యదార్థంగా జరిగిన సంఘటన
కొన్నేళ్ళ
క్రితం ఒకరోజు, ఇంటర్లో మా క్లాస్ మేట్ అయిన ఓ అమ్మాయి నుండి ఫోన్
వచ్చింది. తను ఇంటర్ తర్వాత తెనాలిలోని ఓ ప్రముఖ క్రిస్టియన్ కాలేజిలో
డిగ్రీ చేసి, ప్రస్తుతం హైదరాబాద్ లోనే పి.జి.చేస్తున్నట్లు చెప్పి, వీలైతే
ఓ వీకెండ్ లో మీటవుదామని అడిగింది. ఇంటర్ తరువాత ఎప్పుడూ పలకరించని
అమ్మాయి ఇప్పుడెందుకు పలకరించిందో అని ఆశ్చర్యపోయాను. కాస్తం ఆనందం కూడా
వేసింది. వెంటనే ఆ నెక్స్ట్ వీకెండ్ కే క్రిష్ణకాంత్ పార్కు దగ్గర
మీటవుదామని చెప్పాను.
ఇంటర్ తర్వాత అదే మొదటిసారి తనను చూడటం. తను చాలా
మారిపోయి ఉంది. ముఖాన బొట్టు, కమ్మలు లాంటి అలంకరణలేవీ లేకుండా, బాగా ఏడ్చి
ముఖం ఉబ్బిపోయినట్లు చాలా డల్ గా ఉండటంతో ఏదో ప్రాబ్లెమ్ లో ఉందనుకుని
'విషయం ఏంట'ని అడిగాను. అలాంటివేమీ లేవని, ఒకప్పుడు చాలా బాధల్లో
ఉండేదాన్ననీ, కానీ జీసస్ ని నమ్మడం మొదలుపెట్టినప్పటి నుండి చాలా హ్యాపీగా
ఉంటున్నట్లు చెప్పింది. తాను బ్యాప్టిజం స్వీకరించానని, పెళ్ళిలాంటి
ఆలోచనలేవీ లేవనీ, నన్ గా మారి జనాలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాననీ, ఈ
విషయంపై ఇంట్లో గొడవపడి బయటికి వచ్చేశానని, ప్రస్తుతం మిషనరీవారే తనను
చదివిస్తున్నారనీ చెప్పింది.
పైగా జీసస్ ను నమ్మటం వల్ల కలిగే
ప్రయోజనాలేమిటో వివరిస్తూ అనేక ఉదాహరణలు ఇవ్వడం మొదలుపెట్టింది. తమ
హాస్టల్లో ఎవరో అమ్మాయికి ఏదో జబ్బు నయమైనట్లు, ఇంకొకరెవరికో బాప్టిజం
తీసుకున్న మర్నాడే ఉద్యోగం వచ్చినట్లు... ఇలా అనర్గళంగా చెప్పుకొంటూ
పోసాగింది. తను ఎందుకు కలుద్దామందో అప్పటికి కానీ అర్థం కాలేదు నాకు.
కాసేపటికి
తను వెంట తెచ్చుకున్న బట్ట సంచిలో నుండి ఓ బైబిల్ తీసి దానిలో ఎన్ని
అద్భుత విషయాలున్నాయో చెప్పడం మొదలుపెట్టింది. అసలు బైబిల్లో లేని విషయమంటూ
లేదని, దావీదు, ఇజ్రాయేలు, బెత్లహాము, రక్తంతో పాపాల్ని కడగటం ఇలా ఏదేదో
చెప్పుకుంటూ పోసాగింది. ఆమె చెప్పేవన్నీ సైలెంటుగా వింటూ కూర్చున్నాను. నా
మౌనాన్ని అంగీకారంగా భావించి, ఆమె ఓ రకమైన ట్రాన్స్ లోకి వెశ్ళిపోయి ఇతర
మతాలనేవి ఎంత బూటకమో వివరిస్తూ, దేవుడు క్రీస్తురూపంలో ఎలా మానవుడిగా
భూమిమీద నడిచాడో, డాక్టర్ కాకపోయినప్పటికి రోగులకు ఎలా స్వచ్ఛత చేకూర్చాడో
చెప్పుకుంటూ పోయింది.
