గోవుల రవాణాపై ఉక్కుపాదం

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టీకరణ


భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు నుండి అక్రమంగా జరుగుతున్న పశువుల రవాణాను, ప్రత్యేకించి గోవుల స్మగ్లింగ్ ను అడ్డుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ బి.ఎస్.ఎఫ్. జవాన్లకు విజ్ఞప్తి చేశారు. బి.ఎస్.ఎఫ్. జవాన్లు ఎన్నోరంగాల్లో సేవలు అందించాల్సిన అవసరముందని, బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాట్లను, నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకోవడమే కాకుండా పశువుల అక్రమ రవాణాను, ముఖ్యంగా గోవుల స్మగ్లింగ్ ను నిరోధించేందుకు కూడా కృషిచేయాలని ఆయన సూచించారు.

సరిహద్దు భద్రతాదళ 49వ వ్యవస్థాపకదినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1న న్యూఢిల్లీలో బి.ఎస్.ఎఫ్. జవాన్లనుద్దేశించి ప్రసంగిస్తూ రాజ్ నాథ్ సింగ్ ఈ విజ్ఞప్తి చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే గోవులను అక్రమంగా పొరుగు దేశాల్లోని కబేళాలకు తరలిస్తుండటం పట్ల రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, దాని అనుబంధ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ ఈ విజ్ఞప్తి చేశారు. 

గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన బి.ఎస్.ఎఫ్. జవాన్లను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బి.జి.బి. (బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్) డైరెక్టర్ జనరల్ అజీజ్ అహ్మద్ కూడా పాల్గొన్నారు.