కాశ్మీర్ లో ఐ.ఎస్.ఐ.ఎస్.

 
సున్నీ జిహాదీశక్తి ISIS. ఇరాక్ లో ప్రారంభమై సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించాలనుకుంటున్నది. అంతకుముందు గూగుల్ లో ఉద్యోగం చేసిన మునావద్ సాల్మన్ ను ISIS తమవైపు ఆకర్షించింది. సౌదీ అరేబియాలో ఉద్యోగం ఆశ చూపింది.
 
ఇరాక్ లో తమ సోషల్ మీడియా విభాగంలో చేర్చుకోవాలనుకుంది. మునావత్ సాల్మన్ హైద్రాబాద్ కు చెందినవాడు. తమిళనాడుకు చెందిన షాజా ఫక్రుద్దీన్ కూడా ఇదే ఫక్కీలో సింగపూర్ వెళ్ళాడు. సాల్మన్ ను పోలీసులు సౌదీ వెళ్ళకముందే అరెస్టు చేశారు. భారత్ లో గ్లోబల్ ఇస్లామిక్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నమిది. అల్ ఖైదా కూడా ఇలానే తమకోసం పనిచేసే యువకుల కోసం ఎర వేస్తున్నది. కేంద్రనిఘావర్గాల కథనం ప్రకారం ISIS, అల్ ఖైదా రెండూ హైద్రాబాద్ కేంద్రంగా భారత్ లో ఓ విభాగం ఏర్పాటుకు పనిచేస్తున్నాయి. హైద్రాబాద్ కు చెందిన మరో 15 మంది యువతీయువకులు కోల్ కతా నుండి బంగ్లాదేశ్ కు పోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. వీరుకూడా ISISలో చేరేందుకు బయలుదేరినవారే ! 
 
జూలై 19, 2014నాడు జమ్మూకాశ్మీరులో ముసుగు ధరించిన కొందరు ISIS జెండాలు ఎగురవేస్తూ కనబడ్డారు. దాంతో భద్రతావర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆ జెండాలపై ఇస్లాం సూక్తులు రాయబడి ఉన్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఆ జెండాలతో నిరసన తెలుపడం జరిగిందని అభిజ్ఞవర్గాల భోగట్టా. అదీ ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా జరగడంతో సామాన్య ముస్లింలు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా, పాలస్తీనా అనుకూల నినాదాలు చేశారు. ఈ జెండా ప్రదర్శనకు ముందు హురియత్ నాయకుడు సయ్యద్ అలీషా జిలానీ గాజాపై దాడులకు నిరసనగా ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చాడు. ముసుగులు ధరించిన యువకులు భద్రతా బలగాలపై రాళ్ళు రువ్వారు. పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాద ముఠాలు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటివి ఇప్పటికే కాశ్మీర్ లో పనిచేస్తున్నాయి. ఇప్పుడు ISIS, అల్ ఖైదాలు కూడా తోడయ్యాయి. 
 
ఖలీఫాగా అల్లా తన తరువాత ఎవరిని నియమించారనే విషయంలో ముస్లింలలో అనేక విభేదాలున్నాయి. ISIS అబు బకర్ ను ఖలీఫాగా ఒప్పుకొంటోంది. ముస్లింల మధ్య ఉన్న అంత:కలహాలకు భారత్ కు సంబంధం లేదు. వారి సిద్ధాంతానికి, కాశ్మీరులో బలప్రదర్శనలు జరపడానికి సంబంధం లేదు. కాని ఆ పేరున భారత్ లో తీవ్రవాదం రూపంలో భయోత్పాతం సృష్టించేందుకు ISIS ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఉన్న కొందరు వేర్పాటువాద, జిహాదీ శక్తుల సహకారంతో అస్థిరత సృష్టించాలని ప్రయత్నిస్తోంది. అంతకుముందు కాశ్మీరీ యువకులను తమతో కలుపుకునేందుకు పథకం వేసింది. ISISకు స్వాగతం పలుకుతూ చాలాచోట్ల కాశ్మీరీ యువత బ్యానర్లు ప్రదర్శించారు. ఇంత జరిగినా కాశ్మీరు ముఖ్యమంత్రి వొమర్ అబ్దుల్లా 'ఈ సంఘటన ఓ పిచ్చివాళ్ళ చేష్ట' అని అభివర్ణిస్తున్నారు. 
 
గత 3 నెలల్లో ఇలాంటి సంఘటనలు 3,4 సార్లు జరిగాయి. బిజెపి నాయకుడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కాశ్మీరులో మార్షల్ లా అమలును ఏడాదిపాటు చేయాలని కోరారు. దక్షిణాసియాలో ISIS విస్తరించగలిగిన బలం, బలగం లేదని కొందరు మేధావులు కొట్టిపారేస్తున్నారు. కాని కాశ్మీరీ యువత ఇంటర్ నెట్ ద్వారా ఇళ్లల్లోనే రెచ్చగొట్టబడుతున్నారని, సోషల్ మీడియా ద్వారా ISISకు చేరువవుతున్నారని కొందరు వాదిస్తున్నారు. 
 
భారత నిఘావర్గాల కథనం ప్రకారం ఇప్పటికే 20మంది యువకులు ISISలో చేరారంటున్నారు. కాశ్మీర్ లో సైన్యాన్ని వెనక్కు పంపమని, విశేషాధికారాల చట్టాన్ని నిషేధించమని కొన్నేళ్ళక్రితం కాశ్మీరీలు డిమాండ్ చేశారు. కాని మొన్నీమధ్య వచ్చిన కాశ్మీరు వరదల్లో సైన్యం ఎంతోమందిని రక్షించింది. ఎంతోమందికి చేయూతనిచ్చింది. ప్రధానమంత్రి మోదీకూడా కాశ్మీరుకు సహాయం ప్రకటించారు. అన్నివిధాల ఆదుకుంటామన్నారు. యు.ఎన్.జి.సి.లో మాట్లాడుతూ కూడా మోదీ ఈ విషయం ప్రకటించారు. అల్ ఖైదాలో సరియైన స్థానం, గౌరవం లభించని కొందరు ISIS జెండా పట్టుకొనేందుకు ఉత్సాహపడుతున్నారనేది మరో నిగూఢ రహస్యం. 
 
అయ్ మెన్ -అల్-జవహరి అల్ ఖైదా నాయకుడు. సెప్టెంబరులో భారత్ లో అనుబంద విభాగం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీనిపై రాయిటర్ సంస్థ ప్రతినిధితో మోదీ 'అల్ ఖైదా ఎలా చెబితే అలా వంతపాడేందుకు భారత ముస్లింలు సిద్ధంగా లేరని, వారు భారత్ కోసమే జీవిస్తారని, భారత్ కోసమే మరణిస్తార'ని అన్నారు. కాని భారత ముస్లింలపట్ల దేశప్రధాని మోదీ ఉంచిన నమ్మకం వమ్ము కాకుండా ముస్లిం నేతలు జాగ్రత్త వహిస్తారా? తమ యువత పెడదారి పట్టకుండా కాపాడుకుంటారా? అనేది జాతి జన సమాధానం కోసం వెతుక్కోవలసిన ప్రశ్న. భారత నిఘావర్గాలు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి కాశ్మీరుకు పట్టబోతున్న మరో భూతం భరతం పట్టేందుకు నడుం కట్టాలి.
 
- హనుమత్ ప్రసాద్