స్వదేశంలో హిందువులు అనాధలా?


1947లో భారతదేశ విభజన సమయం నాటికి పాకిస్తాన్ లో నివాసం ఉంటున్న ఎన్నో లక్షల హిందూ కుటుంబాలు ఇళ్ళను, ఆస్తులను వదిలేసి ప్రాణ భయంతో భారత్ కు వలస వచ్చాయి. నాడు జరిగిన మత కల్లోలాలలో ప్రస్తుత పాకిస్తాన్ లో హిందువులు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులయ్యారు. కుటుంబాలు విచ్చిన్నమయ్యాయి. ఆ స్థితిలో కూడా పుట్టిన నేల మీద మమకారాన్ని వదులుకోలేని కొన్ని కుటుంబాలు అక్కడే మిగిలిపోయాయి. పాకిస్తాన్ ఆవిర్భావం తరువాత లౌకిక దేశంగా పేర్కొన్నప్పటికీ జియా-ఉల్-హక్ సైనిక పాలన నుండి క్రమంగా ఇస్లామిక్ దేశంగా రూపాంతరం చెందింది. ఇస్లాం అక్కడి ప్రభుత్వానికి అధికారిక మతంగా అమలైంది. ప్రారంభంలో పాకిస్తాన్ ఆవిర్భావం సమయంలో 22% ఉన్న హిందువుల జనాభా ప్రస్తుతం 2 శాతానికి పడిపోయింది. 400కు పైగా ఉన్న హిందూ దేవాలయాల సంఖ్య 26కు పడిపోయింది. హిందువుల ఆడపిల్లలను కిడ్నాప్ చేయటం, బలవంతపు వివాహాలు చేయడం ద్వారా మతం మారుస్తున్నారు. ఇటువంటి బలవంతపు మతమార్పిడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వాటిని నియంత్రించటానికి అక్కడ హిందూ మైనారిటీలకు చట్టాలు లేవు. హిందువులను అపహరించుకొని పోయి విడుదలకు లక్షల్లో డబ్బు డిమాండ్ చేస్తున్నారు. లేదా వారి ఆస్తులను, గృహాలను దౌర్జన్యంగా ఆక్రమించుకొంటున్నారు. ఇదీ పాకిస్తాన్ లోని హిందూ మైనారిటీల దుస్థితి. దీని గురించి ప్రపంచ మానవ హక్కుల సంస్థలైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గానీ, అంతర్జాతీయంగా పని చేస్తున్న ఇతర మానవ హక్కుల పరిరక్షణ సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు గాని, మీడియా గాని పట్టించుకోవడం లేదు. 

ఒకవైపు పాకిస్తాన్ లోని హిందువుల పరిస్థితి ఇలా ఉండగా, మరోవైపు స్వదేశమైన భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, బెంగాల్ లోని హిందువుల పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్ నుండి కుప్పలు తెప్పలుగా భారత సరిహద్దు జిల్లాల్లోకి ప్రవేశిస్తున్న ముస్లిం అక్రమ చొరబాటు దారులు అక్కడి గ్రామాలలో, పట్టణాలలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని, స్థానిక హిందువుల ఆస్తులను, గృహాలను దౌర్జన్యంగా ఆక్రమించుకొంటున్నారు.  ఈ విధంగా అక్రమ వలసదారులుగా వచ్చిన మహమ్మదీయ వర్గాల వారు స్థానికంగా ఓటర్ల జాబితాలో అక్రమంగా చేరి, రేషన్ కార్డులనూ, ఆధార్ కార్డులనూ సంపాదించుకొని భారత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న అనేక ప్రభుత్వ పథకాలను అనుభవిస్తూ, హిందువులకు చివరకు ఉపాధి అవకాశాలు సైతం దొరకని పరిస్థితిని సృష్టిస్తున్నారు. దాని పర్యవసానమే తాజాగా అస్సాంలో చెలరేగిన అల్లర్లకు నేపథ్యం.  

బంగ్లాదేశ్ నుండి వచ్చే అక్రమ చొరబాటు దారుల నియంత్రణకు అనేక చట్టాలున్నాయి. భారత అత్యున్నత న్యాయస్థానం అనేకసార్లు తీవ్రంగా హెచ్చరించింది. అయినప్పటికీ ముస్లిం మైనారిటీ ఓటుబ్యాంకుపై  ఆధారపడి ఉన్న కేంద్రం, ఆయా రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ పరిస్థితి భారతదేశంలో ఎంత తీవ్ర రూపం దాల్చిందంటే ఉత్తర, దక్షిణ భారత దేశంలో మైదాన ప్రాంతాలలో ఉద్యోగాల కోసం వచ్చిన ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, ఇస్లామిక్ తీవ్రవాద వర్గాల ఎస్.ఎం.ఎస్. బెదిరింపులకు భయపడి స్వరాష్ట్రాలకు (ఈశాన్య రాష్ట్రాలకు) తిరిగి పోతున్నారు. ఈ పరిస్థితులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేస్తున్నాయే కాని, బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. 

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, గృహశాఖ మంత్రి చిదంబరం కేవలం ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నారే తప్ప బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను రాకుండా నియంత్రించడం కాని, వచ్చిన వారిని తిరిగి పంపేందుకు గాని చర్యలు తీసుకోవడం లేదు. కనీసం కఠిన చర్యలు తీసుకొంటామనే ప్రకటన కూడా చేయటం లేదు.

పై పరిస్థితులలో స్వదేశంలో కూడా హిందువులు మైనారిటీ వర్గం వారి బెదిరింపులకు లోనై అనాధలుగా గడపాల్సిందేనా?

- పతికి