మతమార్పిడులు నిలువరించాలి...!

కలియుగాబ్ది 5116 , శ్రీ జయ నామ సంవత్సరం, మాఘమాసం


ఈ దేశంలో కొన్ని క్రైస్తవ సంస్థలు 2015 జనవరి 22న అమెరికా అధ్యక్షుడికి ఒక విజ్ఞాపన పంపించారు. దానిలో "భారతదేశంలో చోటుచేసుకుంటున్న పునరాగమన (ఘర్ వాపసీ) కార్యక్రమాలను నిలువరించేందుకు ఒబామా భారత ప్రధానితో మాట్లాడాలని, ఘర్ వాపసీ కార్యకలాపాలను ఆపాలని, ముస్లిం-క్రైస్తవులపై దాడులు ఆపాల"ని కోరారు. ఒబామా భారత పర్యటనలో మతస్వేచ్ఛ, పరమత సహనంపై మాట్లాడిన మాటలకు రాజకీయనాయకులు మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను సంధించారు. మతస్వేచ్ఛ, మతసహనానికి సంబంధించిన అంశాలను ఒబామా ప్రధాని మోదీతో చర్చలు జరిపినప్పుడు కాని, ఉమ్మడి ప్రకటనలో కాని చెప్పలేదు. ఇతర కార్యక్రమాలలో మాట్లాడేటప్పుడు మాట్లాడారు. దీనిని ఏదో విశేషంగా చూపించే ప్రయత్నం క్రైస్తవులు, రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఈ దేశంలోని క్రైస్తవులు ఒబామాను తమ రక్షకుడిగా భావిస్తున్నట్లుగా ఉంది. భారతదేశ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకొని మాట్లాడాలని కోరటం ఒక విపరీత ధోరణి. రాజకీయ నాయకులు తాము సెక్యులరిస్టులం, మైనార్టీల సంరక్షకులం అని గుర్తింపు పొందేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానిలో భాగమే అలా మాట్లాడటం. 

భారతదేశంలోని ఇస్లాం, క్రైస్తవాలలో ఉన్న పరమత అసహనమే భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. భారతదేశంలో మత ఘర్షణలకు, మతమార్పిడులకు ఎవరు పాల్పడుతున్నారో అందరికీ తెలుసు. మతంమార్పిడుల కారణంగా దేశంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. జనాభా నిష్పత్తులలో తేడాలు కనబడుతున్నాయి. మామూలు వృద్ధిరేటు కంటే ఇస్లాం, క్రైస్తవ జనాభా పెరుగుతున్నది. హిందువుల జనాభా తరుగుతున్నది. 

2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లిం జనాభా పెరుగుదల 24% గా ఉంది. సాధారణ దేశ జనాభివృద్ధి శాతం 18%గా ఉంటే ముస్లిం జనాభా దానికంటే 6% ఎక్కువగా ఉంది. మరోప్రక్క హిందువుల జనాభా తగ్గింది. ఇది ఒక ప్రమాదఘంటిక. ఇంత జరుగుతుంటే హిందువులు ముస్లిం-క్రైస్తవులను మతమార్పిడి చేస్తున్నారని దేశంలో, విదేశాలలో గొంతుచించుకొని అరుస్తున్నారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో సర్వసాధారణ వ్యక్తిలో ఉన్న పరమత సహనం, అన్ని మతాలను గౌరవించే సంస్కారము, ఈ దేశంలో శాంతియుత వాతావరణానికి కారణం. ఈ విషయాన్ని ఇక్కడి మేధావులు గుర్తించాలి. ఈ దేశంలో మతమార్పిడులను నిలువరించినప్పుడే దేశంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఈ విషయం అందరం గమనించాలి. అమెరికా అధ్యక్షుడు ఈ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తమకు రక్షణ కల్పించేందుకు మాట్లాడాలని అనడం ఒక ఎత్తుగడ కావచ్చు. ఎందుకంటే ఇతరదేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం అంటే ఆ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమే.