అట్టడుగు వర్గాలకు విద్యనందివ్వాలి

వివేక సూర్యోదయం - ధారావాహికం - 15

వివేకానంద స్వామి వ్రాసిన లేఖల నుండి
 

గౌరవనీయులైన మైసూరు మహారాజావారికి,
నారాయణుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక !

మీ విశేషమైన సహాయ సహకారాలతో నేనిక్కడికి చేరాను. అప్పటి నుంచీ అందరికీ సుపరిచితుణ్ణయ్యాను. ఇక్కడి ప్రజలంతా చక్కని ఆదరాభిమానాలతో కావల్సినవన్నీ అందిస్తున్నారు. ఇదొక గొప్పదేశం. ఇది అనేక విషయాల్లో చూశాను. రోజువారి పనుల్లో ఇక్కడి ప్రజలకున్న యంత్రాలను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ప్రతిదీ యంత్రంతో కూడినదే. కాని వీళ్ల జనాభా ప్రపపంచ జనాభాలో 1/20 వంతు మాత్రమే. అయినా ప్రపంచ సంపదలో 1/6వ వంతు భాగం వీరిదే. వారి సంపదకు, విలాసాలకు అంతులేదు. అయినా అంత ప్రియంగానే ఉంటాయి. కారి్మకుల జీతభత్యాలు ప్రపంచంలో అందరికంటె ఇక్కడ ఎక్కువ. అయినా కార్మికుడికి యజమానికి సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అమెరికాలో మహిళల కున్న సౌకర్యాలు భూమ్మీద ఎవరికీ లేవు. క్రమంగా వారంతటా రాణిస్తున్నారు. సంస్కారం ఉన్న మగవారికంటె ఆడవారే ఎక్కువ. తెలివిలో మగవాళ్లే ఆధిక్యం కలిగి ఉన్నారు. 

మనల్ని కులం గురించి దూషించే ఈ పాశ్చాత్యులు డబ్బుతో ఏమైనా చేయగలరు. ప్రపంచంలో ఎవరికీ లేనన్ని న్యాయసూత్రాలు వీరికున్నాయి. మన పేద హిందువులు వీరికంటె నితినియమం కల్గినవారు. మతం విషయంలో వారు ఉన్మాదులు. అభూత కల్పనలతో కూడిన వారి మతం పట్ల విసుగెత్తి చాలామంది భారత్ వైపు చూస్తున్నారు. కొంత కాంతిని వెతుక్కుంటున్నారు. మన వేదాలు ఆధునిక విజ్ఙానానికి ఎదురొడ్డి నిలిచిన వైనం వారు ఒక గొప్ప ఆలోచనగా గ్రహించడం వింటే మీరు ఆశ్చర్యపోతారు.  స్వర్గం, నరకాల గురించిన వాదనలు వినీ వినీ చదువుకున్న వాళ్లంతా విసిగిపోయారు. వేదాల్లోని సృష్టి శాశ్వతత్వము, ఆత్మ శాశ్వతత్వము, ప్రతి ఒక్కరి ఆత్మలో భగవంతుడున్నాడన్న సత్యము వారిని స్పందింపచేస్తోంది. 50 ఏళ్లలో వీరంతా ఈ ఆత్మ తత్వం వైపు మ్రొగ్గుతారు. సృష్టి గొప్పతనం అర్థం చేసుకుంటారు. వారి మత గురువులు ఇప్పటికే బైబిలును ఆ విధంగా వ్యాఖ్యానించటం మొదలుపెట్టారు. నాకనిపించేదేంటంటే వారికి ఆధ్యాత్మిక నాగరికత ఎక్కువ అబ్బాలి, మనం భౌతిక విజ్ఞానం గురించి ఎక్కువ తెలుసుకోవాలి. 

భారత్ లో అన్నింటికీ కారణం పేదరికం. పాశ్చాత్య దేశంలో బీదవాళ్లు భూతాలతో సమానం. మనదేశంలో వారిక దేవతలే. కనుక వీరినుద్ధరించటం చాలా తేలిక. మన అట్టడుగు వర్గాల ప్రజలకు విద్యనవ్వాలి. కోల్పోయిన వారి వ్యక్తిత్వాన్నివ్వాలి. మన ప్రజలకు, రాజులకు ఇదొక మహత్తర బాధ్యత. ఈ దిశలో ఇంతవరకు మనం చేసిందేం లేదు. మతాధిపత్యం, పరాయి పాలన మన ప్రజలను బానిసలు చేసి వారు మానవులని మరచిపోయేలా చేశాయి. వారికిపుడు మనం కొత్త ఆలోచనలివ్వాలి. అప్పడు వారి స్వేచ్ఛ గురించి, అభివృద్ధి గురించి వారు ఆలోచించడం మొదలుపెడతారు.

- హనుమత్ ప్రసాద్