వివేకానంద శిలాస్మారకం - ఓ పుణ్య తీర్థం

వివేక సూర్యోదయం - ధారావాహికం - 12


స్వామి వివేకానంద 1863 జనవరిలో జన్మించారు. 1962-63 వారి  జన్మశతాబ్ది వత్సరం. కన్యాకుమారిలోసముద్రం మధ్యలో శిలపై ఆయన దేశం కోసం 3 రోజుల పాటు అమ్మవారిని ధ్యానించారు. కన్యాకుమారి ప్రజల్లో ఆ శిలపై ఒక స్మారకం కట్టాలన్న ఆలోచన కల్గింది. 

ఒక శిలాస్మారక కమిటీ ఏర్పడింది. ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ శ్రీ పరమేశ్వరన్ కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. సముద్ర తీరంలోని మత్స్యకారుల్లో ఎక్కువమంది క్రైస్తవులు. వారు దీన్ని అడ్డుకోవాలనుకున్నారు. ఆ శిలపై ఒక 'శిలువ' ను నిలబెట్టారు. ప్రజలంతా దీన్ని ఖండించి అధికారులకు విన్నవించారు. శిలాస్మారక సమితి ఒక నౌకను శిలవరకు నడపాలని నిర్ణయించింది. కేరళ నుంచి కొందరు యువకులను తీసుకువచ్చారు. ప్రజలు శ్రీపాదశిలను చేరడం మొదలయింది. ఆ శిలపై అమ్మవారి పాదముద్రలన్నాయి. ఒకరోజులన 'శిలువ' మాయమైంది. ప్రభుత్వం శిలాప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. అపుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ భక్తవత్సలం శిలా స్మారకాన్ని వ్యతిరేకించారు. శిలపై ఒక ఫలకం పెట్టుకోమన్నారు. అక్కడ ఓ శిలాఫలకం ఉంచారు. క్రైస్తవులు ఆ శిలాఫలకాన్ని సముద్రంలో పారవేశారు. 

ఆందోళన మొదలైంది. ఆర్.ఎస్.ఎస్. అఖిల భారతీయ కార్యదర్శిగా ఉన్న శ్రీ ఏకనాథ్ రనడే శిలాస్మారక సమితిలో సంఘటనా మంత్రి అయ్యారు. ఆయన రామకృష్ణ మిషన్ ను సంప్రదించారు. శిలాస్మారకానికి వ్యతిరేకంగా ఉన్న నాటి గృహమంత్రి హుమయూన్ కబీర్ ను, ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలంను ఒప్పించారు. ముందు కేవలం ఓ 50 అడుగుల వివేకానంద విగ్రహం శిలపై ఉంచాలన్న ముఖ్యమంత్రి తరువాత ఆ విగ్రహం ఉంచేందుకు ఓ కట్టడం కూడా కావాలన్నారు. ఏకనాథ్ జీ ఢిల్లీలో లాల్ బహదూర్ శాస్త్రిజీని కలిసి వారి సలహా మేరకు ప్రధానమంత్రికి ఓ విజ్ఙాపన పత్రం తయారు చేయించారు. ఆ పత్రంపై కాంగ్రెసు, సోషలిస్టు, కమ్యూనిస్టు, డి.ఎమ్.కె. ఇలా అన్ని పార్టీలకు చెందిన నాయకులను కలిసి ఒప్పించి, ఆ పార్టీలకు చెందిన ఎం.పి.లందరి సంతకాలు సేకరించారు. సుమారు 323 మంది ఎం.పి.లు సంతకం చేశారు. ఆ విజ్ఙాపనను ఒకటి ముఖ్యమంత్రికి, ఒకటి ప్రధానమంత్రికి పంపారు. 

లాల్ బహదూర్ శాస్త్రి సహకారంతో శిలాస్మారకానికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అనుమతి లభించింది. అనేకమంది ప్రముఖులు భక్తవత్సలంకు లేఖలు వ్రాశారు. శ్రీ ఎమ్.సి.చాగ్లా గృహమంత్రి అయ్యారు. శ్రీ ఏకనాథ్ జీ వారిని కలిశారు. శ్రీ ఎస్.కె. ఆచారి శిల్పిగా నియమితులయ్యారు. శిలాస్మారక నమూనా చిత్రాలను కంచి కామకోటి పీఠాధిపతి ఆమోదించారు. ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం కూడా ఆమోదించారు. 

1964లో నిర్మాణం మొదలైంది. సుమారు కోటి రూపాయల నిధిని ఏకనాథ్ జీ దేశమంతా పర్యటించి అందరు ముఖ్యమంత్రులను కలిసి సేకరించారు. శ్రీపాద మంటపం, వివేకానంద మంటపం, ధ్యానమందిరంతో కలిపి మొత్తం 180 అడుగుల పొడవు, 56 1/2 అడుగుల వెడల్పు గల శిలాస్మారకం నిర్మాణం జరిగింది. వివేకానంద మంటపంలో వివేకానంద నిలువెత్తు విగ్రహం గంభీర వదనంతో జాతి హృదయాన్ని తట్టి లేపుతున్నట్లు ప్రతిష్టించబడింది. నాటి రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి చేతులమీదుగా శుభారంభం జరిగింది.

- హనుమత్ ప్రసాద్