పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలోని
చెన్న కేశవ ఆలయంలో పూజారులు దళితులు. పరంపరాగతంగా వందల సంవత్సరాల నుండి
అక్కడ దళితులే ఆలయ పూజారులుగా ఉంటున్నారు. వీళ్ళంతా సంస్కృతాంధ్ర భాషల్లో
పండితులే. ప్రాచీన రచనలు, వ్యాకరణ గ్రంథాల ఔపోశన పట్టినవారే. వీరి
పాండిత్యానికి మెచ్చి ఆలయ అర్చకుడు "తిరువీథి"ని 18 గ్రామాలలో హిందూ ధర్మ
ప్రచారానికి నూజివీడు జమీందారు నియుక్తి చేసినట్లుగా తెలుస్తున్నది. 1996లో
ఆ ఆలయ పూజారి కృష్ణమూర్తి పాండిత్యానికి మెచ్చి పండిత పురస్కారంతో
రాష్ట్రపతి శంకర దయాల్ శర్మ సన్మానించారు. ఈనాడు ఉన్నవారు సంస్కృతం, ఆంధ్ర
భాషల పండితులు. గ్రామంలో అందరి మన్ననలను పొందుతున్నారు. దేశం ఎదుర్కొంటున్న
అనేక సామాజిక సమస్యల పరిష్కారానికి ఇటువంటి మంచి ఉదాహరణలే ఆదర్శం. మన
హిందూ సమాజంలో వివక్షత లేకుండా ఉండేందుకు ఆరోగ్య వంతమైన ఇటువంటి ఉదాహరణలే
కావాలి. ఈ పనిని సాధించటానికి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వివిధ
కులాలవారికి దేవాలయంలో అర్చక శిక్షణ ఇస్తున్నది. సమాజంలోని అన్ని పనులకు
అందరికి అవకాశం ఇవ్వటం నేటి అవసరం. అప్పుడే సామాజికంగా అందరం కలిసి ఉండగలం.
- ఈనాడు సౌజన్యంతో