అలా సుమారు ఓ అరగంట తర్వాత 'చెప్పు ఇప్పటికైనా
నమ్ముతావా? లేదా?' అని అడిగింది. 'ఇంత చెప్పింతర్వాత ఇంకా నమ్మకుండా ఎలా
ఉంటాను, నేను కూడా మతం మారతాను, పేరు కూడా మార్చుకుంటాను. ఏ పేరైతే
బాగుంటుంది? 'జానీ' (అప్పట్లో మనం పవన్ కల్యాణ్ ఫ్యాన్..!) అనేది
క్రిస్టియన్ పేరేనా..? మహ్మద్ జానీ అని ఎవరో ముస్లిం లీడర్ ఉన్నాడు కదా,
ఇంకేదైనా పేరు చెప్పు' అన్నాను.
అప్పుడు ఆమె ముఖంలో వెయ్యివోల్టుల
వెలుగు నాకిప్పటికి గుర్తే. 'థాంక్స్, నాకు తెలుసు, నువ్వు మారతావని.
'డేవిడ్ జాన్' అని పెట్టుకో, చాలామంచి పేరు' అంది. 'రేపే నిన్ను చర్చి
ఫాదర్ దగ్గరికి తీసుకెళ్తా'నంది.
'సరే! అలాగే వెళ్దాం. కాని, నాదో చిన్న
కండిషన్' అన్నాను. 'ఏంటో చెప్పు' అంది. ఇప్పుడు నువ్వు పి.జి.
చేస్తున్నావు కదా, ఆ పి.జి. నువ్వు ఫస్టుక్లాసులో పాసవ్వాలి, అప్పుడే నేను
మతం మారతాను' అన్నాను. 'ఓస్! ఇంతేనా! సరే నేను తప్పకుండా పాసై రిజల్ట్స్
రాగానే నిన్ను కలుస్తా, సరేనా? అప్పటిదాకా ఈ బైబిల్ నీ దగ్గరే ఉంచుకో, ఇది
చదువుతుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది' అంది.
'సరే, కాకపోతే బైబిల్ నీ
దగ్గరే ఉంచుకో, నీ మిగతా పి.జి. బుక్స్ అన్నీ తెచ్చి నాకివ్వు' అన్నాను.
'అదేంటి, బుక్స్ చదవకుండా పాస్ కావడం ఎలా?' అయోమయంగా అడిగింది. 'బైబిల్లో
అన్ని విషయాలు ఉన్నాయన్నావు కదా, మరి అది చదివి పి.జి. పాస్ కాలేవా?
అన్నాను. 'ప్చ్.. అన్నీ అంటే, సబ్జెక్ట్ విషయాలని కాదు' అంది. 'మరి ఎలాంటి
విషయాలుంటాయ్' అని అడిగాను. 'అంటే జీసస్ ఎలా పుట్టాడు, ప్రజల్ని ఎలా సేవ్
చేశాడు, జీసస్ ని ఎలా శిలువ వేశారు లాంటవి' అంది. 'ఓ! అవన్నీ నేను ఆల్రెడీ
"కరుణామయుడు" సినిమాలో చూసేశాను' అన్నాను. 'అవే కాదు, ఇంకా బానిసల్ని ఎలా
చూడాలి, వారి రైట్స్ ఏముంటాయి లాంటివన్నీ ఉంటాయి' అంది. 'నేను ఎవరికీ
బానిసను కాదు, నా కిందెవరూ బానిసలు లేరు, నేనవి తెలుసుకోవడం అవసరమా?'
అన్నాను. 'ప్చ్.. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావ్' అంది.
- మిగతా వచ్చే సంచికలో...
- అయ్యల సోమయాజుల...