దివికేగిన వాత్సల్యం - వాత్సల్యానంద భారతి అస్తమయం

వాత్సల్యానంద భారతి స్వామి

ప్రముఖ పరివ్రాజకుడు, భారతమాత సేవకుడు హిందూ ధర్మాభిమాని శ్రీ వాత్సల్యానంద భారతి స్వామి వారు మే 17 వ తేదీ నాడు నెల్లూరు జిల్లాలోని జయభారత్ ఆసుపత్రిలో సిద్ధి పొందారన్న వార్తను పాఠకులకు అందించవలసి వస్తున్నందుకు లోకహితం తీవ్రంగా వ్యధ చెందుతున్నది. స్వామి వారికి నివాళులర్పిస్తున్నది. 

స్వామి వారి పూర్వాశ్రమ నామధేయం వేదాంతం సంగమేశ్వర శాస్త్రి. 1960 దశకంలో వాణిజ్య శాస్త్రంలో పట్టభద్రుడైన శ్రీ శాస్త్రిగారు కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారకునిగా జీవితం ప్రారంభించారు. 1964 నుండి 1989 వరకు అంటే 25 సంవత్సరాలు సంఘ ప్రచారక్ గా పని చేశారు. సంఘ శాఖలలో స్వయంసేవకుల చేత చక్కని ఆటలు ఆడించటం, వ్యాయామ క్రీడలలో శిక్షణ ఇవ్వడం, కార్యకర్తలలో మంచి క్రమ శిక్షణను ప్రోది చేయడం వంటి ఎన్నో విద్యలలో శాస్త్రిగారు దిట్ట. శాస్త్రిగారు సంఘ పాటలు బాగా పాడేవారు. తెలుగు, హిందీ పాటలు నైపుణ్యంతో గానం చేసే వీరికి కొన్ని వందల పాటలు కంస్తంగా వచ్చు. తూర్పు  గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో వీరు గణనీయంగా సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళారు. విశాఖలోని భారతీయ జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాల స్థాయికి తీసుకెళ్లడంలో వీరి పాత్ర గణనీయం. విశాఖపట్నంలో భారతీయ జనసంఘానికి క్రొత్త ఊపిరులూది భారతీయ జనసంఘ్, తరువాత భారతీయ జనతా పార్టీలకు పటిష్టమైన బలం చేకూర్చడంలో వీరి పాత్ర అమోఘం. 

నెల్లూరులో ఉన్నప్పుడు వీరు మత్స్యకారుల గ్రామాలపై దృష్టి సారించి వారి అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆ విధంగా రూపుదిద్దుకున్నదే ఇసుకపల్లె పట్టపు పాలెం. ఈ గ్రామంలో వీధులు విశాలంగా ఉంటాయి. పిల్లలంతా బడికి వెళతారు. గ్రామస్తులు స్వచ్చందంగా మద్యపానం మానివేశారు. పొదుపు పాటిస్తారు. ఆ గ్రామ ప్రజలకు అప్పుల బాధ లేదు. ఎన్నో జిల్లాలలో పని చేసిన శాస్త్రిగారు 1985 లో ప్రాంత సేవా ప్రముఖ్ గా బాధ్యతలు తీసుకున్నారు.

1989 లో ప్రచారక్ గా మానుకున్న తరువాత వాత్సల్య సింధు (నిరాధార బాలికల సంక్షేమ గృహం), భారతీయ విద్యావికాస్ హైస్కూల్ (సార్వజనిక్ విద్య), వానప్రస్థ గృహం (నిరాధార వృద్ధుల సంక్షేమ గృహం) స్థాపించి 15 సంవత్సరాల పాటు నిరాఘాటంగా నడిపించారు. ఈ మూడు ప్రాజెక్టులకు సంవత్సరానికి కోటి రూపాయలు ఖర్చు ఉండేది. చేతిలో పైసా లేని శాస్త్రిగారు ఇంత పెద్ద ప్రాజెక్టును ఎలా నడిపారో చూస్తే వారి ఘనత ఎంత గొప్పదో అర్ధమవుతుంది. వీరి చొరవతో ఏర్పడిన సింహపురి (నెల్లూర్) జయభారత్ హాస్పిటల్ ఇప్పుడు 200 పడకలతో వర్దిల్లుతున్నది. 1989 లో పూజనీయ డాక్టర్జీ  శతజయంతి సందర్భంగా సముద్ర తీరంలో కేశవ నావ నడిపించి విజయవంతం చేశారు.

ఈ సమాజంలోని గుండె గుండెలో భారతమాతను నింపాలని శాస్త్రిగారు కలలు కంటూ ఉండేవారు. ఈ సమాజం కాషాయ వస్త్రధారి (సన్యాసి) మాటలు ఎక్కువగా గౌరవిస్తుంది. కాబట్టి తాను తలబెట్టిన ఈ 'గుండె గుండెలో భారతమాత తత్వ ప్రచారం' సన్యాసిగానే మొదలుపెట్టాలని శ్రీ శాస్త్రిగారు సంకల్పించారు. దానికి అనుగుణంగా 2010 లో తిరుపతిలో శ్రీ కుర్తాళం సిద్దేశ్వర పీఠాధిపతులు  శ్రీ శ్రీ శ్రీ  సిద్ధేశ్వరానంద భారతీ మహా స్వాముల చేతులమీదుగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి నిరంతరం పర్యటిస్తూ ఇంటింటా భారతమాత చిత్రపటం ఉండేలా కృషి చేశారు. దేశభక్తి లేని దైవభక్తి, దైవభక్తి లేని దేశభక్తి నిరర్ధకం, నిష్ఫలమని, దేశభక్తి గల దైవభక్తి పరమార్ధమని ప్రబోధించారు.

మన హిందూ జీవన విధానంలో చెప్పినట్లుగా నిజమైన సన్యాసి ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఏ విధంగా దేశ సేవ, సమాజ సేవ చేయాలో వీరు ఆచరణాత్మకంగా చేసి చూపించారు.

మే 7, 2012 నాడు ఏలూరు దగ్గర వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై, చికిత్స పొందుతూ 17 వ తేదీన ఇహలోక యాత్ర చాలించారు. కొంత మంది మరణం తర్వాత కూడా జీవించే ఉంటారు. అటువంటి వారే వాత్సల్యానంద భారతి స్వామి వారు.

ప్రచారక్ గా, అయ్యగా, సన్యాసిగా తన కోసం గాక సమాజం కోసం జీవించి, తపించిన శ్రీ వాత్సల్యానంద భారతి చూపిన మార్గంలో నడిచి మన జీవితాలు ధన్యం చేసుకుందాం. 

- ధర్మపాలుడు