ధర్మనిష్ఠను కాపాడటానికి అవసరమైతే బలిదానం కావాలి

గురు తేగ్ బహదూర్

సిక్కుల తొమ్మిదవ గురువైన గురు తేగ్ బహదూర్ దగ్గరకు మొగలుల అత్యాచారాలకు గురైన కాశ్మీర్ పండితులు వచ్చారు. కాశ్మీర్ లో తమపై జరుపుతున్న ఆకృత్యాలను, అత్యాచారాలను తేగ్ బహదూర్ కు తెలియచేసారు. ఆ సమయంలో మొగలుల మత దురహంకారాన్ని అడ్డుకోవడం ఎలా అని గురు తేగ్ బహదూర్ ఆలోచించి ఇలా అన్నారు. ఎవరైనా శ్రేష్ఠ పురుషుడు మన హిందూ ధర్మరక్షణ కోసం బలిదానం కావాలని అన్నారు. ఈ మాటలు విని గురు తేగ్ బహదూర్ కొడుకైన గోవింద్ సింగ్ "తండ్రీ మిమ్మల్ని మించిన శ్రేష్ఠ వ్యక్తి ఎవరున్నారు?" అని అన్నాడు. అది విని ఆలోచనలో పడ్డ తేగ్ బహదూర్ హిందూ ధర్మ రక్షణ కోసం బలిదానం కావడం కోసం నిశ్చయించుకొని కాశ్మీర్ పండితులతో "గురు తేగ్ బహదూర్ మతం మార్చుకుంటే మేమంతా మతం మార్చుకుంటామని ఔరంగజేబుకు చెప్పమని" చెప్పాడు. రాజ్యాధికారానికి, ధర్మనిష్ఠకు మధ్య సంఘర్షణ జరుగుతున్నప్పుడు ధర్మనిష్ఠను కాపాడేందుకు అవసరమైతే బలిదానం కావటానికి వెనుదీయరాదని నిర్ణయించుకొన్నాడు. అన్ని మతాలను సమానంగా గౌరవించమని ఔరంగజేబుకు నచ్చ చెప్పేందుకు గురు తేగ్ బహదూర్ ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు  చాందిని చౌక్ లో 1675 నవంబర్ 11న భగవధ్యానం పూర్తి చేసుకొని బలిదానానికి సిద్ధమయ్యాడు. ఆయన తలను ఆ ముష్కరులు నరికి వేశారు. తేగ్ బహదూర్ అమరులయ్యారు.