షెడ్యూల్డు
కులాలకు చెందినవారు క్రైస్తవమతంలో ఉండి తిరిగి తమ మాతృధర్మమైన
హిందుత్వంలోకి వస్తే వారిని షెడ్యూల్డు కులంగానే పరిగణించాలని, షెడ్యూల్డు
కులాలకు వర్తించే రిజర్వేషన్ సౌకర్యాలు వారికి వర్తిస్తాయని ఈ మధ్య
సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పింది. ఈ తీర్పులో ఇంకా ఈ విధంగా
వివరించింది. ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులు క్రైస్తవులైతే, ఆ వ్యక్తి
తిరిగి హిందూధర్మంలోకి వస్తే తన పూర్వీకులు షెడ్యూల్డు కులాలకు
చెందినవారేనని గుర్తింపు పత్రం తెచ్చుకోవాలి. షెడ్యూల్డు కులం గురించి 1950
తరువాత వచ్చిన ఆర్డర్ ప్రకారం సదరు వ్యక్తి ఆ కులం యొక్క ఆమోదం కూడా
పొందాలని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ వి.గోపాల్ గౌడ్ లతో కూడిన
సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది.
ఈ తీర్పును అనుసరించి
క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి కులం గుర్తింపు ఉండదు, అతనికి ఆ కులంతో
సంబంధం లేదు అని అర్థం. ఇంత స్పష్టంగా విషయాలు చెప్పబడి ఉంటే, రాజకీయ
నాయకులు దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని
చెప్పటం రాజ్యాంగాన్ని ధిక్కరించటం మరియు ప్రజలను మభ్యపెట్టడం అవుతుంది.