు ఎప్పుడు చేస్తారో తెలియదు. ఈ సమస్యలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. 
 
ఎన్నికల ఫలితాలు వెలువడి చాలారోజులు గడిచినా ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పడి కాశ్మీర్ లో అభివృద్ధకి కృషి జరగాలి. ఆ దిశలో అక్కడి రాజకీయ పార్టీలు తమ రాజకీయ విభేదాలను ప్రక్కనపెట్టి ఆలోచించవలసిన తరుణమిది.

- మల్లిక్