రాజ్యపాలన అంటే కత్తిమీద సాము

(ధర్మరాజుకు భీష్ముని ధర్మ సూక్ష్మ బోధన)


నాయనా! రాజ్యపాలనం కత్తిమీద సాము వంటిది. నువ్వు క్షమాశీలంతో ఉంటే మావటివాడు మత్తేభం మీదికెక్కి అంకుశ ప్రహారం చేసినట్లు ప్రజలు ప్రభువు మీద పెత్తనం చేస్తారు. నువ్వు మరీ క్రూరంగా ఉంటే క్రూర మృగాన్ని హింసించినట్లు హింస పెడతారు. అందుచేత వసంత ఋతువులో సూర్యుని వలె చురుక్కుమనిపించి చల్లదనం ఇవ్వాలి. ఆ ఋతువులోఎండ చురుకు తగ్గితే మళ్ళీ వానలుండవు కదా! అదీ దాని తాత్పర్యం.

గర్భవతి అయిన స్త్రీ తన లోపలి బిడ్డ ఆరోగ్యం మనసులో ఉంచి, ఆహార విహారాలు సాగించేటట్లు ప్రభువు ప్రజల కష్ట సుఖాలు ఎరిగి చరించాలి. రాజ్యపాలనకూ, ధర్మ సాధనకూ అవశ్యమయిన అర్థాన్ని అతి చాకచక్యంతో ఆర్జించాలి. పులి తన పిల్లలను తిన్నట్లు ప్రజలను పన్నుల పేరిట ఒక్కసారి కబళించకూడదు. పశువు శరీరం మీద చేరిన జలగలా ఎప్పటికెంత అవసరమో అంతంత మాత్రమే గ్రహిస్తూ ఉండాలి. ఏమయినా సరే ప్రజాభిమానం కోల్పోకూడదు.

సేవక గణాన్ని వంచించకూడదు. ఆశ్రితులలో అమాత్యులలో నీ వారెవరో, విద్వేషులెవరో గ్రహించాలి. అన్నిటినీ మించినది స్వ - పర తత్వం. దాన్ని మనసులో ఉంచుకొని మన కర్తవ్యం మనం నిర్లిప్తంగా సాగించాలి. 

అని భీష్ముడు ధర్మరాజుకు అనేకానేక ధర్మ సూక్ష్మాలు బోధించాడు.