గ్రహ నక్షత్ర గమనమే భారతీయ కాల గణన

 
భారతీయ కాలగణన గ్రహనక్షత్ర గమనం ఆధారంగా నిర్ణయించబడుతుంది. యుగాల క్రమం చూస్తే ప్రస్తుతం కలియుగం. ఈ కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది అనే వివరాలలోకి వెళ్తే శ్రీకృష్ణుని నిర్యాణం అనంతరం ద్వారకాపట్టణం సముద్రంలో మునిగిపోయింది. ఆ క్షణం నుండి కలియుగం ప్రారంభమైంది. 
 
ప్రస్తుత ఆంగ్లకాలమానం ప్రకారం కీ.పూ.3101 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి 2గం. 27ని. 30 సెకనులకు కలియుగం ప్రారంభమైంది. అంటే 3101+2015=5116 సంవత్సరాలు పూర్తి అయి, ఈ ఉగాదికి 5117వ సంవత్సరంలో శ్రీ మన్మధనామ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము.  
 
యుగాల వలే శకాలకు కూడా భారత కాలగణనలో ప్రాశస్త్యం ఉంది. ప్రముఖంగా ప్రాచుర్యంలో ఉన్నవి :
 
యుధిష్ఠిర శకం - 5153 వ సంవత్సరం
విక్రమార్క శకం - 2072 వ సంవత్సరం
శాలివాహన శకం - 1937 వ సంవత్సరం 
 
ప్రస్తుతం శ్రీ మన్మధనామ సంవత్సరం, ఉత్తరాయన పుణ్యకాలం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథిన కలియుగాబ్ది 5117 వ సంవత్సరం ప్రారంభమైంది. ఈ రోజును ఉగాది అంటారు. ఇదే మన కొత్త సంవత్సరం.  
 
ఇంతటి విశిష్టమైన కాలగణనను మనం మన వారసుల నుండి అందుకొన్నాము. ఇంగ్లీషు క్యాలెండర్ తోపాటు మన భారత కాలగణనను కూడా మనం తిరిగి అలవాటు చేసుకోవాలి. భారతీయులుగా ఇది మనకు గర్వకారణం.

- రాము