మదర్ థెరిస్సాను శ్రీ మోహన్ భాగవత్ ఏమన్నారు?

కలియుగాబ్ది 5116 , శ్రీ జయ నామ సంవత్సరం, ఫాల్గుణమాసం

దేశంలో మతతత్వ శక్తులకు అండగా ఉంటూ జాతీయ శక్తులపై నిరంతరం దాడి చేయడం లక్ష్యంగా మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని, హిందూత్వ శక్తులను విమర్శించడం, రంధ్రాన్వేషణ చేయ్యటమే వారిపనిగా కనబడుతున్నది. గడిచిన ఐదు, ఆరు నెలలుగా ఒక విషయం తరువాత మరొకటి ప్రతికలలోకి ఎక్కిస్తూ జాతీయ శక్తులపై తమ అక్కసును వెళ్లగ్రక్కే ప్రయత్నం చేస్తున్నారు. అదే తమ వృత్తిగా పెట్టుకొన్నట్లుగా ఉంది. మొత్తం మీద హిందుత్వం, సంఘం గురించి నిరంతరం పత్రికలలో ఉండేటట్లుగా జాగ్రత్తలు కూడా తీసుకొంటున్నట్లుగా ఉంది. 

మొన్నటివరకు "ఘర్ వాపసీ" కార్యక్రమాలను విమర్శిస్తూ దేశవిదేశాలలో ప్రజలకు, మేధావులకు తప్పుడు సంకేతాలను పంపించారు, పంపిస్తున్నారు. ఇప్పుడు మదర్ థెరిస్సాను సరసంఘ్ చాలక్ శ్రీ మోహన్ భాగవత్ విమర్శించారని రోడ్డెక్కారు. వాస్తవంగా సరసంఘచాలక్ గారు ఏమన్నారు? ఎందుకన్నారు? అనే వాస్తవాలను వెలుగులోకి రాకుండా చూడాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. మదర్ థెరిస్సా గురించి శ్రీ మోహన్ భాగవత్ ఏ సందర్భంలో ఏం మాట్లాడారో కొద్దిగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. 

రాజస్థాన్ లోని భరత్ పూర్ వద్ద 'నిరంతర ఉచిత వైద్యశిబిరం' ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ మోహన్ భాగవత్, మాజీ బి.ఎస్.ఎఫ్. డి.జి. ప్రకాశ్ సింగ్ పాల్గొన్నారు. ఆ కార్య్రకమంలో శ్రీ ప్రకాశ్ సింగ్ తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. వారు ఈశాన్య రాష్ట్రాలలో పనిచేస్తున్న రోజులలో సేవ పేరుతో మతమార్పిడులను చేయడం చూశానని, ఉదాహరణగా మదర్ థెరిస్సా పేరును ప్రస్తావించారు. ఆ తదుపరి శ్రీ మోహన్ భాగవత్ మాట్లాడుతూ - "సేవ నిస్వార్థంగా ఉండాలి, దాని నుండి ఏమి ఆశించకుండా పనిచేయాలి, సేవ సమాజహితం కావాలి. మదర్ థెరిస్సా సేవలు గొప్పవి, ఆమె లక్ష్యం మతం మార్చడం కావచ్చు. కాని మనం నిస్వార్థంగా ఏమి ఆశించకుండా పనిచేయాలి" అని అన్నారు.

ఇదికాక ఇంకేవిధమైన వ్యాఖ్యలు శ్రీ భాగవత్ చేయలేదు. దీనిని వక్రీకరించి శ్రీ మోహన్ భాగవత్ 'మదర్ థెరిస్సా మతమార్పిడుల కోసమే సేవ చేశారని' అన్నారని ప్రతికలలో ఎక్కించారు. ఇటువంటి వ్రకీకరించబడిన వార్తల విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి.