నరరూప రాక్షసులు పాక్ సైనికులు

లాన్స్ నాయక్ హేమరాజ్, లాన్స్ నాయక్ సుధాకర్ సింగ్

పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు తెగబడింది. అదనుచూసి దొంగదెబ్బ తీసింది. ఊహించడానికి వీలుకాని రీతిలో అత్యంత పాశవిక చర్యకు ఒడిగట్టింది. జనవరి 8వ తేదీన సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతల్లో నిమగ్నమైన ఇద్దరు భారత జవాన్లను అత్యంత కిరాతకంగా హత్య చేయించింది. పాకిస్తాన్ ముష్కర సైనికులు అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి, మనదేశ సరిహద్దుల్లోకి జొరబడి హేమరాజ్, సుధాకర్ సింగ్ అనే ఇద్దరు జవాన్ల తలలు నరికారు. ఒక జవాను తలను తమవెంట తీసుకెళ్లారు. ఈ సంఘటనతో భారతజాతి యావత్తూ నిశ్చేష్ఠురాలైంది. అంతేకాదు, సరిహద్దుల్లో కొద్దిరోజులపాటు నిత్యం కాల్పులకు తెగబడింది.

నిద్రమత్తులో సర్కారు 

భారత ప్రభుత్వం మాత్రం ఇంతటి ఘోర పరిణామాలపై స్పందించేందుకు మీనమేషాలు లెక్కించింది. జవాన్లు హత్యకు గురై, సరిహద్దుల్లో తరచూ కాల్పుల ఘటనలు చోటుచేసుకున్న దాదాపు రెండు వారాల తరువాత తాపీగా స్పందించింది. అదీ స్వదేశంలో విపక్షాలు, సామాన్య పౌరులు, ప్రజా సంఘాల నుంచి పెల్లుబికిన నిరసనల తరువాత. అంతేగాక ఈ సంఘటనకు సంబంధించి పాకిస్తాన్ సైనికుల పాశవిక చర్యలపై ఆధారాలూ లభ్యమయ్యాయి. దీంతో ఈ కిరాతకం ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ ను గట్టిగా హెచ్చరించింది. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టింది. దీంతో దాయాది దేశం తలవంచింది. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన పాకిస్తాన్ నెమ్మదిగా రాజీకి వచ్చింది. నిజంగానే భారత్ కన్నెర్ర చేస్తే పరిస్థితులు చేజారిపోతాయన్న భయంతో అప్పటికైతే తమ సైనికులను వెనక్కి తగ్గాల్సిందిగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే భారత్ పై కవ్వింపులకు పాల్పడుతున్నది వాస్తవమేనని పరోక్షంగా అంగీకరించింది. కానీ, భారత ప్రభుత్వం మాత్రం కంటితుడుపు చర్యలతో మమ అనిపించుకుంది. ఆ దేశంతో కుదుర్చుకున్న సులభతర వీసా ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇటు శివసేన, బిజెపితో పాటు పలు సంస్థల నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం హాకీ ఇండియా లీగ్ నుండి 9 మంది పాకిస్తాన్ క్రీడాకారులను వారి దేశానికి పంపించింది.


దేశ సరిహద్దుల్లో పాక్ సైనికుల అక్రమాలను బలంగా ఎదుర్కొంటామని సైనికాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ నిర్ణయం ఖరారైతే తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామన్న సంకేతాలు కేంద్రప్రభుత్వ ఉదాసీన వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి.

ఉల్లంఘన నిత్యకృత్యం 

సరిహద్దుల్లో గతేడాది నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ విచ్చలవిడిగా ఉల్లంఘిస్తోంది. భారత భూభాగంలో మందుపాతరలు పెట్టి పేల్చడాన్ని కూడా భారత సైన్యం ఆధారాలతో సహా నిరూపించింది. ఓ వైపు సైనికుల అమానుష హత్య తరువాత ఇరుదేశాల ఉన్నత సైన్యాధికారులు సమావేశమైన సమయంలో కూడా పాక్ సైన్యాలు సరిహద్దుల్లో మూడుచోట్ల కాల్పులకు పాల్పడటం వారి కండకావరానికి నిదర్శనంగా నిలుస్తోంది. భారత్ లోకి ఉగ్రవాదులను జొప్పించేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవడంతో, పాకిస్తాన్ నిస్పృహతో ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందని సైనికాధికారులు అభిప్రాయపడుతున్నారు. 

- హంసినీ సహస్ర