భారత భద్రతకు ముప్పు కలిగిస్తున్న మాల్దీవుల తిరుగుబాటు


భారతదేశానికి (లక్షద్వీప్ కు) సమీపంలో 29 కి.మీ. దూరంలో ఉన్న మాల్దీవులలో ఫిబ్రవరి 7 వ తేదీన రాజకీయ తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటులో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన అధ్యక్షులు 'మహ్మద్ నషీం' రాజీనామా చేయడం భారతదేశ భద్రతకు ఆందోళన కలిగిస్తున్న అంశం. వాస్తవానికి భారత దేశానికి మాల్దీవుల ప్రభుత్వం ప్రజాస్వామ్యపరంగా మంచి మిత్ర దేశం. కాగా ఇటీవల ఒక దశాబ్ది కాలంగా మాల్దీవులలో ఐ.ఎస్.ఐ. ప్రోద్బలంతో తీవ్రవాదం ఉగ్రరూపం దాలుస్తోంది. అలీ జలీల్ అనే మాల్దీవియన్ జాతీయుడు అల్ ఖైదా శిక్షణ పొంది 2009 మే 27న ఆత్మాహుతి దళం సభ్యుడిగా బాంబు దాడి చేసి మరణించాడు. దీనిపై విచారణ జరుపగా 9 మంది మాల్దీవుల యువకులు పాకిస్తాన్ లోని దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతంలో అల్ ఖైదా శిక్షణ పొందుతూ పట్టుబడ్డారు. అలాగే ఇటీవలి కాలంలో మాల్దీవుల యువకులు అల్ ఖైదా ఉగ్రవాద కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు వార్తలు, నివేదికలలో వెల్లడి అవుతున్నది.

మాల్దీవులలోని ప్రజాస్వామ్య ప్రభుత్వం భారత ప్రజాస్వామ్య ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండడం ఈ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు రుచించటం లేదు. అందువల్ల మాల్దీవులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షుడ్ని పదవీచ్యుతుడ్ని చేసి రాజకీయ అస్థిరత నెలకొల్పి తద్వారా ఇస్లామిక్ తీవ్రవాద సిద్ధాంతాలను వ్యాప్తి చేయాలని ఈ సంస్థల భావన. అందులో భాగంగానే రాజకీయ అస్థిరతకు ప్రణాళిక వేశారు. ఫిబ్రవరి 7వ తేదీన తిరుగుబాటు జరిగిన వెంటనే మాల్దీవుల అధ్యక్షులు చేసిన విజ్ఞప్తికి భారత ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. దాని కారణంగా మాల్దీవుల ప్రభుత్వం అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసుకునే తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇదే అవకాశంగా చైనా, అమెరికాలు జోక్యం చేసుకుని శాంతి సుస్థిరతకు దౌత్య వ్యవహారాలు నిర్వహిస్తున్నాయి. ఈ నెపంతో హిందూ మహా సముద్రంలో భారతదేశానికి అతి చేరువలో నిఘా పేరుతో వారి నౌకాదళ స్థావరాలు ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఇది భారతదేశ భద్రతకు అత్యంత ఆందోళన కలిగించే అంశం. గతంలో 1988 నవంబర్ 3న మాల్దీవులలో ఇదే తరహా తిరుగుబాటు జరిగినప్పుడు మనదేశం సకాలంలో స్పందించి సైనిక సహాయం అందించడంతో ఆ ప్రభుత్వం తిరుగుబాటును అణచివేయగలిగింది.

పాకిస్తాన్ ఇప్పటికే ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిత్, బాల్టిస్తాన్ లను చైనాకు ధారాదత్తం చేయటానికి ప్రయత్నిస్తున్నది. అలాగే అఖండభారత్ లో భాగమై, సంస్కృతీ, వారసత్వం, జాతిపరంగా అనేక వేల సంవత్సరాలుగా కలిసి ఉన్న నేపాల్ రాజకీయాలలో చైనా మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంది. గణతంత్ర రాజ్యంలో భాగమైన 'అరుణాచల్ ప్రదేశ్' సరిహద్దులలో సైతం చైనా కవ్వింపు చర్యలు చేస్తున్నది. శ్రీలంకతో సైతం మనదేశం సత్సంబంధాలను నిర్వహించలేక పోవడంతో అనేక విషయాలపై ఆ దేశం చైనా మరియు ఇతర ఐరోపా దేశాలపై ఆధారపడుతున్నది.

అదే అమెరికా, జపాన్, బ్రిటన్, రష్యా, చైనా దేశాలు వాటికి సమీపంలోని చిన్న దేశాలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో సఫలత సాధించాయి. ఎందుకంటే ఆయా దేశాల భద్రత తమ దేశాల భద్రతతో ముడిపడి ఉన్నదనే విషయాన్ని వాళ్ళు గుర్తించారు. 

వాస్తవానికి మాల్దీవులలోని ప్రజలు అత్యధికులు భారతీయ సంతతి వారు. వారు మాట్లాడే భాష 'దివేణి' భాష. ఇది భారతీయ భాషా కుటుంబానికి సంబంధించినది, సింహళ భాషను పోలి ఉంటుంది. క్రీ.శ.12వ శతాబ్దంలో ఇస్లాం ప్రవేశించే వరకు అక్కడి ప్రజలందరూ హిందువులు, బౌద్ధులు. 

ఈనాటికి కూడా యూరోపియన్ చరిత్ర కారులు మాల్దీవులను ప్రస్తావించ దలచుకున్నప్పుడు 'శ్రీలంకకు 700 కి.మీ. దూరంలో ఉంది' అని ప్రస్తావిస్తున్నారు. కాని భారతదేశంలోని 'లక్షద్వీప్'కు కేవలం 29 కి.మీ. దూరంలో ఉందనే విషయం ప్రస్తావించటం లేదు. చింతించవలసిన విషయం ఏమిటంటే భారతీయ చరిత్రకారులు కూడా ఆ దేశంతో మనకున్న భాష, చారిత్రిక, వారసత్వ, సాంస్కృతిక సంబంధాలను మరచి యూరోపియన్ చరిత్రకారులు పేర్కొన్న విధంగానే భారత పాఠ్య పుస్తకాలలో కూడా 'శ్రీలంకకు 700 కి.మీ. దూరంలో ఉంది' అనే ప్రస్తావిస్తున్నారు. ఇది భారతీయ మేధావుల భావ దాస్యానికి నిదర్శనం.

శతాబ్దాల విదేశీ పాలన మాల్దీవులను భారతీయుల నుండి విడగొట్టింది. ఇంతటి భాషా, సాంస్కృతిక, వారసత్వ సంబంధాలు కలిగి ఉండి కూడా భారతదేశం తన చుట్టుపట్ల ఉన్న చిన్న రాజ్యాలతో సత్సంబంధాలను నెలకొల్పలేకపోవడం నిజంగా దురదృష్టకరం. స్వాతంత్ర్యానంతరం సుదీర్ఘకాలం ప్రభుత్వం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీయే ఈ లోపభూయిష్టమైన విదేశాంగ విధానానికి బాధ్యత వహించాలి. 2004 తరువాత యు.పి.ఏ. ప్రభుత్వం మరీ ముఖ్యంగా శ్రీ ఎస్.ఎం.కృష్ణ విదేశాంగ శాఖ చేపట్టిన తరువాత అనేక అంశాలలో విదేశాంగ శాఖ మరీ ఘోరంగా విఫలమైంది. అందుకు తాజా దృష్టాంతమే  ఈ మాల్దీవుల సంఘటనలో భారత విదేశాంగ శాఖ వైఫల్యం.

- పతికి