రామాయణ, మహాభారతాలు చారిత్రిక గ్రంథాలే


ప్రాచీన కాలంలో మన వాళ్ళు చెప్పినది కట్టుకథలుగా ఇప్పటివరకు ప్రచారం చేసారు. కాని అవి కట్టుకథలు కాదు, వాస్తవాలు అని శాస్త్ర పరిశోధనల ద్వారా బయటకు వస్తున్నది.

ఈ మధ్య డిల్లీలోని ఇన్ స్టిట్యూట్  ఫర్ సైంటిఫిక్ రిసెర్చ్ ఆఫ్ వేదాస్ (ఇ-సర్వే) సంస్థ రాముడు నిజంగా పుట్టాడా? అనే అంశంపై పరిశోధన చేసారు. రాముడు నిజంగానే పుట్టాడు. అయోధ్య పుర వీధులలో నడియాడాడని డంకా బజాయించి మరీ చెబుతున్నారు. రాముడు జన్మించినప్పుడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయని, చైత్రమాసం శుక్ల పక్షం నవమి నాడు అభిజిత్ లగ్నంలో రాముడు జన్మించాడని, వనవాసానికి వెళ్ళేటప్పటికి ఆయన వయసు 25 సంవత్సరాలని, వాల్మీకి రామాయణంలో వ్రాసి ఉంది. దాని ఆధారంగా తన పరిశోధన మొదలుపెట్టారు. 

కీ.పూ.5114 సంవత్సరం జనవరి 10న రాముడు జన్మించాడని ఈ పరిశోధకులు చెబుతున్నారు. అంటే కలియుగానికి సుమారు 2 వేల సంవత్సరాలకు పూర్వం అన్నమాట. వాస్తవానికి రాముడు త్రేతాయుగంలో జన్మించాడు. త్రేతాయుగం తరువాత ద్వాపరయుగం, ఆ తదుపరి కలియుగం వచ్చాయి. కలియుగం ప్రారంభమై ఇప్పటికి 5113 సంవత్సరాలు పూర్తి అయి 5114 వ సంవత్సరం నడుస్తున్నది. కాని రామసేతువు గురించి చేసిన పరిశోధన ఇంకా వెనక్కు వెళ్ళింది. మన గ్రంథాలలో వ్రాసిన దానికి సుమారుగా అది సరిపోయింది. ఈ పరిశోధన ఇంకా కొనసాగవలసిన అవసరం ఉంది.

ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతున్నది. మనదేశంలో రామాయణం, మహాభారతం - ఈ రెండింటినీ మనం ఇతిహాసాలని అంటాము. ఇతిహాసం అంటే "ఇది చరిత్ర" అని అర్థం. కాబట్టి ఇతిహాసాలంటే చరిత్ర గ్రంథాలని అర్థం. కాబట్టి మనదేశంలో మనకు పాఠాలు నేర్పేది చరిత్రే. గతంలో జరిగిన పొరపాట్లు, దాని దుష్పరిణామాలు, వాటి నుండి మనం నేర్చుకోవలసిన పాఠాల గురించి చెప్పేది. ఈ రోజున పరిశోధకులు రామాయణం, భారతాలు చరిత్రకు సంబంధించిన వాస్తవాలే అని నిర్ధారిస్తున్నారు. అంతవరకూ మనం ఒప్పుకోవాలి. పరిశోధనలు ఇంకా కొనసాగినట్లైతే గ్రహగమనాల ఆధారంగా వ్రాయబడిన మన చరిత్ర వాస్తవికత అర్థమవుతుంది. రెండు అంశాలలో మన పూర్వీకుల అద్భుత జ్ఞానాన్ని ప్రపంచం అంగీకరిస్తున్నది. 1) ఖగోళ శాస్త్రం, 2) చరిత్రను ఖగోళ శాస్త్రం ఆధారంగా వ్రాయటం. దానివలన చరిత్రను ఏ కాలంలో నైనా తెలుసుకోవచ్చు. పరిశోధనలు ఇంకా కొనసాగాలని కోరుకుందాము.