రంజాన్ ఉపవాసాలను గౌరవించకపోతే బహిష్కరణే

సౌదీ మంత్రి హెచ్చరిక
 

రియాద్ : 'రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు పాటించే ఉపవాసాలను ముస్లిమేతరులంతా గౌరవించాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం పాటించాలి. లేని పక్షంలో బహిష్కారానికి గురి కావాల్సి ఉంటుంది' అని సౌదీ అరేబియా పాలకులు హెచ్చరించారు. రంజాన్ మాసం ప్రారంభం రోజు శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల సందర్భంగా సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. "ముస్లిం భావాలను పరిగణనలోకి తీసుకోవాలి. పవిత్రమైన ఇస్లాం సంప్రదాయాలు రక్షించాలి" అని పేర్కొంది. వీటిని ఉల్లంఘిస్తే, వర్క్స్ కాంట్రాక్టులను రద్దు చేసి బహిష్కరిస్తామని హెచ్చరించింది. 

సౌదీ అరేబియా జనాభా 27 మిలియన్లు (2.7 కోట్లు). ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇందులో 80 లక్షల మంది విదేశీయులు కాగా ఆసియా, అరబ్, పశ్చిమ దేశాలకు చెందిన వారు ఉన్నారు. సౌదీ అరేబియా ప్రతి ఏటా ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తూంటుంది. ఇస్లాం పవిత్ర దేశంగా ముస్లింలలోని సున్నీల రాజ్యంగా వెలుగొందుతూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఓ వైపు పాశ్చాత్య పోకడలు పెరిగిపోతున్నప్పటికీ ఇస్లాం మత సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణమైన విధానాలు అవలంబిస్తూ పరోక్షంగా ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటోంది.

సౌదీ అరేబియా పాలకులు ఇటీవల ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. ఒలంపిక్స్ కు ప్రప్రథమంగా మహిళా అథ్లెట్లను  పంపాలని నిర్ణయం తీసుకుంది. అలాగే 2015 నాటికి మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు ఓటు హక్కు, స్థానిక సంస్థల పాలనలో భాగస్వామ్యం కల్పిస్తామని సౌదీ రాజు అబ్దుల్లా హామీ నిచ్చారు. ఈ నేపథ్యంలో ముస్లిమేతరులను హెచ్చరించటం ఎట్లా అర్థం చేసుకోవాలి?