"ఆపన్నులను ఆదుకోవాల్సిన బాధ్యత హిందువులదే"

ప్రథమవర్ష శిక్షావర్గ సమారోప్ లో శ్రీ అమరలింగన్న 

సార్వజనికోత్సవ వేదికపై హాజరైన శ్రీ బండారి రమేశ్, శ్రీ దేశ్ ముఖ్, శ్రీ నంగునూరి చంద్రశేఖర్, శ్రీ ప్యాట వెంకటేశ్వర్లు, శ్రీ అమర లింగన్న

"హిందూ సమాజ సంఘటన కోసం డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ నాగపూర్ లో ప్రారంభించిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నేడు మహా వటవృక్షం మాదిరిగా విస్తరించి అనేక సామాజిక రంగాలలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. హిందూ సమాజంలోని ఆపన్నులను ఆదుకోవడానికి సంఘం దేశంలో సుమారు లక్షకు పైగా సేవా ప్రకల్పాలను నిర్వహిస్తున్నది. సమాజంలోని ఆపన్నులను ఆదికోవాలన్న స్ఫూర్తి స్వయంసేవకులకు సంఘ శాఖ ద్వారా లభిస్తుంది" అని ఆర్.ఎస్.ఎస్. ప్రథమ వర్ష సంఘ శిక్షావర్గ సమారోప్ ఉత్సవంలో శ్రీ అమర లింగన్న పేర్కొన్నారు. 

భాగ్యనగర్ శివార్లలోని అన్నోజీగూడ గ్రామంలో గల రాష్ట్రీయ విద్యాకేంద్రం ప్రాంగణంలో మే 6వ తేదీ నుండి 20 రోజుల పాటు  ప్రథమవర్ష శిక్షావర్గ జరిగింది. మే 25వ తేదీ సాయంత్రం జరిగిన సార్వజనిక ఉత్సవంలో శ్రీ లింగన్న మాట్లాడుతూ హిందూ సమాజంలోని ఆపన్నులను, అనాథలను, గిరిజనులను, బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత హిందువులదేనని ఈ దిశగా స్వయంసేవకులు కృషి చేస్తున్నారని చెప్పినారు.

ఇంకా మాట్లాడుతూ - "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 86 సంవత్సరాలుగా హిందూ సమాజ సంఘటన మాధ్యమంగా ఈ దేశ వైభవం కోసం పని చేస్తున్నది. వ్యక్తులలో శారీరిక, మానసిక వికాసం ద్వారా వ్యక్తి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నది.  

చిన్నప్పటి నుంచే దేశభక్తి గల డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ డాక్టర్ చదివినప్పటికీ, తమ ఆనందమయ జీవితాన్ని భారతమాత పాదాల వద్ద సమర్పణ చేశారు. వారు అనేక స్వాతంత్ర్య ఉద్యమ పోరాటాలలో పాల్గొన్నారు. పిడికెడు మంది ఆంగ్లేయులు ఇంత పెద్ద దేశాన్ని బానిసగా చేసుకోవడానికి కారణం కేవలం వారి శక్తి మాత్రమే గాక, ఇక్కడి ప్రజల అనైక్యత, దేశ ద్రోహుల సహకారం అని డాక్టర్ జీ గుర్తించారు. దీనికై హిందూ సంఘటనా కార్యాన్ని చేయాలని సంకల్పించి, 1925 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని స్థాపించారు. 

భగవాధ్వజానికి ప్రదక్షిణ చేస్తూ సంచలనం చేస్తున్న స్వయంసేవకులు

35 సంవత్సరాల వయసు ఉన్న డాక్టర్ జీ పిల్లలతో ఆడుకోవడం చూసి అందరూ పిచ్చి వాడనుకున్నారు. కాని ఆ చిన్న పిల్లలే పెద్దవారై ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిగా అవతరించారు. వారిలో బాలాసాహెబ్ జీ, ఏకనాథ్ జీ, మాధవరావు మూలే - ఇలా ఎందరో మహానుభావులున్నారు.  

రాబోయే సంవత్సరం స్వామి వివేకానంద 150 వ జయంతి ఉత్సవాలు జరుపుకొంటున్నారు. స్వామీజీ హిందూ సమాజ పరివర్తన కోసం పరితపించారు. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు గల యువకులు కావాలన్నారు. ఇటువంటి వారిని సంఘంలో డాక్టర్ జీ తయారు చేశారు. పేదల అభివృద్ధి కోరారు స్వామి వివేకానంద. స్వామీజీ ఏదైతే కోరుకొన్నారో దానిని సంఘం చేస్తున్నది. 

సంఘంలో నిర్మాణమైన కార్యకర్తలు అనేక రంగాల్లోకి వెళ్లి పని చెయ్యడం ప్రారంభించారు. పేదల అభివృద్ధి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. గ్రామ భారతి పేర గ్రామ వికాసం, సేవా భారతి పేర అనేక సేవా కార్యక్రమాలు నేడు జరుగుతున్నాయి. అటువంటివి లక్షకు పైగా ప్రకల్పాలు దేశవ్యాప్తంగా నిరంతరంగా జరుగుతున్నాయి. అప్పటి రాష్ట్రపతి డా.అబ్దుల్ కలాం మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ కు వెళ్ళారు. అక్కడ కేవలం రెండు గంటలు మాత్రమే ఉండాలనుకొన్నవారు  రోజంతా ఉన్నారు. అక్కడి గ్రామ వికాసం చూసి ఆశర్యపోయారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి ఈ విధంగా గ్రామ వికాసం కోసం కృషి చేయమని చెప్పారు. దేశవ్యాప్తంగా గ్రామ వికాసం కోసం ఆర్.ఎస్.ఎస్. పని చేస్తోంది.   


శారీరిక ప్రదర్శనలు చేస్తున్న స్వయంసేవకులు

అలాగే కొండ కోనల్లో వనవాసీ కళ్యాణ ఆశ్రమం పని చేస్తున్నది. ఒక లక్షా ఇరవై అయిదు వేల మంది విద్యార్థులకు చదువు నేర్పిస్తున్నది. 

ఈశాన్య రాష్ట్రాల్లో సంఘం ప్రవేశించిన కారణంగా క్రైస్తవులుగా మారిన వారిని పునరాగమనం గావించి వారిలో స్వాభిమానం నిర్మాణం చేసింది. త్రిపురలో వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ ద్వారా తయారయిన కిషన్ చంద్ అనే విద్యార్థి ఐ.ఏ.ఎస్.కు సెలెక్ట్ అయ్యాడు. అలాగే క్రీడలలో క్రీడా భారతి పని చేస్తున్నది. 

1963 లో ప్రారంభమైన విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజంలో ధార్మిక జాగరణ చేస్తున్నది. దేశ వ్యాప్తంగా నేడు హిందువులు ధార్మికంగా జాగృతమవుతున్నారు.  

ఈ విధంగా నేడు అన్ని రంగాలలో హిందూ సమాజం జాగరితమవుతున్నది. దీనికి కారణం డాక్టర్ హెడ్గేవార్, వారు ప్రారంభించిన సంఘం. అయితే ఇది చాలా తక్కువ. ఇది చాలదు. దీనిని పెద్దలు గ్రహించాలి. పూర్తి సమాజంలో స్పందన రావాలి. దానికోసం ఇంకా ఎక్కువగా పని చేయాలి.  

నేడు మనం ప్రమాదపు అంచుల్లో ఉన్నాం. మన గల్లీలోకి మత మార్పిడులు, లవ్ జీహాద్ వంటి సమస్యలు ప్రవేశిస్తున్నాయి.  

ఈ సమస్యలన్నీ తీరాలంటే సమాజంలోని సర్వ సాధారణ వ్యక్తి స్పందించాలి. అపుడే ఈ దేశంలో మార్పు వస్తుంది. మా పిల్లవాడు నిజాయితీ గల ఆఫీసర్ కావాలని ప్రతి తల్లిదండ్రి కోరుకోవాలి. సంఘానికి సానుభూతి కాదు, సహకారం కావాలి. ప్రతి వ్యక్తి తమవంతు శక్తిని అందించడానికి ముందుకు రావాలి. అప్పుడే "వ్యక్తి వ్యక్తిలో సంస్కార నిర్మాణం" అనే సంఘ లక్ష్యం నెరవేరుతుంది.

సుభాష్ చంద్ర బోస్, సావర్కర్, వివేకానంద వంటి వారు దేశభక్తులు. వారు కోరుకున్న లక్ష్యాన్ని మనం విస్మరించరాదు. ఈ లక్ష్యాలు నెరవేరాలంటే నవ యువకులు ముందుకు రావాలి. తమ నవ యవ్వనాన్ని సమర్పించాలి.  

డాక్టర్ జీ విజయం వరించటం మాత్రమే నేర్పారు. విజయమంటే విజయమే. అది నష్టంతో కూడిన విజయం కాదు. గొప్ప విజయం మాత్రమే. దీనిని లక్ష్యంగా పెట్టుకొని మనం మన పనిలో ముందుకు సాగుదాం" అంటూ శ్రీ అమర లింగన్న ప్రసంగాన్ని ముగించారు.  

20 రోజుల పాటు మండు వేసవిలో జరిగిన ఈ శిక్షావర్గలో పశ్చిమ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి 627 మంది శిక్షార్ధులు పాల్గొన్నారు. శారీరిక, బౌద్ధిక అంశాల్లో శిక్షణ పొందారు. ఈ శిక్షణకు ఎవరి ఖర్చులు వారే భరించారు. 

సార్వజనికోత్సవంలో శ్రీ బండారి రమేష్, శ్రీ దేశ్ ముఖ్, శ్రీ నంగునూరి చంద్ర శేఖర్, శ్రీ ప్యాట వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.