సంక్రాంతి - రథసప్తమి

 
జనవరి మాసంలో రెండు ముఖ్యమైన పండుగలు వస్తాయి.  భారతీయ ఖగోళ విజ్ఞానంతో ఇవి సంబంధం కల్గి ఉన్నాయి.  
 
మొదటిది సంక్రాంతి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకృతిలో మార్పు వస్తుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. సంవత్సరంలో 12నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు. మకరరాశిలో ప్రవేశించడంతో దీనిని మకర సంక్రమణం అంటారు. సంక్రమణం అంటే ప్రవేశించుట అని అర్థం. సంక్రాంతి నుండి పగటికాలం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. భారతయుద్ధంలో నేలకొరిగిన భీష్ముడు అంపశయ్యపై పరుండి ఉత్తరాయణం వరకు తన ప్రాణాన్ని నిలుపుకుని తరువాత దేహం విడిచాడు. పగటికాలం ఎక్కువవడంతో పనిచేసే కాలం ఎక్కువవుతుంది. ఇది కర్మణ్యతను గుర్తు చేస్తుంది. దేశంలో హిందుత్వ సంక్రమణం జరగాలని ఆర్.ఎస్.ఎస్. భావిస్తుంది. 
 
క్రాంతి అంటే మార్పు. సమ్యక్ క్రాంతి అంటే సరియైన మార్పు. మార్పును వ్యక్తిలో, వ్యవస్థలో తీసుకురావాలని సంఘం భావిస్తుంది. ఈ మార్పు హిందుత్వ ఛాయలో జరగాలన్నది సంఘ సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ ఆకాంక్ష. ఈ దేశంలో బుద్ధుడి నుండి నేతాజీ వరకు అందరూ హిందూసమాజంలో మార్పును కోరుకున్నవారే. 'హిందూ' అంటే అది ఓ జీవన విధానమని, మతం కాదని అర్థం చేసుకోవాలి. ఈ జాతీయజీవన విధానంలో ఎన్నో మతాలున్నాయి. ఈ మధ్య పార్లమెంటులో 'మతంమార్పిడుల'పై జరిగిన చర్చలో 'హిందు' పదం గురించి చాలా చర్చ జరిగింది. 
 
 
బిబిసికి చెందిన మార్క్ టోరీ భారత్ మీద ప్రేమతో ఇక్కడ ఉండిపోయాడు. 'నేను క్రైస్తవుడినైనందుకు గర్విస్తాను' అన్నాడాయన. ఈ దేశంలో కొందరు కుహనా మేధావులు 'హిందువునని చెప్పుకోవడానికి ఎందుకు సంకోచిస్తారో' తనకర్థం కాదంటాడాయన. వ్యక్తి సమాజంతోనూ, ప్రకృతితోనూ సమరసమై జీవించాలనే సూత్రం ఆధారంగా మనం మానవాళి భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను ఉన్నతిని సాధించగలదని చెప్తాం. ఈ తరహా సాంఘిక వ్యవస్థలో స్వయంసమృద్ధమైన గ్రామాలు ముఖ్యమైనవి. అందుకే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రారంభించిన 'సంసద్ ఆదర్శ గ్రామ యోజన' ఈ దిశలో ప్రారంభించిన ఒక మంచి కార్యక్రమం.  
 
రెండవది రథసప్తమి. మకరరాశిలో ప్రవేశించిన సూర్యుడు సంక్రాంతి మొదలు ఉత్తరాయణంలో ప్రయాణిస్తూ ఏడు గుర్రాల రథాన్నెక్కి ఈశాన్యదిశగా వెళ్తుంటాడు. సంక్రాంతి తరువాత వచ్చే మాఘమాసంలో మాఘశుద్ధ సప్తమి వస్తుంది. అదే రథసప్తమి. దీన్నే సూర్యజయంతి అంటారు. సూర్యుడికి దండం పెడతారు. సూర్యుడు నమస్కారప్రియుడు. సూర్యుడి రథానికున్న ఏడు గుర్రాలు, వారంలో ఏడు రోజులను సూచిస్తాయి. రథసప్తమినాడు ఆదిత్యహృదయం చదువుకుంటారు. రామాయణంలో మహాబలవంతుడైన రావణుడిని జయించడానికి అగస్త్యమహాముని రాముడికి దీనిని బోధించాడు. కులం, మతం, ప్రాంతం, దేశం, భాషాభేదాల్లేకుండా అందరికీ సూర్యుడు వెలుగునిస్తాడు. సూర్యుడికి మిత్రుడు, రవి, సూర్యుడు, భానుడు, ఖగుడు, పూష్ణుడు, హిరణ్యగర్భుడు, మరీచుడు, ఆదిత్యుడు, సవిత్రుడు, అర్కుడు, భాస్కరుడు, సవిత్ర సూర్యనారాయణుడు అని 13 పేర్లున్నాయి. ఈ పదమూడు పేర్లతో పదమూడు సూర్యనమస్కారాలు ఉన్నాయి. సూర్యనమస్కారాల్లో అనేక ఆసనాలున్నాయి. సూర్యనమస్కారాలు చేస్తే మంచి శారీరిక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. సూర్యుడి నుంచి వచ్చే 'డి' విటమిన్ ఎముకల్ని గట్టిపరుస్తుంది, 'ఇ' విటమిన్ వల్ల నేత్రవ్యాధులు దూరమవుతాయి. సూర్యనమస్కారాల వల్ల 97శాతం కండరాలలో కదలిక వస్తుంది. దేశవిదేశాల్లో సూర్యనమస్కారాల వల్ల ఆరోగ్యంపై చూపే ప్రభావం మీద పరిశోధనలు జరిగాయి. సూర్యశక్తి మనకున్న సహజవనరుల్లో అతి పెద్దది. సౌరశక్తి ఆధారంగా ఇకముందు వ్యాపారం, వ్యవసాయం ఎక్కువగా జరిగే అవకాశముంది. చీకటిని చీలుస్తూ, ఉదయమే లోకాన్ని నిద్రలేపుతూ ప్రపంచాన్ని కాంతివంతం చేసే సూర్యుడికన్నా గొప్ప క్రాంతికారుడింకెవరుంటారు? సూర్యకాంతి అధికంగా కల్గిన జిల్లేడు చెట్టు మూలికలను ఔషధాలుగా వాడి 52 రకాల రోగాలను నయం చేస్తారు. జ్యోతిష్యపరంగా సూర్యుడిబలం ఎక్కువగా ఉండాలంటారు. రవిబలం పెరిగేందుకు 'కెంపు' ధరింపచేస్తారు. రవిస్థానం 'రాజు'. రవి బలం పెరిగేందుకు సూర్యారాధన ఏకైక మార్గం.

- హనుమత్ ప్రసాద్